ఐటీ కోటకూ డ్రగ్స్ మరకలు
► మాదక ద్రవ్యాల మత్తులో చిత్తవుతున్న టెకీలు
► పదుల కంపెనీల్లో వందలాది మంది సిబ్బంది
► గుర్తించిన ఎక్సైజ్ సిట్.. ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్‌కు జాబితా
► కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్‌కు అడ్డా
► మేం సినీ రంగాన్ని టార్గెట్ చేయడం లేదు: అకున్ సబర్వాల్
► విచారణకు వస్తున్న సినీ ప్రముఖులు తెలివిగా వ్యవహరిస్తున్నారు
► ఆనవాళ్లు దొరక్కుండా అలోవేరా జ్యూస్ తీసుకుంటున్నారని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: డ్రగ్స్ మహమ్మారి ఐటీ రంగానికి కూడా విస్తరించిందా? టెకీలు సైతం మత్తులో చిత్తవుతున్నారా? సాఫ్ట్‌వేర్ కంపెనీల్లోని కెఫెటేరియాలే డ్రగ్స్‌కు అడ్డాలుగా మారాయా? అవుననే అంటున్నారు ఎక్సైజ్ అధికారులు! సిట్ దర్యాప్తులో మాదకద్రవ్యాలకు బానిసలుగా మారిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ల జాతకాలు బయటపడ్డట్టు తెలిసింది. డ్రగ్స్ ముఠా సభ్యులు కెల్విన్, ఖుదూస్, నిఖిల్ శెట్టి, విలియమ్స్, జీశాన్‌ల విచారణలో ఈ కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. పదుల కంపెనీల్లోని వందలాది మంది సిబ్బంది మత్తుకు బానిసయ్యారని స్వయంగా ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ వెల్లడించారు.
వారి జాబితా రూపొందించి ఐటీ శాఖ కార్యదర్శి జయేష్ రంజన్‌కు సమర్పించినట్టు పేర్కొన్నారు. తాము కేవలం సినీ పరిశ్రమనే టార్గెట్ చేస్తున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని, డ్రగ్స్‌కు అలవాటు పడ్డవారందని విచారిస్తున్నామని స్పష్టంచేశారు. ఇప్పటిదాకా 27 మందికి నోటీసులు జారీ చేశామని, 12 మందిని సిట్ కార్యాలయంలో విచారిస్తుండగా.. మిగతా వారిని వివిధ ప్రాంతాల్లో సిట్ బృందాలు విచారిస్తున్నాయని అకున్ తెలిపారు. మంగళ«వారం సచివాలయంలో హరితహారం, గుడుంబా రహిత రాష్ట్రం తదితర అంశాలపై జరిగిన సమీక్షలో ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్, డైరెక్టర్ అకున్ సబర్వాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లో అనేక విషయాలు వెల్లడించారు.
అలోవేరా జ్యూస్ తాగి వస్తున్నారు..
డ్రగ్స్ కేసులో విచారణకు హాజరవుతున్న సినీ ప్రముఖులంతా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారని అకున్ అభిప్రాయపడ్డారు. డ్రగ్స్ తీసుకుంటున్నట్టు బయటపడకుండా ఉండేందుకు ఉదయం నుంచి సాయంత్రం వరకు నీళ్లకు బదులు అలోవేరా జ్యూసులు, విలువైన హోమియోపతి డ్రింక్స్ సేవిస్తున్నారని తెలిపారు. ఇక్కడ దొరకని డ్రింక్స్‌ను విదేశాల నుంచి ఆగమేఘాల మీద తెప్పించుకొని మరీ వాడుతున్నారని చెప్పారు. రక్త పరీక్షల్లో డ్రగ్స్ ఆనవాళ్లు దొరక్కుండా ఉండేందుకు ఇలా చేస్తున్నారన్నారు. ఇక వెంట్రుకల ద్వారా బయటపడకుండా ఉండేందుకు ఖరీదైన షాంపులతో తలస్నానం విచారణకు హాజరవతున్నారని తెలిపారు. పవర్‌ఫుల్ షాంపులు వాడితే డ్రగ్స్ ఆనవాళ్లు అంత పక్కాగా రావన్న అభిప్రాయం ఉండటంతో ఇలా చేస్తున్నట్టు వివరించారు.
పాఠశాలల్లో సీరియస్ రియాక్షన్
డ్రగ్స్‌కు బానిసైన విద్యార్థులను డీఅడిక్షన్ చేయడంతోపాటు భారీ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అకున్ తెలిపారు. ఇప్పటికే అనేక పాఠశాలలు, కాలేజీల్లో ఆయా యాజమాన్యాలు డ్రగ్స్ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నాయన్నారు. అందులో భాగంగా స్కూల్ లోపలికి సెల్‌ఫోన్లను నిషేధించారన్నారు. అలాగే కాల్‌డేటాపై కూడా తమ నిఘా ఉండటంతో ఏమాత్రం డ్రగ్స్ వైపు ఆలోచించడం లేదన్నారు. తల్లిదండ్రులకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చామని, ప్యాకెట్ మనీకి కోత విధించేలా చర్యలు తీసుకున్నామన్నారు. పాఠశాలలు, కాలేజీల్లోని బాత్రూమ్‌ల్లో యాజమన్యాలు తనిఖీలు చేస్తున్నాయన్నారు.
రోజుకు 400 కేజీల గంజాయి
రాష్ట్రంలో డ్రగ్స్ వ్యవహారం వెలుగులోకి రాగానే తమ విభాగం, పోలీసు శాఖ వరుస దాడులు నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ కమిషనర్ చంద్రవదన్ తెలిపారు. దీంతో ప్రతిరోజు 300 నుంచి 400 కేజీల గంజాయి పట్టుబడుతోందని పేర్కొన్నారు. ఎగువ సీలేరు, దిగువ సీలేరు ప్రాంతాల నుంచి భారీ స్థాయిలో రాష్ట్రంలోకి గంజాయి సరఫరా అవుతోందని చెప్పారు.
పరోక్షంగా నిందితురాలని ఒప్పుకున్నట్టయింది..
తాము చార్మిని నిందితురాలిగా భావించలేదని, కేవలం వివరాలు సేకరించేందుకు రావాలని కోరినట్లు చంద్రవదన్ తెలిపారు. కానీ ఇప్పుడు ఆమె కోర్టుకు వెళ్లి పరోక్షంగా తాను నిందితురాలని ఒప్పుకున్నట్టయిందని అభిప్రాయపడ్డారు. చార్మిని తనకు నచ్చిన ప్రాంతంలోనే విచారిస్తామని చెప్పామన్నారు. కానీ కోర్టుకు వెళ్లడంతో సిట్ కార్యాలయంలోనే విచారణకు రావాల్సి ఉంటుందన్నారు. చార్మి, ముమైత్‌ఖాన్‌ను విచారించేందుకు మహిళా అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ నేతృత్వంలో ముగ్గురు మహిళా సీఐలను నియమించినట్టు తెలిపారు.
ప్రముఖ హీరోలు, బడా నిర్మాతలు
విచారణ ఎదుర్కొంటున్నవారు.. ప్రముఖ హీరోలు, హీరోయిన్ల పేర్లు చెబుతున్నారని, ఇండస్ట్రీలోని బడా నిర్మాతలు కూడా డ్రగ్స్ వాడుతున్నారని వెల్లడిస్తున్నట్టు చంద్రవదన్ తెలిపారు. అయితే వారు చెబుతున్న అంశాల ఆధారంగా వెంటనే నోటీసులు ఇవ్వలేమని, వారు చెప్పే అంశాలకు బలం చేకూర్చే ఆధారాలను సంపాదించే పనిలో సిట్ ఉందన్నారు. సినీ ఇండస్ట్రీలో చీలిక ఏర్పడినట్టు వార్తలు వస్తున్నాయని, విచారణ ఎదుర్కొంటున్నవారు ఇంకో గ్రూపు వారి గురించి చెబుతున్నట్టు కనిపిస్తోందన్నారు.
తెలంగాణ–ఆంధ్రా అన్న భావనను కూడా తెరపైకి తెచ్చే యత్నం జరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. డ్రగ్ తీసుకున్న వారిని సులభంగా గుర్తించేందుకు అథ్లెటిక్స్‌కు ఉపయోగించే డోపింగ్ టెస్ట్ మిషన్‌ను ఢిల్లీ నుంచి తెప్పించాలని ప్రభుత్వాన్ని కోరామని, అయితే కొన్ని న్యాయపరమైన చిక్కుల వల్ల అది కుదరలేదని చంద్రవదన్ చెప్పారు. డ్రగ్ కేసులో ప్రతిరోజు ప్రభుత్వానికి నివేదిక పంపిస్తున్నామన్నారు.
నటి గౌతమి ఆధ్వర్యంలో డీ అడిక్షన్ సెంటర్!
ప్రస్తుతం డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖుల పేర్లు ఎక్కువగా వినిపిస్తుండటంతో ఎక్సైజ్ శాఖ ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. నటి గౌతమి హాసన్ ఆధ్వర్యంలో నడుస్తున్న స్వచ్ఛంద సంస్థ ద్వారా త్వరలో పెద్దఎత్తున డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు యత్నాలు చేస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. దీనిద్వారా డ్రగ్స్ బాధితులందరికీ విముక్తి కల్పించే ప్రయత్నం చేస్తున్నట్టు వారు తెలిపారు.