
ఐటీలో హైదరాబాదే మేటి!
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడి
హైదరాబాద్: వచ్చే ఐదేళ్లలో ఐటీ రంగంలో హైదరాబాద్ మహానగరం దేశంలోనే నెంబర్‌వన్ స్థానానికి ఎదుగుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై మంగళవారం నాటికి 100 రోజులు పూర్తయిన సందర్భంగా వివిధ ప్రాజెక్టుల కోసం నాస్కాం, ట్రిపుల్‌ఐటీ, ఐఎస్‌బీ, నల్సార్ లా యూనివర్సిటీ ప్రతినిధులతో ప్రభుత్వం ఎంఓయూ కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభు త్వ ప్రతినిధులుగా మంత్రి కేటీఆర్, ఐటీ కార్యదర్శి హర్‌ప్రీత్‌సింగ్‌లు బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి (నాస్కాం), ప్రొఫెసర్ పి.జె.నారాయణ (డెరెక్టర్, ఐఐఐటీహెచ్), అజిత్ రంగ్నేకర్ (డీన్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), ప్రొఫెసర్ ఫైజన్ ముస్తఫా (వైస్ చాన్సలర్, నల్సార్ లా యూనివర్సిటీ)తో అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ప్రపంచస్థాయి ఐటీ దిగ్గజ కంపెనీలను హైదరాబాద్‌లో ఏర్పాటుచేయాలని కోరేందుకు నవంబర్ 15న అమెరికా వెళ్తున్నట్టు మంత్రి వెల్లడించారు. అక్టోబర్‌లో జరిగే మెట్రోపోలీస్ సదస్సుకు అనువుగా నగరాన్ని తీర్చిదిద్దడానికి సలహాలు, ఫిర్యాదులు స్వీకరించ డం కోసం జీహెచ్‌ఎంసీ రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు.
ఐఆర్‌సీ ప్రమాణాలతో గ్రామీణ రోడ్లు
పంచాయతీరాజ్ రోడ్లను సైతం ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్‌సీ) ప్రమాణాల మేరకు నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ఐఆర్‌సీ నిబంధనలకు అనుగుణంగా రోడ్లను నిర్మిస్తే ఖర్చుపెరిగే అవకాశం ఉన్నా, దీర్ఘకాలికంగా మన్నేలా గ్రామీణ రోడ్లను తీర్దిదిద్దాలని భావిస్తున్నట్లు చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా చెడిపోయిన రోడ్లకు మరమ్మతులు చేపట్టే అంశంపై మంత్రి మంగళవారం సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలవారీగా రోడ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు బుధవారం అన్ని జిల్లాల ఎస్‌ఈలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్‌కు, ఈఎన్‌సీకి ఆదేశాలిచ్చినట్లు చెప్పారు. రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడాల్సిన అవసరం లేదని, ఎస్‌ఈలు ఇచ్చే నివేదికల ఆధారంగా ఆర్థికశాఖ నుంచి అవసరమైన నిధులు మంజూ రు చేయిస్తానని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఆగస్టు 15 నాటికి తెలంగాణలో ఉన్న 2,119 పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ వెల్లడించారు.