పీవీఆర్ సంస్థ దక్షిణాది నిర్వాహకురాలిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మీనా చాబ్రియా తన జీవిత చరిత్రను అన్ స్టాపబుల్ పేరుతో రాసుకున్నారు. ఈ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం సాయంత్రం చైన్నె, రాయపేటలోని సత్యం థియేటర్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నటి ఐశ్వర్య రాజేష్, మైక్ సెట్ శ్రీరామ్, ఆటో అన్నాదురై, నిర్మాత యువరాజ్ గణేశన్ తదితరులు అతిథులుగా పాల్గొన్నారు.
ఈ వేదికపై నటి ఐశ్వర్య రాజేష్ మాట్లాడుతూ ఈ వేడుకలో పాల్గొనే ముందు తాను మీనా చాబ్రియా గురించి తెలుసుకోదలచానన్నారు. దీంతో ఆమెకు ఫోన్ చేసి అడిగి తెలుసుకుని ఆశ్చర్యపోయానన్నారు. 17 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని 20 ఏళ్ల వయసులోనే విడాకులు పొందిన ఇద్దరు పిల్లల తల్లి ఇంత ఉన్నత స్థానానికి ఎదగడం చూస్తే.. తనకు తన తల్లి జ్ఞాపకం వచ్చిందన్నారు.
సినిమా రంగంలోకి తాను ప్రవేశించిన కొత్తలో నటిగా నువ్వు ఏం చేస్తావు? అని పలువురు ఎగతాళి చేశారన్నారు. అయితే అలాంటి అవమానాలను దాటి ఎదిగి తాను అన్ స్టాపబుల్ గా నిలిచానన్నారు. దీన్ని పేరుగా పెట్టిన మీనా చాబ్రియా రాసిన పుస్తకం మంచి సక్సెస్ కావాలని పేర్కొన్నారు. తాను పుస్తకాలు ఎక్కువగా చదవనని, అయితే ఈ పుస్తకాన్ని చదవాలని భావిస్తున్నట్లు చెప్పారు.
ఇకపోతే తాను మహిళ ఇతివృత్తంతో కూడిన చిత్రాల్లో నటించడం వల్ల తనకు పురుషులంటే ద్వేషం అని భావించరాదన్నారు. తనను స్త్రీ పక్షపాతివా అని కూడా అడుగుతున్నారన్నారు. నిజానికి అలాంటిదేమీ లేదని చెడు అనేది స్త్రీలలోనూ, పురుషుల్లోనూ ఉంటుందని నటి ఐశ్వర్యా రాజేష్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment