హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : రాష్ట్రం ఏర్పడ్డాక హైదరాబాద్‌లో మొదటిసారి తొలి అర్ధ సంవత్సరం(హెచ్–1)లో ఇళ్ల అమ్మకాలు బాగా పెరిగాయి. రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) హైదరాబాద్ రియల్టీ మార్కెట్‌కు బ్రేకులు వేస్తున్నా.. ఈ ఏడాది హెచ్1లో 3,706 యూనిట్లు కొత్తగా ప్రారంభమయ్యాయని, ఇది గతేడాది తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే దాదాపు 44 శాతం ఎక్కువని నైట్‌ఫ్రాంక్ హైదరాబాద్ డైరెక్టర్ సామ్సన్ ఆర్థర్ చెప్పారు. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ), రెరా ఇవన్నీ గతేడాది బాగా ప్రభావం చూపాయని, ప్రస్తుతం వృద్ధి కనిపిస్తోందని వెల్లడించారు. ‘2018 తొలి అర్ధ సంవత్సరం: ఇండియన్ రియల్ ఎస్టేట్’9వ నివేదికను విడుదల చేసిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. నివేదికలోని ముఖ్యాంశాలివే..
రూ.25లక్షల లోపు గృహాల్లేవ్..
ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్‌లో 3,706 కొత్త గృహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 2,628 యూనిట్లు(71 శాతం) పశ్చిమ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. కొత్త గృహాల్లో 47 శాతం యూనిట్లు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్నవే. రూ.2–4 కోట్ల ధర ఉన్న గృహాలు 3 శాతం పశ్చిమ ప్రాంతంలో ఉన్నాయి. ఇక, రూ.25 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు ఒక్కటంటే ఒక్కటీ ప్రారంభం కాలేదు.
తొలిసారి 8 వేల ఇళ్ల విక్రయం..
నగరంలో తొలి అర్ధభాగం ఇళ్ల అమ్మకాల్లో 5 శాతం వృద్ధి నమోదైంది. మొత్తంగా 8,313 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇందులో 5,766 యూనిట్లు పశ్చిమ హైదరాబాద్‌లోనే కావటం గమనార్హం. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌లో 8 వేలకు పైగా గృహాలు విక్రయం కావటం ఇదే తొలిసారి. కార్యాలయాల మార్కెట్ ఆశాజనకంగా ఉండటమే నివాస విభాగం వృద్ధికి కారణమని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొండాపూర్, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే 69 శాతం విక్రయాలు జరిగాయి.
ఇక్కడ 8 శాతం ధర వృద్ధి..
ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్‌లో మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు తగ్గాయి. హైదరాబాద్‌లో గృహాల సప్లయి, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఏడాది కాలంలో 8 శాతం ధర వృద్ధి చెందింది. ఇక, ఎన్‌సీఆర్‌లో 10 శాతం, ముంబైలో 9 శాతం, పుణె, కోల్‌కత్తాలో 8 శాతం ధరలు తగ్గాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌లో స్థిరంగా ఉన్నాయి. నగరంలో ఇంకా 12,749 ఇళ్లు అమ్ముడుపోకుండా ఇన్వెంటరీగా ఉన్నాయి. వీటిల్లో పశ్చిమంలో 7,397, ఉత్తరంలో 2,099, దక్షిణంలో 1,704, సెంట్రల్‌లో 788, తూర్పు హైదరాబాద్‌లో 762 యూనిట్లున్నాయి. వీటి అమ్మకాలకు మరో ఏడాదిన్నర సమయం పడుతుంది.
తగ్గిన ఐటీ ఆఫీస్ మార్కెట్ హవా..
హెచ్1లో హైదరాబాద్ నగరంలో 17 లక్షల చ.అ. కొత్త ఆఫీస్ స్పేస్ నిర్మాణం, 27 లక్షల చ.అ.ల్లో లావాదేవీలు జరిగాయి. ఇది గత ఏడాది కాలంతో పోలిస్తే నిర్మాణంలో 14 శాతం క్షీణత, లావాదేవీల్లో 15 శాతం వృద్ధి. అద్దె నెలకు సుమారు చ.అ.కు రూ.53గా ఉంది. ఇంకా, నగరంలో 6.2 కోట్ల చ.అ. ఆఫీస్ స్పేస్ స్టాక్ ఉంది. సాధారణంగా ఆఫీ స్ స్పేస్ మార్కెట్లో ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ రంగాలదే హవా. అయినా, ఈ ఏడాది హెచ్1లో ఈ రంగాల లావాదేవీల్లో క్షీణత నమోదైంది. గతేడాది హెచ్1లో ఐటీ వాటా 51 శాతం ఉంటే.. ఈసారి 36 శాతానికి, బీఎఫ్‌ఎస్‌ఐ 21 శాతం నుంచి 7 శాతానికి పడిపోయింది. మరోవైపు కంపెనీల విభాగం 5 నుంచి 15 శాతానికి, సర్వీస్ సెక్టార్ 23 నుంచి 43 శాతానికి పెరిగాయి. గతేడాది హెచ్1లో 126 డీల్స్ జరగ్గా.. ఈ ఏడాది హెచ్1లో 120 డీల్స్ జరిగాయి.
Comments
Please login to add a commentAdd a comment