హైదరాబాద్.. నెంబర్ 2
హైదరాబాద్: గత మూడేళ్లుగా తెలంగాణలో నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, అన్ని రంగాల్లో పురోగతి సాధించామని, ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. శాసనమండలి అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరికీ అభినందనలు చెప్పారు. 2017-18 తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారు.
తెలంగాణ శాసనసభ, శాసనమండలిలో జరిగే చర్చలు అర్థవంతంగా, ప్రజల ఆకాంక్షల్ని నిలబెట్టుకునేలా ఉంటాయని ఆశిస్తున్నానని నరసింహన్ అన్నారు. సభలో జరిగే చర్చలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలని సూచించారు. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగతి సాధిస్తోందని చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. కొత్తగా 21 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నామని, దీని ద్వారా ప్రజల వద్దకు పాలన చేరడానికి మరింతగా ఉపయోగపడుతుందని చెప్పారు. జిల్లాల అభివృద్దికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. తక్కువ సమయంలోనే కరెంట్ కష్టాలను అధిగమించామని, పారిశ్రామిక రంగానికి డిమాండ్ మేరకు విద్యుత్‌ను అందిస్తున్నామని, వ్యవసాయానికి పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు. వచ్చే మూడేళ్లలో కొత్తగా 16,306 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు.
13.7 శాతం వృద్దిరేటుతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తోందని నరసింహన్ పేర్కొన్నారు. పరిశ్రమల ఏర్పాటుతో కొత్తగా 54 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. టీఎస్ ఐపాస్ విధానంతో పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు మంజూరు చేస్తున్నామని వెల్లడించారు. ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని, టీ హబ్ సెకండ్ ఫేజ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ చెప్పారు.
సంక్షేమ పథకాల అమలులో అగ్రస్థానంలో ఉన్నామని నరసింహన్ పేర్కొన్నారు. బీడీ కార్మికులకు రూ.1000 సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. పేద పిల్లల వివాహానికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ అమరవీరులకు 10 లక్షల రూపాయలు సాయం చేయడంతో పాటు కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తున్నామని నరసింహన్ చెప్పారు.
ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఇప్పటి వరకు 5900 ఉద్యోగాలను, విద్యుత్ శాఖలో 2681, సింగరేణిలో 4500, ఆర్టీసీలో 3950, పోలీసు శాఖలో 10,422 ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పారు. తెలంగాణలో ఇప్పటి వరకు మొత్తం 27,481 ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. మరో 12 వేల ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని చెప్పారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేస్తున్నామని నరసింహన్ తెలిపారు.
మిషన్ కాకతీయ ఫేజ్ 1, 2 కింద 17,278 చెరువుల పునరుద్ధరణ, కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపడుతున్నట్టు గవర్నర్ చెప్పారు. ఈ ఏడాది చివరికల్లా మిషన్ భగీరథతో ఇంటింటికి తాగునీరు అందిస్తామని తెలిపారు. కేజీ టు పీజీ ఉచిత విద్యలో భాగంగా రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఎస్సీ మహిళల కోసం కొత్తగా 30 రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని, మహిళల వేధింపుల నిరోధానికి షీ టీమ్స్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పోలీసులకు కొత్తగా 4 వేల వాహనాలను సమకూర్చినట్టు చెప్పారు. తెలంగాణలో అవినీతి రహిత పాలనను అందిస్తున్నామని, బంగారు తెలంగాణ నిర్మాణానికి అందరూ కృషి చేయాలన్నారు.