Law University
-
‘కర్నూలు నుంచి లోకాయుక్త, హెచ్ఆర్సీ తరలిస్తే ప్రజా ఉద్యమమే..’
సాక్షి, కర్నూలు: కర్నూలు నుండి అమరావతికి లోకాయుక్త, మానవ హక్కుల కమిషన్‌ను తరలించరాదని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు కర్నూలు కలెక్టర్ రంజిత్ భాషకు వినతి పత్రం అందజేశారు వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి, నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మేయర్ బీవై రామయ్య, న్యాయవాదులు.అనంతరం వైఎస్సార్సీపీ నేతలు మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలు జిల్లా చాలా నష్టపోయింది. కర్నూలుకు వైఎస్ జగన్ తీసుకువచ్చిన సంస్థలను చంద్రబాబు తరలిస్తున్నారు. కేంద్రాన్ని ఒప్పించి వైఎస్ జగన్ కర్నూలుకు లా వర్సిటీని తెచ్చారు. సీమకు చంద్రబాబు చేస్తున్న అన్యాయంపై ఆందోళన చేస్తాం. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి చంద్రబాబు.. కర్నూలుకు నష్టం చేస్తున్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా కర్నూలు జిల్లాను కాపాడుకుంటాం. చంద్రబాబు లా యూనివర్సిటీని తరలించుకుపోతుంటే కూటమి ప్రభుత్వంలోని జిల్లా నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. -
శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం అడుగులేస్తున్నాం..
-
న్యాయ రాజధానికి మంచి జరగాలి: సీఎం జగన్
సాక్షి, కర్నూలు: కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పామని.. ఆ మాటకు కట్టుబడి ఉన్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉద్ఘాటించారు. గురువారం జిల్లాలో నేషనల్ లా యూనివర్సిటీ భూమి పూజ.. భవన నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘శ్రీబాగ్ ఒడంబడికలో భాగంగా ఈ ప్రాంతానికి సరైన న్యాయం జరిగేందుకు నేషనల్ లా యూనివర్శిటి దోహదపడుతుంది. హైదరాబాద్‌కు రాజధానిని తరలించే సమయంలోనూ హైకోర్టు ఏర్పాటు చెయ్యాలని తీర్మానించారు. కర్నూలులో హైకోర్టు పెడతామని ఇది వరకే చెప్పాం. నేషనల్ లా యూనివర్శిటి నిర్మాణానికి అడుగులు వేగంగా పడాలని కోరుకుంటున్నాను. రూ.1000 కోట్లతో ఈ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తాం. ఈ యూనివర్సిటీతో పాటు న్యాయపరమైన అంశాలకు సంబంధించిన ఏపీ లీగల్ మెట్రాలాజీకల్ కమిషన్, లేబర్ కమిషన్, వ్యాట్ అప్పిలేట్ కమిషన్, వక్ఫ్ బోర్డ్, మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు కానున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. వీటి వల్ల ఈ ప్రాంతానికి మంచి జరగాలని కోరుతున్నాను’ అని వ్యాఖ్యలు చేశారు. -
న్యాయ రాజధానికి 'మరో మణిహారం'
న్యాయ రాజధాని కర్నూలు కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా కర్నూలును న్యాయ రాజధాని అని పునరుద్ఘాటించిన క్రమంలో మరో ముందడుగు పడుతోంది. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు దిశగా గురువారం శ్రీకారం చుడుతున్నారు. వర్సిటీ భవన నిర్మాణాలకు సీఎం జగన్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. – కర్నూలు (సెంట్రల్) దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఒకటి. న్యాయ రాజధాని కాబోతున్న కర్నూలులో రెండోది, దేశంలో 29వ న్యాయ విశ్వ విద్యాలయం నిర్మాణానికి అంతా సిద్ధమైంది. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఈ విశ్వ విద్యాలయానికి 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అందులో భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 2025–26 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది. అందుబాటులో న్యాయ విద్య ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కలిపి 45 లా కాలేజీలు ఉన్నాయి. నాణ్యమైన న్యాయ విద్యను అందించేందుకు కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. అంతేకాక న్యాయ విద్యలో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లకు అవకాశం ఉంటుంది. భవిష్యత్‌లో దేశం గర్వించదగ్గ న్యాయవాదులను అందించడంలో ఈ విశ్వవిద్యాలయం గొప్ప పాత్ర పోషిస్తున్నదనడంలో సందేహం లేదని ప్రఖ్యాత న్యాయ కోవిదులు చెబుతున్నారు. కాగా, న్యాయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి న్యాయ విద్యార్థులు కర్నూలుకు రానున్నారు. సీమవాసుల ఆశలకు అనుగుణంగా.. సీమ వాసుల కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో 3 రాజధానుల చట్టాలు అమల్లోకి రాలేకపోయాయి. అయితే ప్రతిష్టాత్మక మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ), లోకాయుక్త వంటి న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలుకు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు తరలింపునకు పచ్చజెండా ఊపారు. సీబీఐ కోర్టును కూడా కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ. 10 కోట్లతో ఏపీ ఈఆర్సీ భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ఘన విజయం సాధించాక హైకోర్టుతో పాటు అన్ని న్యాయ సంస్థలు, ట్రిబ్యునళ్లు కర్నూలుకు తరలివచ్చే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో న్యాయ రాజధాని అవుతుందని స్థానికులు భావిస్తున్నారు. న్యాయ విశ్వ విద్యాలయం ఓ వరం కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయం. ఇది రాయలసీమ విద్యార్థుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. నాణ్యతా ప్రమాణాలతో కూడిన న్యాయ విద్య అందుబాటులోకి వస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాల జాబితాలోకి కర్నూలు చేరడం సంతోషకరం. – మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, కర్నూలు హైకోర్టు కూడా కర్నూలుకు వస్తుంది సీఎం జగన్ కర్నూలు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన రెండోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా కర్నూలుకు హైకోర్టు వచ్చి తీరుతుంది. ఇప్పటికే కర్నూలులో ప్రతిష్టాత్మక లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు పలు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం. – జయపాల్‌రెడ్డి, రిటైర్డ్ జెడ్పీసీఈఓ, కర్నూలు కర్నూలుకు జాతీయ స్థాయిలో పేరు జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం కర్నూలు సిగలో న్యాయ మణిహారం. ప్రతిష్టాత్మక ఈ విశ్వవిద్యాలయం వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు న్యాయ విద్య కోసం కర్నూలుకు వస్తారు. జాతీయ స్థాయిలో కర్నూలుకు మంచి పేరు వస్తుంది. – మద్దెల శ్రీనివాసరెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కర్నూలు -
మొదటి భార్య గురించి సీజేఐ చంద్రచూడ్ ఆసక్తికర విషయాలు..
బెంగళూరు: న్యాయవాద వృత్తిలో సవాళ్లపై ప్రసంగంలో సీజేఐ డీవే చంద్రచూడ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. లాయర్ వృత్తికి సమయం గురించి చెప్పే క్రమంలో చనిపోయిన తన మొదటి భార్య గురించిన విషయాలను వెల్లడించారు. ఉపన్యాసంలో భాగం కాకపోయినప్పటికీ బుక్ నాలెడ్జ్ కంటే తన వ్యక్తిగత అనుభవ పాఠాలు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో 31వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 'చనిపోయిన నా మొదటి భార్య లాయర్‌గా పనిచేశారు. వృత్తి జీవితంలో ఓ న్యాయవాద సంస్థకు వెళ్లినప్పుడు ఆమె పని గంటల గురించి అడిగారు. అందుకు వారు ఆమెకు 365 రోజులు 24x7 అని సమాధానమిచ్చారు. కుటుంబానికి సమయం లేదని చెప్పారు. భార్యాపిల్లలు ఉన్నవారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించినప్పుడు.. ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోండని చెప్పారు' అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. పనిచేసే ప్రదేశంలో మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని తెలిపారు. నేడు మహిళా క్లర్కులు బుుతుసమస్యల సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేయగలుగుతున్నారని చెప్పారు. సమాన అవకాశాలు ఉన్నచోట అన్ని అవసరాలను బహిరంగంగా అడగగలిగే పరిస్థితులను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా సుప్రీంకోర్టు డిక్షనరీని కూడా మార్చినట్లు చెప్పారు. వేశ్య, పతిత, హౌజ్‌వైఫ్ వంటి పదాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. మహిళా సాధికారతను సాధించే దిశగా సీజేఐ చంద్రచూడ్ ఎన్నో తీర్పులను ఇచ్చారు. ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్, శబరిమలకు మహిళల ప్రవేశంతో పాటు అబార్షన్ చట్టాలను కూడా చక్కదిద్దారు. మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే విచారణలు జరుపుతోంది. ఇదీ చదవండి: అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది? -
కార్మికులతో రాష్ట్రపతి ముర్ము.. ‘ఇక్కడ ఉన్న మీ ముఖ్యమంత్రిని గుర్తు పడతారా?’
త్రిపుర: రెండు రోజుల త్రిపుర పర్యటనకు వెళ్లిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. నార్సింగర్లో ఏర్పాటు చేసిన జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. అంతకుముందు రాజధాని అగర్తలా విమానాశ్రయంలో సీఎం మాణిక్ సాహా, గవర్నర్ సత్య నారాయన్ ఆర్యా, కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టులో త్రిపుర స్టేట్ రైఫిల్స్ రాష్ట్రపతికి గౌరవ వందనం సమర్పించారు. అక్కడ నుంచి నేరుగా నార్సింగర్కు వెళ్లి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమెతోపాటు సీఎం సాహా, కేంద్రమంత్రి రతన్‌లాల్ నాథ్, త్రిపుర హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇంద్రజిత్ మహంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆమె మోహన్‌పూర్‌లోని దుర్గాబరి టీ ఎస్టేట్‌ను సందర్శించారు. అక్కడ పనిచేసే టీ గార్డెన్ కార్మికులతో ముచ్చటించారు. ఈక్రమంలో ముర్ము వారితో ఓ ఆసక్తికర సంభాషణ సాగించారు. మహిళా కార్మికులతో మాట్లాడిన రాష్ట్రపతి వారి బాగోగులు కనుకున్నారు. ‘పిల్లలను బడికి పంపిస్తున్నారా? క్రమం తప్పకుండా పిల్లలను బడికి పంపించండి. ఉచిత బియ్యం, ఇతర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా?’అని అష్టమి ముండా అనే మహిళను అడిగి తెలుసుకున్నారు. (చదవండి: ‘అమ్మా.. తప్పకుండా తిరిగొస్తాను’ తల్లికి సంజయ్ రౌత్ భావోద్వేగ లేఖ) మరో మహిళతో ఆమె మాట్లాడుతూ.. నాతోపాటు మరికొంతమంది ఇక్కడ ఉన్నారు కదా? వారిలో మీ ముఖ్యమంత్రి మాణిక్ సాహాను, స్థానిక ఎమ్మెల్యే కృష్ణధన్దాస్ను గుర్తు పడతారా? అని అడిగారు. అందుకు వారు ఔను అనే సమాధానం ఇచ్చారు. స్థానిక నేతలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. ఏ సమస్య వచ్చినా? ఏదైనా డిమాండ్ ఉన్నా వారితో మాట్లాడండి అని రాష్ట్రపతి భరోసానిచ్చారు. ఈ విషయమై ఎమ్మెల్యే దాస్ మాట్లాడుతూ.. రాష్ట్రపతి ముర్ము టీ ఎస్టేట్‌ను సందర్శించడం.. కార్మికులతో మమేకమవడం మరచిపోలేని అనుభూతి అని అన్నారు. (చదవండి: విషాదం.. ఉన్నట్టుండి స్టేజ్‌పై కుప్పకూలిన శివుడి వేషధారి.. వైరల్ వీడియో) -
రాజ్యాంగ అవగాహన తప్పనిసరి: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ
రాయ్‌పూర్: రాజ్యాంగం తమకు కల్పించిన హక్కులు, బాధ్యతలు తదితరాలపై పౌరులందరికీ అవగాహన ఉన్నప్పుడే దేశం నిజమైన ప్రగతి సాధిస్తుందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ‘‘తేలిక భాషలో వాటిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం చాలా ఉంది. ఈ విషయంలో న్యాయ శాస్త్ర పట్టభద్రులు చురుకైన పాత్ర పోషించాలి. వారిని సోషల్ ఇంజనీర్లుగా రూపొందించే బాధ్యతను లా స్కూల్స్ తలకెత్తుకోవాలి’’ అని పిలుపునిచ్చారు. ఆదివారం రాయ్‌పూర్‌లోని హిదాయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ (హెచ్‌ఎన్‌ఎల్‌యూ) ఐదో స్నాతకోత్సవంలో జస్టిస్ రమణ పాల్గొన్నారు. ‘‘ఆధునిక భారత ఆకాంక్షలకు అక్షర రూపమైన మన రాజ్యాంగం ప్రతి పౌరునికీ చెందినది. కానీ వాస్తవంలో అది కేవలం లా స్టూడెంట్లు, లాయర్ల వంటి అతి కొద్దిమందికి మాత్రమే పరిమితమైన ఓ పుస్తకంగా మారిపోవడం బాధాకరం’’ అన్నారు. న్యాయ రంగంలో కెరీర్ ఎంతటి సవాళ్లతో కూడినదో అంతటి సంతృప్తినీ ఇస్తుందని సీజేఐ అన్నారు. ‘‘లాయరంటే కేవలం కోర్టులో వాదించే వ్యక్తి కాదు. అన్ని రంగాలపైనా ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకుంటూ సాగాలి. మార్పుకు శ్రీకారం చుట్టే నాయకునిగా ఎదగాలి. విమర్శలెదురైనా పట్టుదలతో ముందుకు సాగితే విజయం మీదే’’ అని లా గ్రాడ్యుయేట్లకు పిలుపునిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనకు బలయ్యే అణగారిన వర్గాలకు చట్టపరంగా చేయూతనివ్వాలని సూచించారు. మెరుగైన సామాజిక మార్పుకు చట్టాలు కూడా తోడ్పడతాయని సీజేఐ అన్నారు. ‘‘యువతరం ప్రపంచంలో పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారంచుడుతోంది. వాతావరణ సంక్షోభం మొదలుకుని మావన హక్కుల ఉల్లంఘన దాకా పెను సమస్యలెన్నింటినో ఎదుర్కోవడంలో సంఘటిత శక్తిగా తెరపైకి వస్తోంది. ఇక సాంకేతిక విప్లవం మనందరినీ ప్రపంచ పౌరులుగా మార్చేసింది. కనుక సామాజిక బాధ్యతలను నెరవేర్చేందుకు మనమంతా ముందుకు రావాలి’’ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో న్యాయ వ్యవస్థకు మౌలిక సదుపాయాల కల్పన, బడ్జెట్ కేటాయింపులు తదితరాల్లో సీఎం భూపేశ్ భగెల్ పనితీరును ఈ సందర్భంగా ప్రశంసించారు. -
అమ్మమ్మ వయసులో నాలుగు గోల్డ్ మెడల్స్..!
గాంధీనగర్: చదువుకు శ్రద్ధ ఉంటే చాలు.. వయసుతో పనిలేదని నిరూపించింది ఓ మహిళ. ఏకంగా 55 ఏళ్ల వయసులో మరోసారి పుస్తకాలు పట్టుకొని కాలేజీ క్యాంపస్‌లో అడుగు పెట్టింది. లేటు వయసుసలో న్యాయవాద కోర్సును పూర్తి చేయడమే కాకుండా ఏకంగా నాలుగు గోల్డ్ మెడల్స్ కూడా సాధించి అందరిని ఔరా అనిపించింది. గుజరాత్‌కు చెందిన నీతి రావల్ అనే మహిళ సాధించిన ఈ అరుదైన ఘనత ఇప్పుడు సంచలనంగా మారింది. (ఒక్క గంటలో ఆయన సంపాదన రూ. 16వేల కోట్లు) నీతీ రావల్‌కు 30 ఏళ్ల క్రితం మౌలిన్ రావల్ అనే వ్యాపారితో వివాహం అయింది. ఆమెకు ఒక కూతురు, ఒక కొడుకు. కూతురికి పెళ్లయింది. కొడుకు లాయర్‌గా స్థిరపడ్డాడు. ఏళ్లుగా కుటుంబ బాధ్యతలను మోసిన నీతి రావల్‌కి ఇంట్లో ఒంటరిగా ఉండడం నచ్చలేదు. ఏదైనా కొత్తగా చేయాలనుకుంది. ఎవరేం అనుకున్నా పర్వాలేదని 30 ఏళ్ల తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లింది. తన కుటుంబం సాయంతో గుజరాత్ యూనివర్సిటీ నుంచి లా కంప్లీట్ చేసింది. ఇటీవల జరిగిన కాన్వొకేషన్ డేలో 4 గోల్డ్ మెడల్స్ అందుకొని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఆమెలో ఉన్న ఆసక్తి చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. కాగా నీతీ రావల్ ఇంతటితో ఆగిపోవడం లేదు. త్వరలోనే మాస్టర్ ఇన్ లా అడ్మిషన్ కూడా పూర్తి చేస్తానని చెప్తోంది. నీతి రావల్ మాట్లాడుతూ.. నాకు ఒక్క దానికే ఇంట్లో ఏం చేయాలో తోచలేదు. అందుకే ఏదైనా చేయాలని అనుకొని లా పూర్తి చేసినట్టు తెలిపారు. ఆమె భర్త మౌలిన్ రావల్ మాట్లాడుతూ.. పెళ్లయిన 30 ఏళ్ల తర్వాత ఈ ఘనత సాధించినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. టెక్ దిగ్గజం ఐబీఎం సీఈఓగా మనోడే..! -
లా ప్రవేశ పరీక్షలు మళ్లీ ‘ఆఫ్‌లైన్’లోకి!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని లా కళాశాలల అడ్మిషన్ల కోసం వరుసగా గత నాలుగేళ్లుగా ‘ఆన్లైన్’లో నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మళ్లీ ఆఫ్‌లైన్‌లోకి వెళతాయా? 2018 సంవత్సరానికి మే 13వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన లా ప్రవేశ పరీక్షల్లో చోటు చేసుకున్న సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. దేశంలోని 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని లా కళాశాలల్లో అడ్మిషన్లకోసం ఏటా ఆన్లైన్ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా ఓ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకుంటున్నాయి. కేరళలోని కొచ్చీ న్యాయ విశ్వవిద్యాలయం ‘నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ అడ్వాన్డ్స్ లా స్టడీస్’ ఈసారి ‘క్లాట్–18’ను నిర్వహించింది. దేశవ్యాప్తంగా 258 కేంద్రాల్లో ఈ ఏడాది నిర్వహించిన లా ప్రవేశ పరీక్షలకు మొత్తం 54,465 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో దాదాపు మూడోవంతు అంటే, 19, 983 మంది అభ్యర్థులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. కంప్యూటర్ స్క్రీన్ స్తంభించి పోవడం వల్ల లేదా ప్రశ్న స్క్రీన్ మీది నుంచి అదృశ్యం అవడం వల్ల అభ్యర్థులు ఒక్కసారికన్నా ఎక్కువ సార్లు లాగిన్ కావాల్సి వచ్చింది. ఫలితంగా వారి విలువైన సమయం వృధా అయింది. సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న వారిలో 612 మంది కనీసం ఐదుసార్లు, 14 మంది కనీసం పదిసార్లు, అంతకన్నా ఎక్కువ, మరో దురదృష్ట అభ్యర్తి ఏకంగా 19 సార్లు కంప్యూటర్‌కు లాగిన్ కావాల్సి వచ్చింది. తద్వారా వారంతా పది నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై పలువురు హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కమిటీ ఏర్పాటు ఈ సాంకేతిక సమస్యలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 27వ తేదీన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాన్పూర్‌లోని ఐఐటీకి చెందిన మణింద్ర అగర్వాల్, ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అశోక్ కుమార్ జార్వల్, లక్నోలోని ఐఐఎంకు చెందిన నీరజ్ ద్వివేది, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ వినీత్ జోషిలతో ఈ కమిటీని వేశారు. ఈ సారి క్లాట్ పరీక్షను నిర్వహించిన కొచ్చీ లా యూనివర్శిటీకి పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించిన ‘సైఫీ టెక్నాలజీ లిమిటెడ్’ కంపెనీని కూడా కమిటీ విచారించింది. స్థానికంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందించిన ప్రొవైడర్ వద్ద సరైన నెట్వర్క్ సామర్థ్యం లేకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావచ్చని సైఫీ అనుమానం వ్యక్తం చేసింది. అసలు సమస్యేమిటో ఇంతకాలం కనుక్కోక పోవడం వల్ల కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది. అధిక ఫీజు పట్ల కమిటీ దిగ్భ్రాంతి కొచ్చి లా ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి మొత్తం 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అభ్యర్థుల నుంచి పరీక్ష ఫీజు కింద వచ్చిన మొత్తం ఏకంగా 27.5 కోట్ల రూపాయలు. అభ్యర్థి నుంచి నాలుగు వేల రూపాయలను ఫీజు కింద వసూలు చేయడం పట్ల కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫీజును 1500 రూపాయలుగా నిర్ధారించాలని సూచించింది. పరీక్ష ఫీజు కింద వచ్చిన మొత్తంలో సగాన్ని పరీక్ష నిర్వహించిన లా యూనివర్శిటీ తీసుకొని మిగతా సగాన్ని మిగతా అన్ని లా విశ్వవిద్యాలయాలన్నింటికి పంచాల్సి ఉంటుంది. అనుభవ రాహిత్యమూ కారణమే ప్రతి ఏటా ఓ న్యాయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలను నిర్వహించడం వల్ల ఆ యూనివర్శిటీ బిడ్డింగ్ పద్ధతిలో సాంకేతిక సంస్థను ఎంపిక చేస్తోంది. అలా ప్రతి యూనివర్శిటీ ప్రతి ఏటా ఒక్కో కొత్త సాంకేతిక సంస్థను ఎంపిక చేయడం వల్ల సాంకేతిక లోపాలు పునరావృతం అవుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. అందుకని సాంకేతిక సంస్థను కనీసం రెండేళ్లు పరీక్షల నిర్వహణకు కొనసాగించేలా, మరో ఏడాది పొడిగించుకునేలా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. లేదా దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు నిపుణులతో కూడిన సాంకేతిక సంస్థను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించడమే సమంజసమని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ మంగళవారం నాడు సుప్రీం కోర్టుకు సమర్పించిన ఈ నివేదికను కోర్టు ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు స్పందననుబట్టి కేంద్రం స్పందించాల్సి ఉంది. -
లా యూనివర్సిటీలో కోర్సుల రద్దుకు సిఫారసు
న్యూఢిల్లీ: ఢిల్లీ లా యూనివర్సిటీలోని కోర్సులను రద్దు చేయాల్సిందిగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) ప్యానల్‌కు లీగల్ ఎడ్యుకేషనల్ కమిటీ సిఫారసు చేసింది. రాజస్థాన్ రిటైర్డ్ జడ్జి వి.ఎస్ దేవ్ నే తృత్వంలోని ఏడుగురు సభ్యుల బృందం ఈ మేరకు నివేదికను అందించింది. ‘దేశంలో న్యాయ విద్యకు సంబంధించి ఇదే అత్యున్నత విభాగం. క్యాంపస్ లా సెంటర్ మూసి ఉండటాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఇలా ఐతే విద్యార్థుల భవిష్యత్తు పాడవుతుంది. యూనివర్సిటీకి చెడ్డ పేరు వస్తుంది’ అని తనిఖీ సందర్భంగా కమిటీ అభిప్రాయపడింది. విద్యా ప్రమాణాలు పాటించడంలో యూనివర్సిటీ అథారిటీ పూర్తిగా విఫలమైందని కమిటీ తేల్చింది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే ఆగస్టు నాటికి అన్నింటిని సరిదిద్దుకోవాలని సూచించింది. విశ్వవిద్యాలయం తన మూడు సెంటర్లకి అఫిలియేషన్ పొడిగించుకోవటంలో విఫలమైందని, వెంటనే అక్కడి కోర్సులను రద్దు చేయాలని తనిఖీ బృందం సూచించింది. గతంలో ఢిల్లీ హైకోర్టు బీసీఐ నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు, వసతులు కల్పించాల్సిందిగా యూనివర్సిటీని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న భ వనాలు సరిపోవటం లేదని వర్సిటీ తెలిపింది. కొత్త వాటిలోకి మారాల్సి ఉందని, తరగతి గదుల కొరత ఉందని ఆ సందర్భంగా యూనివర్సిటీ హైకోర్టుకు తెలిపింది. లీగల్ కమిటీ తమ తనిఖీల ద్వారా వర్సిటీలో పర్మినెంట్ అధ్యాపకుల కొరత ఉందని, డీన్ పనితీరు కూడా సరిగా లేదని వెల్లడైనట్టు పేర్కొంది. -
సంజీవయ్య లా యూనివర్శిటీలో హెచ్. ఎల్. దత్తు
-
ఐటీలో హైదరాబాదే మేటి!
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ మహానగరం దేశంలోనే నెంబర్‌వన్ స్థానానికి ఎదుగుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై మంగళవారం నాటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా వివిధ ప్రాజెక్టుల కోసం నాస్కాం, ట్రిపుల్ఐటీ, ఐఎస్బీ, నల్సార్ లా యూనివర్సిటీ ప్రతినిధులతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభు త్వ ప్రతినిధులుగా మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి హర్ప్రీత్సింగ్లు బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి (నాస్కాం), ప్రొఫెసర్ పి.జె.నారాయణ (డెరెక్టర్, ఐఐఐటీహెచ్), అజిత్ రంగ్నేకర్ (డీన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా (వైస్ చాన్సలర్, నల్సార్ లా యూనివర్సిటీ)తో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి ఐటీ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని కోరేందుకు నవంబర్ 15న అమెరికా వెళ్తున్నట్టు మంత్రి వెల్లడించారు. అక్టోబర్‌లో జరిగే మెట్రోపోలీస్ సదస్సుకు అనువుగా నగరాన్ని తీర్చిదిద్దడానికి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించ డం కోసం జీహెచ్ఎంసీ రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఐఆర్సీ ప్రమాణాలతో గ్రామీణ రోడ్లు పంచాయతీరాజ్ రోడ్లను సైతం ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) ప్రమాణాల మేరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐఆర్సీ నిబంధనలకు అనుగుణంగా రోడ్లను నిర్మిస్తే ఖర్చుపెరిగే అవకాశం ఉన్నా, దీర్ఘకాలికంగా మన్నేలా గ్రామీణ రోడ్లను తీర్దిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెడిపోయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టే అంశంపై మంత్రి మంగళవారం సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలవారీగా రోడ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం అన్ని జిల్లాల ఎస్ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌కు, ఈఎన్సీకి ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, ఎస్ఈలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆర్థికశాఖ నుంచి అవసరమైన నిధులు మంజూ రు చేయిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి తెలంగాణలో ఉన్న 2,119 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.