కర్నూలులో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం పనులకు నేడు శ్రీకారం
భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్న సీఎం వైఎస్ జగన్
150 ఎకరాల భూమి కేటాయింపు, ఆరు నెలల్లో నిర్మాణాలు పూర్తి
ఇప్పటికే కర్నూలుకు తరలివచ్చిన హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త
న్యాయ రాజధాని కర్నూలు కీర్తికిరీటంలో మరో కలికితురాయి చేరుతోంది. ఇటీవల సీఎం వైఎస్ జగన్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా కర్నూలును న్యాయ రాజధాని అని పునరుద్ఘాటించిన క్రమంలో మరో ముందడుగు పడుతోంది. రాష్ట్రంలో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు దిశగా గురువారం శ్రీకారం చుడుతున్నారు. వర్సిటీ భవన నిర్మాణాలకు సీఎం జగన్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
– కర్నూలు (సెంట్రల్)
దేశంలో మొత్తం 28 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఇందులో రాష్ట్రంలోని విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం ఒకటి. న్యాయ రాజధాని కాబోతున్న కర్నూలులో రెండోది, దేశంలో 29వ న్యాయ విశ్వ విద్యాలయం నిర్మాణానికి అంతా సిద్ధమైంది. కర్నూలు శివారులోని జగన్నాథగట్టుపై ఈ విశ్వ విద్యాలయానికి 150 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. అందులో భవన నిర్మాణాలను ఆరు నెలల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. ఇక్కడ 2025–26 విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించే అవకాశం ఉంది.
అందుబాటులో న్యాయ విద్య
ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ కలిపి 45 లా కాలేజీలు ఉన్నాయి. నాణ్యమైన న్యాయ విద్యను అందించేందుకు కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఇందులో యూజీ, పీజీ కోర్సులతో పాటు డిప్లమో, సర్టిఫికెట్ కోర్సులను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటుంది. అంతేకాక న్యాయ విద్యలో పీహెచ్‌డీలు, ఫెలోషిప్‌లకు అవకాశం ఉంటుంది.
భవిష్యత్‌లో దేశం గర్వించదగ్గ న్యాయవాదులను అందించడంలో ఈ విశ్వవిద్యాలయం గొప్ప పాత్ర పోషిస్తున్నదనడంలో సందేహం లేదని ప్రఖ్యాత న్యాయ కోవిదులు చెబుతున్నారు. కాగా, న్యాయ విశ్వ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్లాట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా విద్యార్థులకు అడ్మిషన్ ఇస్తారు. అందులో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి న్యాయ విద్యార్థులు కర్నూలుకు రానున్నారు.
సీమవాసుల ఆశలకు అనుగుణంగా..
సీమ వాసుల కల సాకారం చేసేందుకు సీఎం వైఎస్ జగన్ మరో ముందడుగు వేస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత విశాఖలో పరిపాలన, అమరావతిలో శాసన, కర్నూలులో న్యాయ రాజధానులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. అయితే కోర్టు కేసుల నేపథ్యంలో 3 రాజధానుల చట్టాలు అమల్లోకి రాలేకపోయాయి. అయితే ప్రతిష్టాత్మక మానవహక్కుల కమిషన్ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్త వంటి న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలులో ఏర్పాటు చేశారు. అలాగే కర్నూలుకు వక్ఫ్ ట్రిబ్యునల్ కోర్టు తరలింపునకు పచ్చజెండా ఊపారు.
సీబీఐ కోర్టును కూడా కర్నూలులో ఏర్పాటు చేశారు. ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(ఏపీ ఈఆర్‌సీ) కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్బైడ్ ఫ్యాక్టరీ సమీపంలో రూ. 10 కోట్లతో ఏపీ ఈఆర్‌సీ భవనాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ మరోసారి ఘన విజయం సాధించాక హైకోర్టుతో పాటు అన్ని న్యాయ సంస్థలు, ట్రిబ్యునళ్లు కర్నూలుకు తరలివచ్చే అవకాశం ఉందని, పూర్తి స్థాయిలో న్యాయ రాజధాని అవుతుందని స్థానికులు భావిస్తున్నారు.
న్యాయ విశ్వ విద్యాలయం ఓ వరం
కర్నూలులో రెండో జాతీయ న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం గొప్ప విషయం. ఇది రాయలసీమ విద్యార్థుల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తుంది. నాణ్యతా ప్రమాణాలతో కూడిన న్యాయ విద్య అందుబాటులోకి వస్తుంది. దేశంలోనే ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాల జాబితాలోకి కర్నూలు చేరడం సంతోషకరం.
– మన్సూర్ రెహమాన్, రిటైర్డ్ ఎకనామిక్స్ ప్రొఫెసర్, కర్నూలు
హైకోర్టు కూడా కర్నూలుకు వస్తుంది
సీఎం జగన్ కర్నూలు అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. ఆయన రెండోసారి అధికారంలోకి వస్తే కచ్చితంగా కర్నూలుకు హైకోర్టు వచ్చి తీరుతుంది. ఇప్పటికే కర్నూలులో ప్రతిష్టాత్మక లోకాయుక్త, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌తో పాటు పలు ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేశారు. ఇప్పుడు మరో ప్రతిష్టాత్మక న్యాయ విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేస్తుండటం అభినందనీయం.
– జయపాల్‌రెడ్డి, రిటైర్డ్ జెడ్పీసీఈఓ, కర్నూలు
కర్నూలుకు జాతీయ స్థాయిలో పేరు
జాతీయ న్యాయ విశ్వ విద్యాలయం కర్నూలు సిగలో న్యాయ మణిహారం. ప్రతిష్టాత్మక ఈ విశ్వవిద్యాలయం వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాల విద్యార్థులు న్యాయ విద్య కోసం కర్నూలుకు వస్తారు. జాతీయ స్థాయిలో కర్నూలుకు మంచి పేరు వస్తుంది.
– మద్దెల శ్రీనివాసరెడ్డి, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment