సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉండగా.. రియల్టీ రంగంలో స్తబ్దత నెలకొంది. ఏ ప్రభుత్వం వస్తుందో, అభివృద్ధి పనులు ఎలా ఉంటాయో, ధరలు తగ్గుతాయేమో అనే రకరకాల కారణాలతో స్థిరాస్తి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి.
మే నెలతో పోలిస్తే జూన్‌లో గ్రేటర్‌లో రిజిస్ట్రేషన్లు, వాటి విలువలు క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. మేలో రూ.2,994 కోట్ల విలువ చేసే 5,877 అపార్ట్‌మెంట్ల రిజిస్ట్రేషన్స్ జరగగా.. జూన్ నాటికి రూ.2,898 కోట్ల విలువైన 5,566 యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది.
- గతేడాది జూన్‌లో జరిగిన 5,411 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రిజిస్ట్రేషన్స్‌లో 3 శాతం వృద్ధి నమోదయింది. అలాగే విలువల పరంగా చూస్తే 2022 జూన్‌లో రూ.2,842 కోట్లతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరుగుదల కనిపించింది. గత నెలలోని రిజిస్ట్రేషన్స్‌లో 52 శాతం యూనిట్లు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే. అలాగే రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా 9 శాతంగా ఉంది. 68 శాతం ఫ్లాట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న యూనిట్లే. 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 11 శాతంగా ఉంది.
- రిజిస్ట్రేషన్స్‌లో మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా హవా కొనసాగుతుంది. జూన్‌లో జరిగిన రిజిస్ట్రేషన్స్‌లో ఈ జిల్లా వాటా 46 శాతం కాగా.. రంగారెడ్డి 38 శాతం, హైదరాబాద్ 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి.
ఈ ఏడాది నెల వారీగా రిజిస్ట్రేషన్స్ (రూ.కోట్లలో)
నెల | రిజిస్ట్రేషన్లు | విలువ |
జనవరి | 5,454 | 2,650 |
ఫిబ్రవరి | 5,725 | 2,987 |
మార్చి | 6,959 | 3,602 |
ఏప్రిల్ | 4,494 | 2,286 |
మే | 5,877 | 2,994 |
జూన్ | 5,566 | 2,898 |
సోమాజిగూడలో రూ.5.09 కోట్లు
సోమాజిగూడ ఖరీదైన నివాసాలకు కేంద్రంగా మారింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్–5 లావాదేవీలలో నాలుగు ఈ ప్రాంతంలోనే జరగడం గమనార్హం. రూ.5.09 కోట్ల మార్కెట్ విలువ గల 3,500 చ.అ.ల లోపు ఉన్న రెండు అపార్ట్‌మెంట్లు, రూ.4.22 కోట్ల వ్యాల్యూ ఉండే మరొక రెండు యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అలాగే నార్సింగిలో రూ.5 కోట్ల మార్కెట్ విలువ గల ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది.
ఇదీ చదవండి: ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్!
Comments
Please login to add a commentAdd a comment