Justice Reddappa Reddy
-
ఆ ఆరోపణలను న్యాయమూర్తులు ఖండించలేదు
సాక్షి, అమరావతి: సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణపై సీఎం వైఎస్ జగన్ ఫిర్యాదు చేయడంలో గానీ, ఆ ఫిర్యాదును బహిర్గతం చేయడంలో గానీ ఎంత మాత్రం తప్పులేదని అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్ప రెడ్డి అన్నారు. ‘న్యాయపరంగా మాట్లాడాలంటే ఆ ఆరోపణలు వాస్తవమని భావించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తిపై, కొందరు హైకోర్టు న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలను వారు ఇప్పటి వరకు ఖండించలేదు. ఖండనతో వస్తే, అప్పుడు ముఖ్యమంత్రి తగిన చర్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి న్యాయపరంగా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అలాంటి పరిస్థితి రాలేదు’ అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆయన “సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఏ రకంగా తప్పవుతుంది? సుప్రీంకోర్టు న్యాయమూర్తి మీద ఫిర్యాదు ఇచ్చింది సాధారణ వ్యక్తేమీ కాదు. రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రిగా ఏ వ్యక్తి ఉన్నరాన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఫిర్యాదు ఏంటి? ఆ ఫిర్యాదును బలపరిచేలా ఆధారాలున్నాయా? అన్నదే ముఖ్యం. న్యాయమూర్తులపై ఓ ముఖ్యమంత్రి కేంద్రానికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడం అన్నది ఇదే మొదటిసారి కాదు. నేను 1961లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యాను. అప్పుడు జస్టిస్ చంద్రారెడ్డి ప్రధాన న్యాయమూర్తి. ఆయనపై దామోదరం సంజీవయ్య 9 పేజీల ఫిర్యాదు పంపారు. ఆ ఫిర్యాదులో చాలా ఆరోపణలు చేశారు. ఆ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోవడం జరిగింది. అంతిమంగా అది జస్టిస్ చంద్రారెడ్డి బదిలీకి దారి తీసింది. జస్టిస్ చంద్రారెడ్డి మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు. కాబట్టి సీజేఐకు లేఖ రాయడంలో తప్పేమీ లేదు. బహిర్గతం చేయడం తప్పేమీ కాదు లేఖ రాసినప్పుడు దానిని బహిర్గతం చేయడం కూడా తప్పు కాదు. ముఖ్యమంత్రి లేఖ రాశారు.. దానిని ప్రభుత్వ ప్రతినిధిగా అజయ్ కల్లం ప్రెస్‌కు రిలీజ్ చేశారు. ఇందులో తప్పు ఎంత మాత్రం లేదు. సుప్రీంకోర్టుకు గానీ, సుప్రీంకోర్టులో రెండో స్థానంలో ఉన్న న్యాయమూర్తి గానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ గానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తులు గానీ సుమోటోగా కోర్టు ధిక్కార చర్యలకు ఉపక్రమించవచ్చు. అయితే ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదు. ప్రధాన మంత్రి సుమోటోగా స్పందించవచ్చు ముఖ్యమంత్రి చేసిన ఆరోపణలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఓ విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. వాస్తవానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తులెవ్వరూ కూడా సీజేకు సబార్డినేట్స్ కారు. ప్రధాన న్యాయమూర్తి ముగ్గురు లేదా నలుగురు లేదా ఐదుగురితో కమిటీ వేయొచ్చు. వారి నుంచి ఓ నివేదిక కోరవచ్చు. ముఖ్యమంత్రి ఇక్కడ ప్రధాన మంత్రికి లేఖ రాయలేదు. రాష్ట్రపతికి కూడా రాయలేదు. న్యాయమూర్తులను నియమించే అధికారం రాష్ట్రపతికి ఉన్నప్పటికీ, ఆయన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోలేరు. అయితే ప్రధాన మంత్రి మాత్రం సుమోటోగా ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవచ్చు. విచారణ జరిపించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసి వివరణ కూడా కోరవచ్చు. -
ప్రాణహితకు జాతీయ హోదా కష్టమే
సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి పద్మనాభరెడ్డి వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా దక్కడం కష్టమేనని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రాష్ట్ర అధ్యక్షుడు జస్టిస్ రెడ్డపరెడ్డి, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అభిప్రాయపడ్డారు. అంతర్రాష్ట్ర వివాదాలు, పర్యావరణ, అటవీ, నీతి ఆయోగ్ అనుమతులు, ప్రాజెక్టుకయ్యే వ్యయం తేలకుండా జాతీయ హోదా ఎలా దక్కుతుందని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. 2004 నుంచి ప్రాజెక్టుకు జాతీయ హోదా అంటూ ప్రకటనలు చేస్తూ వచ్చారని, వాస్తవాలు ప్రజలకు తెలిసేలా ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జస్టిస్ రెడ్డపరెడ్డి, పద్మనాభరెడ్డి గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదంటూనే ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారని పలు ప్రశ్నలు సంధించారు. * ప్రాజెక్టుకు రూ.50 వేల కోట్ల వ్యయమవుతుంది. ఆలస్యమైతే వ్యయం మరింత పెరగవచ్చు. ప్రాజెక్టు పూర్తయితే 12 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ప్రస్తుత అంచనా ఖర్చు మేరకు ఎకరానికి రూ.4 లక్షల ఖర్చు అవుతోంది. ఇక 1,200 అడుగుల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోయాలంటే 2,527 మెగావాట్ల విద్యుత్ అవసరం. దీనికి ఏడాదిలో ఒక్కో ఎకరానికి లెక్కిస్తే రూ.15 వేల మేర ఖర్చువుతుంది. ఈ స్థాయిలో విద్యుత్, నిధులు ఎక్కడి నుంచి తెస్తారు? ఇంత ఆర్థిక భారం ఎలా మోస్తారు? * ప్రాజెక్టుతో ముంపునకు గురయ్యే అటవీ భూమికి ఇంతవరకూ పరిహార భూమిని ఇవ్వలేదని అటవీ శాఖ చెబుతోంది. పర్యావరణ అనుమతులు సైతం లభించలేదు. ఎత్తుపై మహారాష్ట్ర అంగీకరించాలి. ఇలా 18 అంశాలపై ఏమీ తేలకుండా జాతీయ హోదా దక్కడం సాధ్యం కాదు. అంతర్రాష్ట్ర వివాద పరిష్కారం కోసం గతంలో కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో చర్చలు జరిగి మండలి ఏర్పాటుకు ఒప్పందం కుదిరినా, అది ఒక్కమారు సైతం సమావేశం కాలేదు. అలాంటప్పుడు కొత్తగా ఏర్పాటు చేసే ఉన్నత స్థాయి కమిటీ ఎంతవరకు పనిచేస్తుంది? * వ్యాప్కోస్ సర్వే నివేదిక ప్రకారం ప్రాణహిత నదిపై ఆనకట్ట అవసరం లేదు. మరి 152 మీటర్ల ఎత్తుతో ఆనకట్ట కట్టాలని, దానికి మహారాష్ట్ర అభ్యంతరం తెలిపిందని, ఎత్తు తగ్గించుకునేందుకు తెలంగాణ ఒప్పుకుందన్న కథనాలపై వివరణ ఇవ్వాలి. * ఒకవేళ ప్రాజెక్టుకు జాతీయ హోదా లభించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం సాధ్యమేనా? * మిషన్ కాకతీయ, వాటర్ గ్రిడ్లకు నాలుగేళ్లలో 48 వేల కోట్లు అంటే సాలీనా 12 వేల కోట్లు అవసరం. అలాంటప్పుడు ప్రాజెక్టుకు ఏడాదికి రూ.5 వేల కోట్లు కేటాయించినా 2025 నాటికైనా ప్రాజెక్టు పూర్తవుతుందా? * పర్యావరణానికి సంబంధించి మొదటి దశ అనుమతులు కూడా ఇవ్వలేదని అటవీ శాఖ చెబుతోంది.. ఇది నిజమేనా? -
ఎన్నికల కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం
- ఒక్క శాతం కేసులు రుజువైనా 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలపై వేటు - సుపరిపాలన వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేశారనే ఆరోపణలపై నమోదైన కేసుల్లో ఒక్క శాతం కేసులు రుజువైనా సుమారు 30 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు అనర్హతకు గురవుతారని సుపరిపాలన వేదిక అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్పరెడ్డి పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన 9,867 కేసుల్లో ఒక్క కేసూ విచారణ పూర్తికాలేదన్నారు. ఎన్నికల కేసుల దర్యాప్తు విషయంలో పోలీసు శాఖ, కేంద్ర ఎన్నికల సంఘం ఉదాసీనతంగా వ్యవహరిస్తున్నాయన్నారు. వేదిక ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి రిటైర్డు ఐఎఫ్ఎస్ అధికారి ఎం.పద్మనాభరెడ్డితో కలిసి జస్టిస్ రెడ్డప్పరెడ్డి గురువారం తమ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో మొత్తం రూ.36 కోట్లకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకుని 1,916 కేసులను నమోదు చేశారన్నారు. బంగారు ఆభరణాలు, ఇతర వస్తువుల పంపిణీ ఆరోపణలపై 398 కేసులు, మద్యం పంపిణీ ఆరోపణలపై 4,974 కేసులు పెట్టారని తెలిపారు. ఆ తర్వాత కేసుల దర్యాప్తును పోలీసు శాఖ విస్మరించిందన్నారు. ఎన్నికల్లో పట్టుబడిన నగదును పోలీసులు ఆదాయ పన్నుల శాఖకు అప్పగించి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు.