సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసు విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోగా.. తాజాగా రమణ కూడా వీరి జాబితాలో చేరారు. ఈ విషయం గురించి రమణ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర రావుది, నాది ఒకే రాష్ట్రం. అంతేకాక నేను, అతని కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యాను. ఈ నేపథ్యంలో నేను ఈ విచారణ బెంచ్‌లో ఉండటం సబబు కాదు. అందుకే తప్పుకుంటున్నాను’ అని తెలిపారు.
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున.. ఈ కేసు తదుపరి విచారణకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ఆ తర్వాత రెండు రోజులకే జస్టిస్ సిక్రీ కూడా ఈ కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకుటున్నట్లు ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తొలిగించిన ఉన్నతాధికార కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. దాంతో తాను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సిక్రీ తెలిపారు. తాజాగా ముడో వ్యక్తి ఎన్‌వీ రమణ కూడా ఈ బెంచ్ నుంచి తప్పుకున్నారు. పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment