మళ్లీ రెచ్చిపోతున్న‘రియల్‌’ గ్యాంగ్స్‌  | Real Estate Mafia In Hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ రెచ్చిపోతున్న‘రియల్‌’ గ్యాంగ్స్‌ 

Published Tue, Jul 10 2018 1:39 PM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Real Estate Mafia In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగర శివార్లలో రియల్టీ బిజినెస్‌ స్పీడ్‌తో పాటు నయా గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఉపయోగంలోకి రాని భూములపై కన్నేస్తూ... డబుల్‌ రిజిస్ట్రేషన్లకు తెగబడుతున్నాయి. ఇటీవల గ్రేటర్‌ పరిధిలోని భూముల ధరలకు రెక్కలు రావటంతో కొందరు గ్యాంగ్‌స్టర్లు ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు, చిరుద్యోగులు కొనుగోలు చేసి ఉపయోగంలోకి రాని భూములపై కన్నేశారు. వాటి డబుల్‌ రిజిస్ట్రేషన్లతో.. డబ్బుల పంటను పండించేస్తున్నారు.

ఈ అక్రమ దందాకు పొలిటికల్, పోలీస్, సబ్‌రిజిస్ట్రార్‌ విభాగాలు పూర్తిగా సహకరిస్తుండటంతో ఎంతో మంది బాధితులు న్యాయం కోసం రాచకొండ, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్ల మెట్లు ఎక్కుతున్నారు. పోలీస్‌ కమిషనరేట్‌కు వస్తున్న ప్రతి పది ఫిర్యాదుల్లో ఏడు నుంచి ఎనిమిది వరకు ఇలాంటి కేసులే వస్తుండటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో యాదాద్రి–భువనగిరి, ఎల్బీనగర్, బాలానగర్‌ డివిజన్‌ పరిధిలో అత్యధిక భూ సంబంధ వివాదాలు వస్తుండటం అందులో స్థానిక ప్రజాప్రతినిధులు, వారి సమీప బంధువులు, పోలీస్‌ అధికారుల ప్రమేయంపై ఫిర్యాదులు వస్తుండటం విశేషం. 

డబుల్‌ అంటే.. వెరీ స్పీడ్‌  
డబుల్‌ రిజిస్ట్రేషన్స్‌ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో డబ్బులు వెదజల్లుతున్నాయి. ఒక మారు తన భూమిని విక్రయించిన వ్యక్తి,.. మరోసారి పాత రికార్డులతో యధేచ్ఛగా విక్రయిస్తున్నాడు. ఇందుకు డాక్యుమెంటు రైటర్లు, సబ్‌రిజిస్ట్రార్లు సహకరించి డబుల్‌ రిజిస్ట్రేషన్‌కు పాల్పడుతున్నారు. సంబంధిత ఆస్తి ఎవరి పేరు మీద ఉన్నదన్న విషయాన్ని తెలుసుకునే వీలు ఉన్నప్పటికీ..టైటిల్‌ వెరిఫికేషన్‌ వివరాల్లోకి సబ్‌రిజిస్ట్రార్లు వెళ్లకుండా లింక్‌ డాక్యుమెంట్ల ఆధారంగా పని కానిచ్చేస్తున్నారు. వాస్తవానికి నిషేధిత భూముల(ప్రభుత్వ, వక్ఫ్, భూదాన, దేవాలయ తదితరాలు)ను రిజిష్ట్ర్‌రేషన్‌ చేసే విషయంలో ఇటీవలి కాలంలో జాగ్రత్త పడుతున్న సబ్‌రిజిస్ట్రార్లు. ప్రైవేటు భూముల డబుల్‌ రిజిస్ట్రేషన్లలో మాత్రం ఏ మాత్రం తగ్గటం లేదు. ఈ విషయమై ఓ ఉన్నతాధికారిని ప్రశ్నిస్తే టైటిల్‌ వెరిఫికేషన్‌ తమ పరిధిలోకి రాదని చెబుతూ, ఆన్‌లైన్‌లోనే, ఒక మారు రిజిస్టర్‌ చేసిన భూములను మళ్లీ అదే వ్యక్తులు చేయకుండా నిరోధించే సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. అలా ఐతేనే అక్రమాలకు చెక్‌ చెప్పే చాన్స్‌ ఉంటుందన్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ అలజడి 
గ్యాంగ్‌స్టర్‌ నయీం ఆగడాలతో వణికిపోయిన యాదాద్రి భువనగిరి జిల్లాలో మళ్లీ రియల్‌ గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. ఈ మారు పొలిటికల్‌ బాస్‌లు...వారి కనుసన్నల్లో నడిచే కొందరు పోలీస్‌ అధికారుల చర్యలతో ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన ఎన్నారైలు, పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ను దుబాయ్‌లో స్థిరపడ్డ ఫిలిప్స్‌ ఆనే ఎన్నారై కలిసి యాదగిరిగుట్టలో అక్కడి రాజకీయనాయకులు–ఒక పోలీస్‌ అధికారి తనను ఇబ్బందులకు గురి చేస్తున్న వైనాన్ని వివరించి న్యాయం చేయాలని వేడుకున్నాడు. తాను యాదగిరిపల్లిలో సర్వే నెంబర్‌ 146/ఎఎ/1లో  15.9.2000లో ఆకుల చిననర్సయ్య అనే వ్యక్తి నుండి ఐదెకరాలు భూమిని కొనుగోలు చేశానని, ఈ భూములకు సంబంధించిన మ్యుటేషన్, పాసుబుక్కుల పొందడం చేశానని, అలాగే కబ్జాలోనూ తానే ఉన్నానని వివరించాడు. అయితే అదే చిన నర్సయ్యతో కొందరు మళ్లీ భూమిని డబుల్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకుని, ఆలేరు నియోజకవర్గానికి చెందిన ఓ రాజకీయ నాయకుడు, ఓ పోలీస్‌ అధికారి అండతో తనను ఆ భూమి అమ్మేయాలని, లేదా సెటిల్‌ చేసుకోవాలని ఒత్తిడి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీనిపై సత్వరం స్పందించిన సీపీ మహేష్‌భగవత్‌ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త అక్రమ భూ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఇదే తరహాలో యాదాద్రి –భువనగిరి జిల్లా నుండి భారీఎత్తున రాచకొండ పోలీస్‌ కమిషనరేట్‌కు ఫిర్యాదులు వస్తుండటం విశేషం. 

హఫీజ్‌పేటలో భూముల వేట 
హఫీజ్‌పేట సర్వే నంబర్‌ 80లోని సుమారు 600 ఎకరాలను నిజాం హయాంనాటి ‘పైగా’ భూములుగా గుర్తించారు. ఈ భూములనూ కబ్జాచేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. వాస్తవంగా ఈ భూములను సర్వే నంబర్‌ 80(ఎ),80(బి),80(సీ),80(డీ)గా విభజించగా, ఈ భూముల్లో 80(డీ) భూములకు మాత్రమే కోర్టు అనుకూల ఉత్తర్వులు, ఆపై డిక్రీలున్నట్లు రెవెన్యూ అధికారుల నివేదికలు చెబుతున్నాయి. మిగిలిన మూడు సర్వే నెంబర్లకు డిక్రీలు లేవు. ఇందులో 80(ఎ) ఆక్రమణలకు గురికాగా, 80(బీ),80(సీ)ల సంబంధించిన వివాదాలు న్యాయస్థానాలు, ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. అయితే మియాపూర్‌ భూ కుంభకోణ సూత్రధారులే 80(డీ) పత్రాలను 80(బి)కి వర్తించేలా ఏర్పాట్లు చేస్తూ వాటిని విక్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఇక అందులో అధికారపార్టీ ప్రజాప్రతినిధులు, కొందరు పోలీస్‌ అధికారులు, ల్యాండ్‌ మాఫియా గ్యాంగ్‌స్టర్లకు వాటాలు ఇస్తామంటూ, మిగిలిన భూమిని ఓ బడా కంపెనీకి కట్టబెట్టే ఏర్పాట్లు చేసున్న అంశం ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. అయినా ఈ భూములను ఎలాగైనా దక్కించుకునే దిశగా ప్రైవేటు వ్యక్తులు ప్రయత్నాలు చేస్తుండడం సైబరాబాద్‌ పోలీస్‌ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement