బయటి ప్రపంచాన్ని చూడండి  | Supreme Court CJ Justice NV Ramana call to students Andhra Pradesh | Sakshi
Sakshi News home page

బయటి ప్రపంచాన్ని చూడండి 

Published Sun, Aug 21 2022 3:22 AM | Last Updated on Sun, Aug 21 2022 10:58 AM

Supreme Court CJ Justice NV Ramana call to students Andhra Pradesh - Sakshi

సుప్రీంకోర్టు ప్ర«ధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేస్తున్న గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వైస్‌ చాన్సలర్‌ రాజశేఖర్‌

సాక్షి, అమరావతి: విద్యార్థులు కేవలం తరగతులకే పరిమితం కాకుండా, బయటి ప్రపంచాన్ని చూడాలని.. సామాజిక ఉద్యమాల్లో సైతం పాలుపంచుకోవాలని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ పిలుపునిచ్చారు. తామంతా కూడా సామాజిక ఉద్యమాల్లో పాల్గొనే ఈ స్థాయికి వచ్చామని, ఇప్పుడు అలాంటి ఉద్యమాల్లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందన్నారు. గతంలో విశ్వ విద్యాలయాల్లో సమావేశాలు నిర్వహించి, సమాజ సమస్యలపై చర్చలు జరిపే వారని, ఇప్పుడు అలాంటి సమావేశాలేవీ జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఎదురయ్యే అసలైన సవాళ్లను ఎదుర్కొనేలా విద్యా బోధన ఉండాలని ఆకాంక్షించారు. శనివారం ఆయన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం 37, 38వ స్నాతకోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా గవర్నర్, విశ్వవిద్యాలయం చాన్సలర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, ఉన్నత విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ పి.రాజశేఖర్‌ తదితరుల సమక్షంలో జస్టిస్‌ ఎన్వీ రమణకు గవర్నర్‌ చేతుల మీద గౌరవ డాక్టరేట్‌ ప్రదానం జరిగింది. అనంతరం సీజేఐ మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు భిన్నత్వానికి చిరునామాలని, తాను చదివిన విశ్వవిద్యాలయం నుంచే ఇప్పుడు తాను గౌరవ డాక్టరేట్‌ అందుకోవడం ఎంతో సంతోషంగా, గర్వకారణంగా ఉందని అన్నారు.

ప్రస్తుతం విద్యా సంస్థలు తమ సామాజిక ప్రాముఖ్యతను కోల్పోతుండటం భయం కలిగిస్తోందని చెప్పారు. పుట్టగొడుగుల్లా వెలుస్తున్న విద్యా సంస్థలు పాఠాలు నేర్పే ఫ్యాక్టరీలు అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందుకు ఎవరిని, ఎందుకు నిందించాలో అర్థం కావడం లేదని, విద్యార్థులు సామాజిక సంబంధాలపై దృష్టి సారించేలా చూడాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందని సూచించారు. దేశంలో వేళ్లూనుకుపోయిన అనేక సమస్యలకు విద్య ద్వారానే పరిష్కారం చూపగలమని తెలిపారు. విద్య ద్వారానే పేదరికాన్ని దూరం చేయవచ్చని స్పష్టం చేశారు. సీజేఐ ఇంకా ఏమన్నారంటే..  

పాఠాలొక్కటే ప్రధానం కాదు 
► విద్యాలయాలు కేవలం విద్యను బోధించడమే కాకుండా విద్యార్థుల ఆలోచనలకు, ఆశయాలకు పరిచయ వేదికలుగా ఉంటాయి. ఘన చరిత్ర కలిగిన ఈ విశ్వవిద్యాలయానికి గత నాలుగు దశాబ్దాల్లో వివిధ కోర్సులు అందించే 450 అనుబంధ కాలేజీలు ఏర్పడ్డాయి.  
► మన దేశంలో వృత్తి విద్య విషయానికొస్తే.. ఎక్కువ జీతాలు, లాభదాయకమైన ఆదాయం వచ్చే ఉద్యోగావకాశాలు వచ్చే కోర్సులనే బోధిస్తున్నారు. హ్యుమానిటీస్, నేచురల్‌ సైన్సెస్, చరిత్ర, అర్థశాస్త్రం, భాషలు తదితర కోర్సులను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రొఫెషనల్‌ యూనివర్సిటీల్లోకి ప్రవేశించిన తర్వాత కూడా విద్యార్థులు తరగతి గదిలో పాఠాలపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప, బయట ప్రపంచాన్ని చూడటం లేదు. 
► అసలు విద్య ప్రాథమిక ఉద్దేశం ఏంటి? వ్యక్తి కోసమా? సమాజం కోసమా? వాస్తవానికి ఈ రెండూ ముఖ్యమైనవే. విద్య ద్వారా వ్యక్తులు దార్శనికులుగా, నాయకులుగా మారుతారు. ఇదే సమయంలో విద్య మనల్ని సమాజ అవసరాల పట్ల బాధ్యతాయుతంగా ఉండేలా చేస్తుంది.  

నా మూలాలు మర్చిపోలేదు.. 
► నాలుగు దశాబ్దాల క్రితం ఈ విశ్వవిద్యాలయంలో చెట్ల కింద, క్యాంటీన్, డైనింగ్‌ హాల్‌లో మా ఆలోచనలు, సిద్ధాంతాలు, రాజకీయాలు, సమాజ సమస్యలపై చర్చించే వాళ్లం. ఆ చర్చలు, మా క్రియాశీలత ప్రపంచం పట్ల మా అభిప్రాయాలను మార్చాయి.  
► అప్పట్లో ఈ యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉండేవి. వాటిపై వర్సిటీ ఉద్యోగ సంఘం పోరాడేది. వారి వల్లే నేను అప్పట్లో ఈ వర్సిటీలో చేరాను. ఓ వ్యక్తి గొంతుక, అభిప్రాయాల తాలుక విలువ అప్పుడు మాకు తెలిసింది. ఈ రోజుకీ నేను నా మూలాలను మర్చిపోలేదు.  
► మన విద్యా వ్యవస్థ రూపాంతరీకరణ జరగాల్సిన సమయం ఆసన్నమైంది. సామాజిక సంబంధాలు, పౌర హక్కుల విలువలను నేర్పించేలా విద్యా వ్యవస్థ ఉండాలి. ఆర్థిక పురోగతి లక్ష్య సాధనలో మన సాంస్కృతిక, పర్యావరణ బాధ్యతలను విస్మరించకూడదు. మమ్మల్ని దాటి ఆలోచించండి. సామాజిక అవసరాల పట్ల స్పృహ కలిగి ఉండండి.  
ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, విద్యా శాఖ అధికారులు, న్యాయవాదులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.   

కలలను సాకారం చేసుకోండి  
విద్యార్థులు తమ కలలు సాకారం చేసుకునేంత వరకు వాటిని వెంటాడాలి. ప్రయత్నించడాన్ని ఎన్నడూ ఆపొద్దు. విశ్వవిద్యాలయాలు ఇప్పుడు జ్ఞాన కేంద్రాలుగా భాసిలుతున్నాయి. మన జీవితంలో చూస్తున్న చాలా ఆవిష్కరణలు యూనివర్సిటీల్లోనే పుట్టాయి. పరిశోధన, బోధన సమాంతరంగా సాగినప్పుడే విశ్వవిద్యాలయాలు విజయం సాధించగలుగుతాయి.  
    – విశ్వభూషణ్‌ హరిచందన్, గవర్నర్‌  

పోటీని తట్టుకునేలా విద్యా వ్యవస్థ 
రాష్ట్ర ప్రభుత్వం చదువుకు ఉన్న ప్రాముఖ్యతను గుర్తించి, కొత్త విద్యా విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ దేశంలోనే ముందు స్థానంలో ఉంది. ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు నిలబడేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక చర్యలు చేపట్టారు. ఇందుకోసం స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించుకుని, ఆ దిశగా కార్యాచరణ మొదలు పెట్టాం. జస్టిస్‌ ఎన్‌వీ రమణకు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేయడం ఈ రాష్ట్రానికి గర్వకారణం. కార్యదీక్షతో ఉన్నత శిఖరాలు అధిరోహించ 
వచ్చునని ఆయన నిరూపించారు.     
– బొత్స సత్యనారాయణ, విద్యాశాఖ మంత్రి    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement