హిజాబ్‌ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు | SC Refuses to List Challenge Against Karnataka HC Interim Hijab Order on Feb 14 | Sakshi
Sakshi News home page

హిజాబ్‌ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు

Published Sat, Feb 12 2022 4:56 AM | Last Updated on Sat, Feb 12 2022 4:56 AM

SC Refuses to List Challenge Against Karnataka HC Interim Hijab Order on Feb 14 - Sakshi

న్యూఢిల్లీ/ సాక్షి, బెంగళూరు: దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్‌ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌(ఎస్‌ఎల్పీ)  దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది.

కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్‌ అడ్వొకేట్‌ దేవదత్‌ కామత్‌ వాదనలు వినిపించారు. తమ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్‌ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది.

హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూడాలని సూచించింది. స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌పై తాము సరైన సమయంలో విచారణ ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. హిజాబ్‌ అంశాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చొద్దని హితవు పలికింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు. హిజాబ్‌ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు. హిజాబ్‌ కేసులో విచారణ ముగిసే వరకూ విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలు ధరించరాదని ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది.

శాంతిని విచ్ఛిన్నం చేయొద్దు
భారత్‌ లౌకిక దేశమని, ఏదో ఒక మతం ఆధారంగా ఈ దేశం గుర్తింపును నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్‌ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్‌ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్తర్వులో న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. హిజాబ్‌పై వివాదం, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని ధర్మాసనం వెల్లడించింది.

భారత్‌లో బహుళ సంస్కృతులు, మతాలు, భాషలు మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఇష్టమైన మతాన్ని అవలంబించే హక్కు దేశ పౌరులకు ఉందని గుర్తుచేసింది. మనది నాగరిక సమాజమని.. మతం, సంస్కృతి పేరిట శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. అందుకు చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదని పేర్కొంది. మద్రాసు హైకోర్టు సైతం గురువారం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.   

రాజస్తాన్‌కు పాకిన హిజాబ్‌ గొడవ
కర్ణాటకలో మొదలైన హిజాబ్‌ వివాదం ఇప్పుడు రాజస్తాన్‌కు సైతం పాకింది. హిజాబ్‌ ధరించిన వారిని తరగతులకు హాజరు కానివ్వడం లేదని ఆరోపిస్తూ జైపూర్‌ జిల్లాలోని చాక్సు పట్టణంలో ఓ ప్రైవేట్‌ కాలేజీ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. అయితే, విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచే హిజాబ్‌ ధరించి వస్తున్నారని కళాశాల సిబ్బంది చెప్పారు.  కానీ, విద్యార్థినుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము గత మూడేళ్ల నుంచి హిజాబ్‌ ధరించే కాలేజీ వస్తున్నామని, ఎప్పుడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అకస్మాత్తుగా ఇప్పుడే తమను తరగతులకు అనుమతించడం లేదని పేర్కొన్నారు.

16 దాకా వర్సిటీలకు సెలవులు
హిజాబ్‌ వివాదం నేపథ్యంలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ కాలేజెస్‌కు చెందిన విశ్వవిద్యాలయాలకు ఈ నెల 16వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మంత్రి అశ్వత్థ నారాయణ్‌ చెప్పారు. ప్రి–యూనివర్సిటీ(పీయూసీ), డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు విద్యా మంత్రి నగేష్‌ శుక్రవారం తెలిపారు. పీయూసీ, డిగ్రీ కాలేజీల  తరగతులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు  చెప్పా రు. పాఠశాలలను మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి  చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement