ఆదిత్యనాథ్ దాస్ కు హైకోర్టులో ఊరట
♦ ఆయనపై విచారణ ప్రక్రియ నిలిపివేత
♦ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: జగన్ కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో ఇండియా సిమెంట్స్‌కు చేసిన నీటి కేటాయింపులపై సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితునిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్‌కు హైకోర్టులో ఊరట లభించింది. సీబీఐ కోర్టులో ఆదిత్యనాథ్ దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ న్యాయమూర్తి జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. కృష్ణా, కాగ్నా నదుల నుంచి ఇండియా సిమెంట్స్‌కు నీటి కేటాయింపుల విషయంలో అప్పటి నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి హోదాలో ఆదిత్యనాథ్ దాస్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ ఆయనపై కేసు నమోదు చేసింది. దీనిపై చార్జిషీట్ కూడా దాఖలు చేసింది.
ఈ కేసుపై సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ ఆదిత్యనాథ్ దాస్ పిటిషన్ వేశారు. దీనిపై జస్టిస్ రాజా ఇలంగో శుక్రవారం విచారణ జరిపారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఈ కేసులో ఆదిత్యనాథ్ దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించాయని తెలిపారు. అనుమతి లేనప్పుడు సీబీఐ చేసిన అభియోగాల్ని ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకోవడం సరికాదన్నారు. అంతర్రాష్ట్ర జలమండలి అనుమతుల్లేకుండా నీటి కేటాయింపులు చేశారన్నది సీబీఐ ఆరోపణ అని, అయితే అనుమతులున్న విషయాన్ని సీబీఐ పట్టించుకోలేదని తెలిపారు.
ఈ వాదనలతో సీబీఐ తరఫు న్యాయవాది కేశవరావు విభేదించారు. దాస్ విచారణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతి నిరాకరించినప్పటికీ ఐపీసీ కింద కేసుల్ని విచారించవచ్చునన్నారు. ఈ దశలో కేసు విచారణను నిలిపివేయరాదని కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి సీబీఐ కోర్టులో దాస్‌పై జరుగుతున్న విచారణ ప్రక్రియను నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చారు. కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను జూన్‌కు వాయిదా వేశారు.