జస్టిస్ ఎన్వీ రమణకు మాతృవియోగం
► నివాళులు అర్పించిన న్యాయమూర్తులు,
హైకోర్టు సిబ్బంది
► నేడు హైదరాబాద్‌లో అంత్యక్రియలు
సాక్షి, హైదరాబాద్: సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణకు మాతృవియోగం కలిగింది. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టిస్ రమణ తల్లి నూతలపాటి సరోజినీదేవి (85) బుధవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. సాయంత్రం ఆమె పార్థివ దేహాన్ని ఎస్‌ఆర్ నగర్‌లోని స్వగృహానికి తీసుకువచ్చారు. సరోజినీదేవి మరణ వార్త తెలిసిన వెంటనే పలువురు న్యాయమూర్తులు, న్యాయాధికారులు, హైకోర్టు సిబ్బంది జస్టిస్ రమణ నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.
గురువారం ఉదయం 11 గంటల సమయంలో ఈఎస్‌ఐ హిందూ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ పొన్నవరానికి చెందిన గణపతి, సరోజినీదేవి దంపతులు. వారికి సుప్రీం న్యాయమూర్తిగా పనిచేస్తున్న జస్టిస్ ఎన్వీ రమణతో పాటు కుమార్తెలు రాణి, వాణి ఉన్నారు. పెద్ద కుమార్తె రాణి హైదరాబాద్‌లో, చిన్న కుమార్తె వాణి అమెరికాలో ఉంటున్నారు. అయితే ఇటీవలే తన కుమార్తెకు పాప జన్మించడంతో జస్టిస్ రమణ ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు.
సీఎం కేసీఆర్ సంతాపం
జస్టిస్ ఎన్వీ రమణ మాతృమూర్తి సరోజినీదేవి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తం చేశారు.
నివాళులు అర్పించిన వైఎస్ జగన్
జస్టిస్ ఎన్వీ రమణ మాతృ వియోగం విషయం తెలిసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి న్యాయమూర్తి ఇంటికి చేరుకుని పార్థివ దేహం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎన్ టీవీ ఎండీ నరేంద్ర చౌదరి, టీడీపీ నేతలు కంభంపాటి రాంమోహన్‌రావులు కూడా నివాళులర్పించారు.