ఫామ్‌ ల్యాండ్‌ బురిడీ | Sakshi
Sakshi News home page

ఫామ్‌ ల్యాండ్‌ బురిడీ

Published Tue, Mar 26 2024 5:48 AM

Hundreds of unofficial layouts At Bhuvanagiri - Sakshi

భువనగిరిలో నిబంధనలకు పలు రియల్‌ ఎస్టేట్‌ సంస్థల తూట్లు 

వందల సంఖ్యలో అనధికార లేఅవుట్‌లు  

సహకరిస్తున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్‌ శాఖలు 

రూ.కోట్లలో ఆదాయం కోల్పోతున్న స్థానిక సంస్థలు, ప్రభుత్వం 

అన్ని అనుమతులూ ఉన్నాయని కొనుగోలుదారులను మోసగిస్తున్న వైనం 

సాక్షి, యాదాద్రి: ధరణిలోని లొసుగులను ఆసరాగా చేసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లాలోని కొన్ని రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు..అధికారులతో కుమ్మక్కై ప్రధానంగా ఫామ్‌ ల్యాండ్‌ వెంచర్లు, అలాగే అనధికారిక లేఅవుట్లు, చట్టవిరుద్ధ రిజిస్ట్రేషన్లు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్నాయి. స్థానిక సంస్థల స్థిరాస్తి ఆదాయానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి  రూ.కోట్లలో గండి కొడుతున్నాయి. వాస్తవానికి అనధికారిక లే అవుట్లను అదుపు చేయడంతో పాటు, ఆదాయానికి గండి పడకుండా, ప్రజలు రియల్టర్ల మోసాల బారిన పడకుండా ప్రభుత్వం మెమో జారీ చేసింది. దీని ప్రకారం తహసీల్దార్‌ కార్యాలయంలో 0.20 ఎకరాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ గుంట, రెండు గుంటల భూమిని కూడా ఫామ్‌ ల్యాండ్‌ వెంచర్ల కింద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు.

అదేవిధంగా తహసీల్దార్‌ ఇచ్చిన నాలా కన్వర్షన్‌ పత్రాలతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ప్లాట్లను 2000 చదరపు గజాల కంటే తక్కువ రిజిస్ట్రేషన్‌ చేయకూడదు. కానీ 121 (గుంట), 242 (రెండు గుంటలు) గజాల ప్లాట్లను కూడా రిజిస్టర్‌ చేస్తున్నారు. అలాగే డీటీసీపీ, హెచ్‌ఎండీఏ, రెరా, వైటీడీఏల అప్రూవ్డ్‌ లేఅవుట్లలోనే ఆయా వెంచర్లకు సంబంధించిన మొత్తం సర్వే నంబర్లు వేసి రిజిస్ట్రేషన్లు చేయాలి. కానీ ఓపెన్‌ ప్లాట్లకు నాలా కన్వర్షన్‌తో 121, 242, 363 గజాల ప్లాట్లకు కూడా వెంచర్‌కు సంబంధించిన అన్ని సర్వే నంబర్లు వేసి, ఆ ప్లాటు చుట్టూ హద్దులు ఇతర ప్లాట్లకు సంబంధించిన నంబర్లు వేయడం ద్వారా అన్ని అనుమతులు ఉన్నాయని కొనుగోలుదారులను నమ్మిస్తూ ఫామ్‌ ల్యాండ్‌ పేరుతో యధేచ్చగా రిజిస్ట్రేషస్లు చేసేస్తుండటం గమనార్హం. 

కొనుగోలుదారులకు ఎర 
ఎలాంటి అనుమతులు లేకుండా కొత్త కొత్త పేర్లతో వేల ఎకరాల్లో లేఅవుట్‌లు అభివృద్ధి చేస్తున్నారు. కొనుగోలుదారులను ఆకర్షించడానికి వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే వెంచర్‌ ప్రారంభోత్సవం రోజునే ప్లాటు కొనుగోలు చేసిన మొదటి 50 మందికి నెలకు రూ.10 వేల చొప్పున 30 నెలల పాటు రెంటల్‌ చెల్లిస్తామని ఆఫర్‌ ఇస్తూ పెద్దయెత్తున ప్రచారం చేస్తున్నారు.  

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి 
ఈ అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి, స్థానిక సంస్థల ఆదాయానికి భారీగా గండి పడుతోంది. రియల్టర్లు డెవలప్‌మెంట్‌ చార్జీల చలాన్ల నిమిత్తం ఎకరానికి సుమారు రూ.లక్ష చొప్పున చెల్లించకుండా, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు 10 శాతం స్థిరాస్తి భూమిని గిఫ్ట్‌ డీడ్‌ చేయకుండా ఎగవేస్తున్నారు. గతంలో మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ జారీ చేసిన జీఓ ప్రకారం అప్పటి కలెక్టర్‌ పమేలా సత్పతి ఫాంల్యాండ్‌ రిజిస్ట్రేషన్లు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేయడంతో కొంత కాలం నిలిచిపోయినా తిరిగి ఊపందుకున్నాయి. 

900 వరకు అక్రమ వెంచర్లు!  
జిల్లాలో ఫామ్‌ ల్యాండ్‌ పేరుతో వ్యాపారం చేస్తున్న సుమారు 900 వరకు అక్రమ వెంచర్లు ఉన్నట్లు అంచనా. యాదగిరిగుట్ట, ఆలేరు, భువనగిరి, చౌటుప్పల్, ఆత్మకూర్‌(ఎం) వలిగొండ, రాజాపేట, తుర్కపల్లి, బొమ్మలరామారం, బీబీనగర్‌తో పాటు పలు ప్రాంతాల్లో అక్రమ వెంచర్లు సాగుతున్నాయి. ప్రధానంగా వంగపల్లి, సర్వేపల్లి, కాచారం, రఘునాథపురం, కొలనుపాక, యాదగిరిపల్లి, సైదాపురం, పెద్ద కందుకూరు శ్రీనివాసాపురం, పటేల్‌గూడెం, గుండ్లగూడెం ఆలేరులలో ఫామ్‌ ల్యాండ్‌ ప్లాట్లను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.  

ఇంటి నిర్మాణం కుదరదు..రుణం రాదు 
ఫామ్‌ ల్యాండ్‌ పేరుతో రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లలో ప్రధానంగా ఇంటి నిర్మాణాలకు అనుమతి లభించదు. డీటీసీపీ అనుమతి లేనందున బ్యాంకు రుణం రాదు. కొనుగోలుదారు ప్లాటు పొజిషన్‌కు స్థానిక సంస్థలు చట్టబద్ధతను సైతం ఇవ్వడం లేదు. 

70 ఎకరాల్లో అనధికార లేఅవుట్‌ 
యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) మండలం ధర్మపురం రెవెన్యూ శివారులో శ్రీసిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్‌.. రాయల్‌ గార్డెన్‌–2 ఫామ్‌ ల్యాండ్‌ పేరుతో సర్వే నంబర్లు 26 నుంచి 28 వరకు, అలాగే 30 నుంచి 38 వరకు, 42, 49ల్లోని సుమారు 70 ఎకరాలు అనధికారికంగా లేఅవుట్‌ చేశారు. డైరెక్టరేట్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ (డీటీసీపీ) నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు.

వ్యవసాయ భూమిని కేవలం వ్యవసాయేతర భూమిగా మార్చి (నాలా కన్వర్షన్‌), 60, 40, 30 ఫీట్ల రోడ్లు వేసి, విద్యుత్‌ స్తంభాలు నాటి గజం రూ.4,600 చొప్పున విక్రయిస్తున్నారు. నిబంధనలు అతిక్రమించి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ 300 గజాల ప్లాట్‌ (నం.806)ను మోత్కూర్‌ సబ్‌ రిజి్రస్టార్‌ కార్యాలయంలో (డాక్యుమెంట్‌ నంబర్‌ 4716/19) సర్వే నంబర్లు మొత్తం వేసి రిజిస్టర్‌ చేశారు. ఈ ఒక్క వెంచర్‌లోనే వివిధ విస్తీర్ణాల్లో 2 వేలకు పైగా ప్లాట్లు ఉన్నాయి.   

Advertisement
 
Advertisement
 
Advertisement