interim order
-
హిజాబ్ అంశాన్ని జాతీయ వివాదంగా మార్చొద్దు
న్యూఢిల్లీ/ సాక్షి, బెంగళూరు: దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. విద్యాసంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వును సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్(ఎస్ఎల్పీ) దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ నేతృత్వంలోని ధర్మాసనం శుక్రవారం వెల్లడించింది. కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు దేశ పౌరుల ప్రాథమిక హక్కును భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తుచేశారు. వారి తరపున సీనియర్ అడ్వొకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు. తమ పిటిషన్‌పై ఈ నెల 14న విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. హిజాబ్ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఇప్పటికే విచారణ కొనసాగుతోందని గుర్తుచేసింది. హైకోర్టు ఇచ్చే తుది తీర్పు కోసం వేచి చూడాలని సూచించింది. స్పెషల్ లీవ్ పిటిషన్‌పై తాము సరైన సమయంలో విచారణ ప్రారంభిస్తామని తేల్చిచెప్పింది. హిజాబ్ అంశాన్ని జాతీయ స్థాయి వివాదంగా మార్చొద్దని హితవు పలికింది. కర్ణాటక ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. హిజాబ్ వ్యవహారంలో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వు ఇంకా తమకు అందలేదని పేర్కొన్నారు. హిజాబ్ కేసులో విచారణ ముగిసే వరకూ విద్యాసంస్థల్లో మతపరమైన చిహ్నాలు ధరించరాదని ఆదేశిస్తూ కర్ణాటక హైకోర్టు గురువారం మధ్యంతర ఉత్తర్వు జారీ చేసింది. దీంతో కర్ణాటక ప్రభుత్వం పాఠశాలలను పునఃప్రారంభించాలని నిర్ణయించింది. శాంతిని విచ్ఛిన్నం చేయొద్దు భారత్ లౌకిక దేశమని, ఏదో ఒక మతం ఆధారంగా ఈ దేశం గుర్తింపును నిర్ధారించలేమని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిజాబ్ వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్తీ నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వు శుక్రవారం అందుబాటులోకి వచ్చింది. ఈ ఉత్తర్వులో న్యాయస్థానం పలు అంశాలను ప్రస్తావించింది. హిజాబ్‌పై వివాదం, విద్యాసంస్థల మూసివేత బాధాకరమని ధర్మాసనం వెల్లడించింది. భారత్‌లో బహుళ సంస్కృతులు, మతాలు, భాషలు మనుగడలో ఉన్నాయని తెలిపింది. ఇష్టమైన మతాన్ని అవలంబించే హక్కు దేశ పౌరులకు ఉందని గుర్తుచేసింది. మనది నాగరిక సమాజమని.. మతం, సంస్కృతి పేరిట శాంతి భద్రతలను విచ్ఛిన్నం చేసే అధికారం ఎవరికీ లేదని తేల్చిచెప్పింది. అందుకు చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతి ఇవ్వదని పేర్కొంది. మద్రాసు హైకోర్టు సైతం గురువారం ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. రాజస్తాన్‌కు పాకిన హిజాబ్ గొడవ కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్తాన్‌కు సైతం పాకింది. హిజాబ్ ధరించిన వారిని తరగతులకు హాజరు కానివ్వడం లేదని ఆరోపిస్తూ జైపూర్ జిల్లాలోని చాక్సు పట్టణంలో ఓ ప్రైవేట్ కాలేజీ విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులు శుక్రవారం ప్రదర్శన చేపట్టారు. అయితే, విద్యార్థినులు గత నాలుగైదు రోజుల నుంచే హిజాబ్ ధరించి వస్తున్నారని కళాశాల సిబ్బంది చెప్పారు. కానీ, విద్యార్థినుల వాదన మాత్రం మరోలా ఉంది. తాము గత మూడేళ్ల నుంచి హిజాబ్ ధరించే కాలేజీ వస్తున్నామని, ఎప్పుడూ ఎవరూ అభ్యంతరం చెప్పలేదని, అకస్మాత్తుగా ఇప్పుడే తమను తరగతులకు అనుమతించడం లేదని పేర్కొన్నారు. 16 దాకా వర్సిటీలకు సెలవులు హిజాబ్ వివాదం నేపథ్యంలో డిపార్టుమెంట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాలేజెస్‌కు చెందిన విశ్వవిద్యాలయాలకు ఈ నెల 16వ తేదీ వరకూ సెలవులు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, పరీక్షలు మాత్రం యథాతథంగా జరుగుతాయని ఉన్నత విద్యా మంత్రి అశ్వత్థ నారాయణ్ చెప్పారు. ప్రి–యూనివర్సిటీ(పీయూసీ), డిగ్రీ కాలేజీల పునఃప్రారంభంపై ఈ నెల 14న నిర్ణయం తీసుకొనే అవకాశం ఉన్నట్లు విద్యా మంత్రి నగేష్ శుక్రవారం తెలిపారు. పీయూసీ, డిగ్రీ కాలేజీల తరగతులు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పా రు. పాఠశాలలను మళ్లీ తెరుస్తున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుం డా చర్యలు తీసుకోవాలని హోంమంత్రి చెప్పారు. -
వారిద్దరిపై బలవంతపు చర్యలొద్దు..
సాక్షి, హైదరాబాద్: రియల్టర్ శ్రీధర్‌రావు, ఆయన భార్య సంధ్యలపై అరెస్టు లాంటి బలవంతమైన చర్యలు చేపట్టరాదని హైకోర్టు నార్సింగి పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ జి.శ్రీదేవి బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. నార్సింగి పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వీరిద్దరు దాఖలు చేసిన పిటిషన్‌ను న్యాయమూర్తి విచారించారు. ఈ వ్యవహారంపై కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈనెల 22కు వాయిదా వేశారు. -
చిదంబరానికి మరోసారి ఊరట
సాక్షి,న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్‌నేత పి.చిదంబరానికి మరోసారి ఊరట లభించింది. ఆగస్టు1వ తేదీ వరకు చిదంబరంను అరెస్టు చెయ్యొద్దని ఢిల్లీ హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు కోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరో నెల రోజుల పాటు గడువును పొడిగించాల్సిందిగా చిదంబరం కోర్టును కోరారు. ఆయన విజ్ఞప్తిని పరిశీలించిన జస్టిస్ ఎ.కె.పాథక్ ఇందుకు అంగీకరించారు. దీనికి సంబంధించి ఎలాంటి అరెస్టు చేపట్టవద్దని సీబీఐని న్యాయమూర్తి ఆదేశించారు. తదుపరి విచారణకు ఆగస్టు 1కి వాయిదా వేశారు. కాగా ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబరం అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 2007లో చిదంబరం కేంద్ర ఆర్థిక మంత్రిగా ఉన్నసమయంలో దాదాపు రూ. 305 కోట్ల మేర విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్ఐపిబి) ద్వారా అక్రమ విదేశీ నిధులను స్వీకరించారని ఆరోపిస్తూ సీబీఐ సిఐడి గత మే 15న కేసు నమోదు చేసింది ఈ కేసులో చిదంబరం కుమారుడు కార్త అరెస్ట్‌అయ్యి, బెయల్‌పై విడుదలైన సంగతి తెలిసిందే. -
‘గ్రీన్ ఫార్మాసిటీ’ ఏ1నోటీసుపై స్టే
8 వారాలపాటు నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు {పభుత్వానికి నోటీసులు.. కౌంటర్ల దాఖలుకు ఆదేశం తదుపరి విచారణ 2 వారాలకు వాయిదా హైదరాబాద్: గ్రీన్ ఫార్మాసిటీ కోసం అవసరమైన 493 ఎకరాల భూమిని చర్చలు, సంప్రదింపుల ద్వారా కొనుగోలు చేసేందుకు వీలుగా మండల తహసీల్దార్ ఈ ఏడాది జనవరిలో జారీ చేసిన ఏ1 నోటీసు అమలును హైకోర్టు తాత్కాలికంగా నిలిపేసింది. ఎనిమిది వారాల పాటు నోటీసు అమలును నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించారు. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట గ్రామంలో ఈ ఫార్మాసిటీ నిర్మించతలపెట్టిన విషయం విదితమే. అయితే చర్చల ద్వారా భూముల కొనుగోలు చేసే నిమిత్తం గత ఏడాది జూలైలో ప్రభుత్వం జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ ఎం.భారతమ్మ, మరికొందరు హైకోర్టును ఆశ్రయించారు. ఈ జీవో ద్వారా కందుకూరు మండలంలోని సర్వే నంబర్ 112లోని 493 ఎకరాల భూములను గ్రీన్ ఫార్మాసిటీ కోసం కొనుగోలు చేసేందుకు తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసును కూడా వారు సవాలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు విచారణ చేపట్టారు. 2013 భూ సేకరణ చట్టాన్ని అమలు చేయకుండా తప్పించుకోవడానికే ప్రభుత్వం ఈ జీవో 45 జారీ చేసిందని పిటిషనర్ల తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. పిటిషనర్లందరూ కూడా అసైన్మెంట్ పట్టాదారులని వివరించారు. సంప్రదింపుల పేరుతో భూములను బలవంతంగా తీసుకోవడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారన్నారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ న్యాయవాది తోసిపుచ్చారు. స్వచ్ఛందంగా భూములను కొనుగోలు చేసే వ్యవహారంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే వాటిని తెలుసుకునేందుకే తహసీల్దార్ ఏ1 నోటీసు జారీ చేశారని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. తహసీల్దార్ జారీ చేసిన ఏ1 నోటీసు అమలును ఎనిమిది వారాల పాటు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆ ఒక్కటి వదిలేస్తే..!
ఇంకెక్కడ స్థలం కావాలన్నా ఓకే ఒకవైపు స్వాధీనానికి నోటీసులు.. మరోవైపు బేరసారాలు బడాబాబుల పక్షాన వుడా ద్వంద్వవైఖరి అలా కుదరదన్న కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ వందలాది స్థలాలు ఖాళీగా ఉన్నా పట్టించుకోలేదు అడ్డగోలుగా ముందుకెళ్లి.. బోల్తా పడిన వుడా నిబంధనలు అలా ఉన్నాయంటున్నారు.. ఏళ్ల తరబడి ఖాళీగా ఉంటే స్వాధీనం చేసుకుని తీరుతామని బీరాలు పోతున్నారు. కానీ నగరంలో ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ఇచ్చిన వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఖాళీగానే పడున్నాయి. అడపదడపా నోటీసులివ్వడం తప్ప.. వాటి జోలికి ఏనాడూ వెళ్లని వుడా బాబులు.. కేంద్ర ప్రభుత్వ సంస్థకు ఇచ్చిన స్థలం విషయంలో ఎందుకింత కఠినంగా వ్యవహరించారని ఆరా తీస్తున్న కొద్దీ కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. పైగా స్వాధీనం చేసుకుంటామన్న వారు.. మధ్యలో దాన్ని వదిలేసుకుంటే.. ప్రత్యామ్నాయంగా మరో స్థలం ఇస్తామని బేరాసారాలకు దిగడమేమిటన్న తాజా వివాదం రాజుకుంటోంది. విశాఖపట్నం : వంద కోట్ల విలువైన ఎన్ఎండీసీకి చెందిన భూమిని వెనక్కి తీసుకోవాలన్న వుడా వివాదాస్పద నిర్ణయం వెనుక మరో కోణం వెలుగుచూస్తోంది. పాతికేళ్ల క్రితం ఎన్ఎండీసీ కొనుగోలు చేసిన అర ఎకరా భూమిని అడ్డగోలుగా స్వాధీనం చేసుకుని ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రైవేటు లిమిటెడ్‌కు నామమాత్రపు ధరకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో వుడా బరితెగింపునకు అడ్డుకట్ట పడినా.. తెరవెనుక జరిగిన వ్యవహారాలు ఇప్పుడు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. ఖాళీగా వందలాది స్థలాలు ఏళ్ల తరబడి ఎటువంటి నిర్మాణాలు చేపట్టకుండా ఖాళీగా వదిలేయడం వల్లే బీచ్‌రోడ్డులో ఉన్న జాతీయ ఖనిజాభివృద్ధి సంస్ఖ (ఎన్ఎండీసీ) స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చర్యలు చేపట్టామని వుడా అధికారులు బీరాలు పోతున్నారు. నిబంధనల మేరకే అలా చేశామని వాదిస్తున్నారు. వాస్తవానికి అలా ఖాళీగా వదిలేసిన స్థలాలు నగరంలో లెక్కలేనన్ని ఉన్నాయి. ఆయా స్థలాల యజమానులకు అడపాదడపా నోటీసులు ఇవ్వడం తప్పించి ఒక్క గజం భూమిని కూడా స్వాధీనం చేసుకునేందుకు వుడా అధికారులు కనీస చర్యలు చేపట్టలేదు. కానీ ఏకంగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండీసీ స్థలానికి ఎసరు పెట్టేందుకు మాత్రం నిబంధనలను సాకుగా చూపించారు. మరోవైపు ఎన్ఎండీసీతో తెరవెనుక రాయబేరాలూ సాగించారు. బీచ్ రోడ్డులోని స్థలం అప్పజెబితే..నగరంలో ఎక్కడ కావాలంటే అక్కడ మరో స్థలం ఇస్తామని హామీ ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే స్వాధీనం చేసుకోవాలే గానీ.. ప్రత్యామ్నాయ స్థలం ఇస్తామని బేరం పెట్టడం చూస్తే.. వుడా కుట్ర ఏమిటో అర్థమవుతుంది. ఇంటర్ గ్లోబ్ ఎంచుకున్న స్థలమట పర్యాటకాభివృద్ధి కోసం రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టాలన్న ప్రభుత్వ ఆహ్వానంపై జాతీయస్థాయి కార్పొరేటు సంస్థలు ఇటీవల విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల్లో పర్యటించాయి. ఆ క్రమంలో విశాఖలో పర్యటించిన ఇంటర్ గ్లోబ్ హోటల్స్ ప్రతినిధులను బీచ్ రోడ్డులో సువిశాలంగా ఉన్న ఎన్ఎండీసీకి చెందిన ఖాళీ స్థలం ఆకర్షించింది. ఇక్కడైతే స్టార్ హోటల్ కట్టేందుకు తాము సిద్ధమని అప్పటికప్పుడే వారు ప్రకటించేశారు. పర్యాటకశాఖ అధికారులు ఈ విషయమై జీవీఎంసీ, రెవెన్యూ ఉన్నతాధికారులతో మాట్లాడగా, అది గతంలో వుడా విక్రయించిన స్థలమని తేలింది. అంతే.. ఆ స్థలాన్ని ఎలాగైనా స్వాధీనం చేసుకునే పనిని ప్రభుత్వ పెద్దలు వుడా అధికారులకు అప్పజెప్పారు. మొదట్లో వుడా అధికారులు తటపటాయించినా బడాబాబులు రంగప్రవేశం చేయడంతో అడ్డగోలుగా ముందుకు వెళ్లిపోయారు. ఆ భూమిని వెనక్కి తీసుకునే ప్రక్రియను వేగవంతం చేశారు. కండిషనల్ రిజిస్ట్రేషన్‌లో ఉన్న నిబంధనను తెరపైకి తెచ్చి స్థలాన్ని వెనక్కి తీసుకునేందుకు నోటీసులిచ్చారు. వుడా అధికారులకు అక్కడా అవమానమే.. ఖాళీగా ఉన్న స్థలంలో వెంటనే నిర్మాణాలు చేపడతామని, వెనక్కి తీసుకునే చర్యలు ఉపసంహరించుకోవాలన్న ఖనిజాభివృద్ధి సంస్థ విశాఖ అధికారుల గోడును పట్టించుకోని వుడా అధికారులు.. ఇదే సమయంలో ఎన్ఎండీసీ ఉన్నతస్థాయి అధికారులతో రాయబేరం నడిపారు. బీచ్‌రోడ్డు పక్కన స్థలాన్ని వదిలేస్తే ప్రత్యామ్నాయంగా మీకు మరో చోట స్థలం ఇస్తామనే ప్రతిపాదన తీసుకొచ్చారు. వెంటనే కావాలంటే రుషికొండ సమీపంలో ఇప్పటికే నిర్మించిన రే హౌసింగ్ ప్లాట్స్ ను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు వుడా వీసీ టి.బాబూరావునాయుడు మే నెలలో హైదరాబాద్ వెళ్లి ఎన్ఎండీసీ చైర్పర్సన్ భారతి ఎస్.సిహాగ్ను కలిసేందుకు ప్రయత్నించారు. వుడా వ్యవహారశైలితో గుర్రుగా ఉన్న ఆమె వీసీకి కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని తెలిసింది. దీంతో ఆగ్రహించిన వుడా అధికారులు ఈ నెల 6న ఎన్ఎండీసీకి కేటాయించిన స్థలాన్ని వెనక్కి చేసుకుంటామంటూ నోటీసులు జారీ చేశారు. దీనిపై ఎన్ఎండీసీ ఉన్నతాధికారులు హైకోర్టుకు వెళ్లడంతో వుడా నిర్ణయాన్ని రద్దు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక కేంద్ర గనులు, ఉక్కు శాఖ మంత్రి తోమర్ ఎన్ఎండీసీకి జరిగిన అన్యాయంపై ప్రధాని నరేంద్రమోదీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ఓ పక్క కోర్టు అక్షింతలు, మరో పక్క కేంద్ర ప్రభుత్వ పెద్దల ఆగ్రహావేశాలతో వుడా పరువు నట్టేట మునిగినట్టయిందని స్వయంగా వుడా వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
ఆదిత్యనాథ్ దాస్ కు హైకోర్టులో ఊరట
♦ ఆయనపై విచారణ ప్రక్రియ నిలిపివేత ♦ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌కు చేసిన నీటి కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టులో ఆదిత్యనాథ్ దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా, కాగ్నా నదుల నుంచి ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల విషయంలో అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆదిత్యనాథ్ దాస్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఆదిత్యనాథ్ దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయని తెలిపారు. అనుమతి లేనప్పుడు సీబీఐ చేసిన అభియోగాల్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. అంతర్రాష్ట్ర జలమండలి అనుమతుల్లేకుండా నీటి కేటాయింపులు చేశారన్నది సీబీఐ ఆరోపణ అని, అయితే అనుమతులున్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదని తెలిపారు. ఈ వాదనలతో సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు విభేదించారు. దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించినప్పటికీ ఐపీసీ కింద కేసుల్ని విచారించవచ్చునన్నారు. ఈ దశలో కేసు విచారణను నిలిపివేయరాదని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి సీబీఐ కోర్టులో దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేశారు.