ఆ ఆరోపణలపై విచారణ జరపాల్సిందే.. | Retired Justice Krishnamohan Reddy comments with Sakshi | Sakshi
Sakshi News home page

ఆ ఆరోపణలపై విచారణ జరపాల్సిందే..

Published Sun, Oct 18 2020 2:53 AM | Last Updated on Sun, Oct 18 2020 8:39 AM

Retired Justice Krishnamohan Reddy comments with Sakshi

సాక్షి, అమరావతి : వ్యక్తుల కంటే వ్యవస్థలే గొప్పవని, ఆ వ్యవస్థల్లో పనిచేసే వ్యక్తులపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గురిజాల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. చట్టం ముందు అందరూ సమానులేనని.. చిరుద్యోగి అయినా, ఉన్నతోద్యోగి అయినా విచారణను ఎదుర్కోవాల్సిందేనని స్పష్టంచేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని.. వారికి అనుమానాలు, సందేహాలు కలిగేలా వ్యవస్థలోని పెద్దలు వ్యవహరించకూడదన్నారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, నలుగురు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తులపై సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆధారసహితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కి ఇటీవల ఫిర్యాదు చేయడం తదితర అంశాలపై జస్టిస్‌ కృష్ణమోహన్‌రెడ్డి ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

విచారణ జరిపితేనే కదా అవి ఆరోపణలో.. వాస్తవాలో తెలిసేది
సీఎం జగన్‌ సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిపై ఆరోపణలు చేశారు. తన ఆరోపణలకు ఆధారాలను సమర్పించారు. వాటిపై సీజేఐ స్పందించి విచారణ జరిపించాలి. ప్రాథమిక ఆధారాలుంటే చర్యలు తీసుకోవాలి. సీఎంవి ఆరోపణలు అంటున్నాం. కాబట్టి విచారణ జరిపితే అవి ఆరోపణలా? లేక వాస్తవాలా అన్నది తేలిపోతుంది. చట్టం ముందు అందరూ సమానులే కదా. ప్రజాస్వామ్య పరిరక్షణలో కోర్టులది చాలా ముఖ్య భూమిక. న్యాయస్థానాలు చాలా బాధ్యతాయుతంగా ఉండాలి. ఎందుకంటే.. సమాజంలో చెడును నియంత్రించడంలో వాటిది కీలకపాత్ర. మనస్సులో ఏదో పెట్టుకుని చేస్తున్నాయన్న భావన, అనుమానాలు ప్రజల్లో కలిగించకుండా చూసుకోవాల్సిన బాధ్యత న్యాయస్థానాలపై ఉంది. దీనివల్ల వ్యవస్థ ప్రతిష్ట పెరుగుతుంది. న్యాయస్థానాలు సరిగ్గా ఉన్నప్పుడు  తప్పులు జరగడానికి అవకాశం తక్కువగా ఉంటుంది. కోర్టులు సరిగ్గాలేవని నేను చెప్పడంలేదు. అలాగే, కేసులున్నాయి కాబట్టి వాటి నుంచి బయటపడటానికి వైఎస్‌ జగన్‌ ఈ ఫిర్యాదు చేశారని కొందరు అంటున్నారు. అవి అర్థంలేని మాటలు. తన దృష్టికి వచ్చిన వాటిపై సీజేఐకి ఫిర్యాదు చేసే హక్కు సీఎంకి ఉంది. దానికి ఇంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం లేదు. సీజేకు ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు.

కోర్టులూ చట్ట ప్రకారం విధులు నిర్వర్తించాలి
కాగ్నిజబుల్‌ నేరం ఉంటే దర్యాప్తు అధికారి కానీ, ఎస్‌హెచ్‌వో కానీ దర్యాప్తు చేయాలి. ఈ అధికారాన్ని చట్టాలు, శాసనాలు సదరు అధికారికి కట్టబెట్టాయి. దర్యాప్తు చేయకుండా దర్యాప్తు అధికారిని అడ్డుకోవడానికి వీల్లేదు. దర్యాప్తును ఆపడానికి కూడా వీల్లేదు. న్యాయస్థానాలు కూడా రాజ్యాంగం, పార్లమెంట్, అసెంబ్లీ చేసిన చట్టాల ప్రకారం విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరూ నడుచుకోరాదు. వాటిని ఉల్లంఘించరాదు. దర్యాప్తు చేసే అధికారాన్ని ఓ చట్టం ఇచ్చినప్పుడు, ఆ అధికారాన్ని కోర్టులు ఎలా అడ్డుకుంటాయి? ఈ విషయంలో న్యాయస్థానాలు చాలా జాగరూకతతో, స్వీయ నియంత్రణతో పనిచేయాల్సి ఉంటుంది.

సుదీర్ఘకాలం స్టేలపై ప్రజల్లో అనుమానాలు
స్టే అన్నది తాత్కాలిక ఉపశమనం కింద న్యాయస్థానాలిచ్చే ఓ ఊరట మాత్రమే. వీటిని ఏళ్ల తరబడి అలా కొనసాగించడానికి వీల్లేదు. ఈ విషయాన్ని ఇటీవల, తాజాగా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. అయితే.. స్టేలు 15–16 ఏళ్లపాటు కొనసాగుతుండటంతో ప్రజల్లో అనేక అనుమానాలు కలుగుతున్నాయి. వీటిని దూరం చేయడానికి కోర్టులు తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చి 16 నెలలవుతోంది. ఈ స్వల్ప కాలంలో హైకోర్టు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ జీఓలపై స్టేలు ఇచ్చింది. చాలా కేసుల్లో హైకోర్టు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కావాలనే తీర్పులిస్తోందా? అన్న సందేహాలు, అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇలాంటి అనుమానాలకు తావిచ్చేలా న్యాయస్థానాలు వ్యవహారశైలి ఉండకూడదు. కేసులు కూడా కొందరు న్యాయమూర్తుల వద్దకే వస్తున్నాయని, వారే కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులిస్తున్నారన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఇక ఇళ్ల స్థలాలపై స్టే గురించి కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇన్ని అనుమానాలు ప్రజల్లో ఎందుకు కలిగించాలి? 

అనుమానాలకు ఆస్కారం ఇవ్వనేకూడదు
విశ్రాంత న్యాయమూర్తులు జస్టిస్‌ గోపాల్‌రావు, జస్టిస్‌ లక్ష్మణ్‌రెడ్డి, సీనియర్‌ పాత్రికేయులు ఏబీకే ప్రసాద్‌ మరికొందరు రాజధానిపై పిటిషన్‌ వేశారు. ఆ పిటిషన్‌ను పూర్తిస్థాయిలో విచారించలేదు. కానీ, ఆ తరువాత దాఖలైన వ్యాజ్యాలు మాత్రం పరిష్కారం అవుతున్నాయి. రాజధానిపై అనేక కేసులను విచారిస్తున్నారు. ఇలాంటి అపోహలకు ఆస్కారం ఇవ్వకూడదన్నదే నా అభిప్రాయం. 

తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి?
ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతాయుతంగా పనిచేయాలి. ఓ చిన్న ఉద్యోగి లంచం తీసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తే వాటిపై విచారణ జరపాల్సిందే కదా. అవి రుజువైనప్పుడు, దాని ప్రభావం వ్యవస్థపై తక్కువగా ఉంటుంది. అదే ఓ ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రుజువైనప్పుడు దాని ప్రభావం వ్యవస్థపై చాలా తీవ్రంగా ఉంటుంది. వాటిని విచారించకుండా అలా వదిలేస్తే వ్యవస్థ మనుగడ ప్రశ్నార్థకమయ్యే ప్రమాదముంది. ఇది అన్నింటికన్నా ప్రమాదం. కాబట్టి ఫిర్యాదు అందినప్పుడు విచారణ జరిపి నిజానిజాలు తేల్చడం వ్యవస్థకే మంచిది. అసలు తప్పు చేయకుంటే భయపడాల్సిన అవసరం ఏముంది? ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు విచారణకు సహకరించి నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement