బెంగళూరులోని ఓ ఐటీ సంస్థ భవనసముదాయం
బెంగళూరు: భారత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) రాజధానిగా కొనసాగుతోన్న బెంగళూరు.. మున్ముందు తన ప్రాభవాన్ని కోల్పోనుందా? 'ఇండియన్ సిలికాన్ వ్యాలీ'అనే పెట్టని ఆభరణాన్ని ఆ నగరం చేజార్చుకోనుందా? ఇప్పటికే ఆ నగరానికి పోటీ ఇస్తూ, ఇంకా మరిన్ని ఆకర్షణలతో హైదరాబాద్.. బెంగళూరు అవకాశాలకు గండికొట్టనుందా? అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్(ఈవోడీబీ) ర్యాంకులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
కేంద్ర వాణిజ్య శాఖ- ప్రపంచ బ్యాక్ సంయుక్తంగా ప్రకటించిన ఈవోడీబీ జాతీయ ర్యాంకుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లు మొదటి స్థానాన్ని కైవసం చేసుకోగా బెంగళూరు రాజధానిగా ఉన్న కర్ణాటక మాత్రం 13 స్థానానికి పడిపోయింది. గత ఏడాది వెల్లడించిన ర్యాంకుల్లో 9వ స్థానంలో నిలిచిన కర్ణాటక ఈసారి నాలుగు స్థానాలు దిగజారింది. ప్రస్తుతానికైతే ఐటీ ఎగుమతులు, సేవల్లో బెంగళూరు నంబర్ వన్ స్థానంలో ఉన్నప్పటికీ ఈవోబీడీ ర్యాంకుల ప్రభావంతో అవకాశాలు చేజార్చుకోవడం ఖాయమని వాణిజ్యవర్గాల విశ్లేషణ. దీనికితోడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వంలో ఇటీవల భారీగా పెరిగిన అవినీతి, తద్వారా సంస్థలకు అనుమతులు మంజూరుచేయడంలో నెలకొన్న జాప్యం తదితర కారణాలు కూడా బెంగళూరుకు ప్రతికూలతలుగా మారాయి.
ఐటీ రాజధాని ఉండి కూడా కర్ణాటక ఈవోబీడీ ర్యాంకుల్లో వెనుకబడిపోవడం శరాఘాతం లాంటిదేనని సాక్షాత్తూ ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఆర్.వి.దేశ్ పాండే అన్నారు. 'నిజమే.. ఈవోడీబీ ర్యాంకుల్లో మేం అధమస్థాయికి పడిపోయినమాట వాస్తవమే. అయితే ఐటీ పెట్టుబడుల ఆకర్షణలో ఇప్పటికీ బెంగళూరు నగరానిదే పైచేయి అని మరువొద్దు. కనీసం రూ.లక్ష కోట్ల పెట్టుబడులకు మా ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, ఈ విషయంలో తెలంగాణ, ఏపీ, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కర్ణాటక కంటే చాలా దూరంలో ఉన్నాయి' అని దేశ్ పాండే ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి క్యాన్సర్ లాంటిదని, దాన్ని రూపుమాపడంలో కాలయాపన జరిగినా మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కర్ణాటక ఎంతో మెరుగని ఆయన అన్నారు. అదే సమయంలో ఈవోడీబీ ర్యాంకుల విధానంపైనా కర్ణాటక అనేక అనుమానాలను వ్యక్తం చేయడం గమనార్హం.
బెంగళూరు నగరంలో పరిశ్రమలు విస్తరించినంత వేగంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని బెంగళూరు కేంద్రంగా స్టార్ట్ అప్ ప్రారంభించిన సోమ్ సింగ్ చెప్పుకొచ్చారు. బెంగళూరు నగరంలోని ప్రధాన ప్రాంతాలైన కోరమంగళ్ నుంచి హెబ్బాల్ ల మధ్య ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయిందని, దీంతో ఐటీ నిపుణులు 'వర్క్ ఫ్రమ్ హోమ్' బదులు 'వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్'కు అలవాటుపడాల్సిన పరిస్థితి నెలకొందని, ఇది సిటీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బతీస్తుందని ఆమె అన్నారు. ఒకవైపు హైదరాబాద్ లో టీ-హబ్ తరహా ఏర్పాట్లతో ఔత్సాహికులను ప్రోత్సహిస్తుండగా, కర్ణాటకలో మాత్రం చిన్న తరహా వ్యాపారాలకు అనుమతులు లభించడం కష్టంగా మారిందని సోమ్ పేర్కొన్నారు. బెంగళూరు ఎదుర్కొంటున్న ఇబ్బందులనుంచి పాఠాలు నేర్చుకుని మరింత మెరుగ్గా పనిచేస్తే 'సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా' అడ్రస్ హైదరాబాద్ కు మారడం ఎంతోదూరంలో లేదట!