
క్రిస్మస్ కేక్ కట్ చేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
గుణదల (విజయవాడ తూర్పు): క్రిస్మస్ పండుగ శాంతి సౌభ్రాతృత్వాలకు ప్రతీక అని, ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు బోధించిన శాంతి మార్గంలో నడుచుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకటరమణ అన్నారు. విజయవాడలోని నోవోటెల్ హోటల్‌లో శనివారం జరిగిన క్రిస్మస్ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటరమణ దంపతులు క్రిస్మస్ కేక్ కట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కులమతాలకు అతీతంగా పౌరులందరూ సోదర భావంతో మెలగాలని కోరారు. ఒకరికొకరు శాంతి సమాధానాలతో నడుచుకున్నపుడే సమాజం పురోగమిస్తుందన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయం ప్రకారం అన్ని మతాలు ఒక్కటేనన్న మార్గాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. అనంతరం కేక్ కట్‌చేసి, ప్రజలందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రొటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రహ్మణ్యం, జాయింట్ కలెక్టర్ ఎల్. శివశంకర్, పలు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.