సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు 48వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నియమితులయ్యారు. ఈ నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. 2022 ఆగస్టు 26 వరకు ఆయన ఆ పదవిలో కొనసాగనున్నారు. ఈమేరకు ఆయన నియామకాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదించడంతో న్యాయ శాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ రమణ ఈ పదవిని చేపట్టనున్న తెలుగువారిలో రెండో వ్యక్తి. అంతకుముందు రాజమహేంద్ర వరానికి చెందిన జస్టిస్ కోకా సుబ్బారావు సుప్రీం కోర్టు 9వ ప్రధాన న్యాయమూర్తిగా (1966 జూన్ 30 నుంచి 1967 ఏప్రిల్ 11 వరకు) సేవలందించారు. పదవిలో కొనసాగుతుండగానే రాజీనామా చేసిన ఆయన ప్రతిపక్షాల అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసి జాకీర్ హుస్సేన్ చేతిలో పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో తెలుగువారైన జస్టిస్ లావు నాగేశ్వరరావు, జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డిలు న్యాయమూర్తులుగా కొనసాగుతున్న విషయం విదితమే.
రైతు కుటుంబం నుంచి..: వ్యవసాయ కుటుంబ నేపథ్యం కలిగిన జస్టిస్ ఎన్వీ రమణ స్వగ్రామం కృష్ణా జిల్లా పొన్నవరం. ఆయన 1983 ఫిబ్రవరి 10న బార్ కౌన్సిల్‌లో చేరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునళ్లు, సుప్రీంకోర్టులో ప్రాక్టీసు చేశారు. అంతరాష్ట్ర నదీ జలాల వివాదాల పరిష్కార ట్రిబ్యునళ్లలోనూ ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు ప్యానెల్ కౌన్సిల్‌గా, రైల్వేలకు అదనపు స్టాండింగ్ కౌన్సిల్‌గా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగుతున్నారు. 2019 మార్చి 7 నుంచి అదే ఏడాది నవంబర్ 26 వరకు సుప్రీంకోర్టు న్యాయ సేవల కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. 2019 నవంబర్ 27 నుంచి నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా 2000 జూన్ 27న నియమితులయ్యారు. 10.3.2013 నుంచి 20.5.2013 వరకు ఉమ్మడి హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా కూడా పనిచేశారు.
జస్టిస్ రమణ వెలువరించిన తీర్పుల్లో కొన్ని...
►అనురాధ బాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో జమ్మూ కశ్మీర్‌లో ఏడాదిపాటు ఇంటర్నెట్ నిషేధానికి ముగింపు.
►సుప్రీంకోర్టు వర్సెస్ సుభాష్ చంద్ర అగర్వాల్ కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయాన్ని సమాచార హక్కు చట్టం పరిధిలోకి తేవడం.
►శివసేన వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర కేసులో బలపరీక్ష అంశంలో నైతికతను పునరుజ్జీవింపచేయడం.
సత్వర న్యాయం లక్ష్యం: నల్సా
నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (నల్సా) కార్యనిర్వాహక చైర్మన్‌గా ఉన్న జస్టిస్ రమణ సత్వర న్యాయం అందించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు ప్రారంభించినట్లు ఆ సంస్థ మంగళవారం ఓ ప్రకటనలో పేర్కొంది. జస్టిస్ రమణ సారథ్యంలో న్యాయసేవల అథారిటీ సేవలను ఆన్‌లైన్ ద్వారా ప్రారంభించినట్లు తెలిపింది. కరోనా సమయంలో 2,878 గృహ హింస కేసులకు సంబంధించి న్యాయ సాయం, 60 లక్షల మంది వలస కార్మికులు, 36,435 మంది ఒంటరి వ్యక్తులు, 1,04,084 మంది సీనియర్ సిటిజన్లకు సేవలు అందించినట్లు తెలిపింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఈ–లోక్ అదాలత్‌లో 4.11 లక్షల కేసులను పరిష్కరించినట్లు తెలిపింది. 2,06,190 మంది ఖైదీలు లీగల్ సర్వీస్ క్లినిక్‌ల ద్వారా సేవలు పొందారు. జాతీయ, రాష్ట్రస్థాయి అదాలత్‌లు నిర్వహించి 48 లక్షల కేసులు పరిష్కరించినట్లు తెలిపింది. జాతీయ మహిళా కమిషన్‌తో కలసి నల్సా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment