విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్‌ | Supreme Court sets up task force over students mental health concerns | Sakshi
Sakshi News home page

విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు టాస్క్‌ఫోర్స్‌

Published Tue, Mar 25 2025 5:56 AM | Last Updated on Tue, Mar 25 2025 5:56 AM

Supreme Court sets up task force over students mental health concerns

సుప్రీంకోర్టు మాజీ జడ్జి రవీంద్ర భట్‌ సారథ్యంలో ఎన్‌టీఎఫ్‌ ఏర్పాటు 

విద్యార్థుల మానసిక ఆందోళనలను తగ్గించేలా కృషి జరగాలన్న సుప్రీం

న్యూఢిల్లీ: ఐఐటీల వంటి ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడటం వంటి ఘటనల నేపథ్యంలో ఈ అంశంపై సర్వోన్నత న్యాయస్థానం ప్రధానంగా దృష్టిపెట్టింది. రెండేళ్ల క్రితం ఐఐటీ(ఢిల్లీ)లో విద్యనభ్యసిస్తూ ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థుల విషయంలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదుచేయాలంటూ సుప్రీంకోర్టు జడ్జీలు జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్‌ ఆర్‌. మహదేవన్‌ల ధర్మాసనం సోమవారం ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. 

ఆత్మహత్యల అంశంలో దర్యాప్తు చేయాలని సూచిస్తూ పలు వ్యాఖ్యలు చేసింది. ‘‘ వేర్వేరు ఉన్నతవిద్యా సంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు కలచివేస్తున్నాయి. విద్యార్థులు తనవు చాలిస్తూ తమ జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్న ఉదంతాలకు చరమగీతం పాడాల్సిందే. విద్యార్థులు ఆత్మహ త్యలు చేసుకోకుండా నివారించే సమగ్ర, విస్తృతస్థాయి, స్పందనా వ్యవస్థలను బలోపేతం చేయాలి. 

ప్రైవేట్‌ కాలేజీలు సహా ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థుల మానసిక ఆరోగ్య పరిస్థితిని పట్టించుకునే చట్టపరమైన, సంస్థాగతమైన వ్యవస్థ సమర్థంగా లేదు. ఒకవేళ ఉన్నా అందులో అసమానతలు ఎక్కువయ్యాయి. విద్యార్థులు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా నివారించే నివారణ వ్యవస్థ కావాలి. అందుకే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.రవీంద్రభట్‌ సారథ్యంలో నేషనల్‌ టాస్క్‌ఫోర్స్‌ (ఎన్‌టీఎఫ్‌)ను ఏర్పాటుచేస్తున్నాం. 

ఇందులో రాష్ట్రాల ఉన్నతవిద్య, సామాజిక న్యాయం, సాధికారత, న్యాయ, మహిళ, చిన్నారుల అభివృద్ధి మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా కొనసాగుతారు. ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల గుర్తింపు, ఆత్మహత్యల నివారణకు సంబంధించి నియమనిబంధనల పటిష్ట అమలుపై ఎన్‌టీఎఫ్‌ ఒక సమగ్ర నివేదికను రూపొందించనుంది. ఈ నివేదిక తుది రూపు కోసం ఎన్‌టీఎఫ్‌ దేశంలోని ఎలాంటి ఉన్నత విద్యాసంస్థలోనైనా ఆకస్మిక తనిఖీలు చేస్తుంది. ప్రస్తుత నిబంధనలకు తోడు అదనపు సిఫార్సులు చేసే అధికారమూ ఎన్‌టీఎఫ్‌కు ఉంది’’అని సుప్రీంకోర్టు పేర్కొంది.

4 నెలల్లో మధ్యంతర నివేదిక
ఎన్‌టీఎఫ్‌ తమ మధ్యంతర నివేదికను నాలుగు నెలల్లోపు సమర్పించాల్సి ఉంటుంది. 8 నెలల్లోపు సమగ్ర నివేదికను సమర్పించాలి. 2023లో ఢిల్లీ ఐఐటీలో ఇద్దరు విద్యార్థులు మరణిస్తే ఎఫ్‌ఐఆర్‌ నమోదుకు ఢిల్లీ హైకోర్టు గతేదాడి జనవరిలో నిరాకరించిన నేపథ్యంలో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు సుప్రీంకోర్టు ఆదేశించడంతో తాజాగా సుప్రీంకోర్టు పై విధంగా స్పందించింది. 2018 నుంచి 2023 ఏడాది వరకు ఉన్నతవిద్యాసంస్థల్లో 98 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నట్లు రాజ్యసభలో కేంద్ర విద్యాశాఖ సహాయక మంత్రి 2023లో ప్రకటించడం తెల్సిందే. ఈకాలంలో ఐఐటీల్లో 39, ఎన్‌ఐటీల్లో 25, కేంద్రీయ వర్సిటీల్లో 25, ఐఐఎంలలో నలుగురు, ఐఐఎస్‌ఈఆర్‌లలో ముగ్గురు, ఐఐఐటీల్లో ఇద్దరు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement