
పుస్తకావిష్కరణ సభలో నోరి దంపతులు- జస్టిస్ ఎన్వీ రమణ
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ చికిత్సలో ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు చేస్తోన్న కృషి అమోఘమని, మూర్తీభవించిన మానవత్వానికి ఆయన ప్రతీకని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ కితాబునిచ్చారు. శనివారం కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఆధ్వర్యంలో జరిగిన నోరి దత్తాత్రేయుడు స్వీయ ఆత్మకథ ‘ఒదిగిన కాలం’పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న వివిధ రం గాల ప్రముఖులు ఆయన సేవల్ని ప్రశంసించారు.
ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్ ద్వారా పాల్గొన్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. అమెరికాలో అత్యున్నత వైద్యపరిశోధనను అందుబాటులోకి తెచ్చారని, దేశీయంగానూ ఈ పరిశోధనను అభి వృద్ధి చేసేలా నోరి సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. తెలుగు సమాజానికి ఆయన ఎంతో సేవ చేశారని, తన ఆత్మకథలో అనేక అం శాలు, జీవితపార్శా్వలు, అనుభవాలను పొందుపరిచారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక గురువు విశ్వ యోగి విశ్వంజీ మాట్లాడుతూ.. భారత్‌లో కేన్సర్ పరిశోధనా కేంద్రంతోపాటు ప్రతీ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు జరిగేలా చూడాలన్నారు.
తెలుగుబిడ్డగా ఎంతో గర్వపడుతున్నాను: దత్తాత్రేయుడు
హైదరాబాద్‌లో తెలుగు ప్రజల, మిత్రుల సమక్షం లో తన ఆత్మకథ పుస్తకావిష్కరణ జరగడం ఆనందంగా ఉందని దత్తాత్రేయుడు అన్నారు. బసవతారకం కేన్సర్ ఆస్పత్రి ఏర్పాటుకు జరిపిన కృషిని గుర్తుచేసుకున్నారు. తెలుగుబిడ్డగా తానెంతో గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో మండలి బుద్ధప్రసాద్ డా.నోరి సతీమణి డా.సుభద్ర, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేవీ రమణ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సీఈవో డాక్టర్ ప్రభాకరరావు, డా.పి.జగన్నాథ్, వోలేటి పార్వతీశం, డా.సూర్యప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.