లా ప్రవేశ పరీక్షలు మళ్లీ ‘ఆఫ్‌లైన్‌’లోకి! | Why the Common Law Admission Test Is Going Offline | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 3 2018 2:10 PM | Last Updated on Sat, Nov 3 2018 4:09 PM

Why the Common Law Admission Test Is Going Offline - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశంలోని వివిధ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని లా కళాశాలల అడ్మిషన్ల కోసం వరుసగా గత నాలుగేళ్లుగా ‘ఆన్‌లైన్‌’లో  నిర్వహిస్తున్న ఉమ్మడి ప్రవేశ పరీక్షలు మళ్లీ ఆఫ్‌లైన్‌లోకి వెళతాయా? 2018 సంవత్సరానికి మే 13వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించిన లా ప్రవేశ పరీక్షల్లో చోటు చేసుకున్న సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ నివేదికను పరిశీలిస్తే అవుననే అనిపిస్తోంది. దేశంలోని 19 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల పరిధిలోని లా కళాశాలల్లో అడ్మిషన్లకోసం ఏటా ఆన్‌లైన్‌ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ప్రతి ఏటా ఓ యూనివర్శిటీ ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను తీసుకుంటున్నాయి. కేరళలోని కొచ్చీ న్యాయ విశ్వవిద్యాలయం ‘నేషనల్‌ యూనివర్శిటీ ఆఫ్‌ అడ్వాన్డ్స్‌ లా స్టడీస్‌’ ఈసారి ‘క్లాట్‌–18’ను నిర్వహించింది.

దేశవ్యాప్తంగా 258 కేంద్రాల్లో ఈ ఏడాది నిర్వహించిన లా ప్రవేశ పరీక్షలకు మొత్తం 54,465 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వారిలో దాదాపు మూడోవంతు అంటే, 19, 983 మంది అభ్యర్థులు సాంకేతిక సమస్యలను ఎదుర్కొన్నారు. కంప్యూటర్‌ స్క్రీన్‌ స్తంభించి పోవడం వల్ల లేదా ప్రశ్న స్క్రీన్‌ మీది నుంచి అదృశ్యం అవడం వల్ల అభ్యర్థులు ఒక్కసారికన్నా ఎక్కువ సార్లు లాగిన్‌ కావాల్సి వచ్చింది. ఫలితంగా వారి విలువైన సమయం వృధా అయింది. సాంకేతిక సమస్యలు ఎదుర్కొన్న వారిలో 612 మంది కనీసం ఐదుసార్లు, 14 మంది కనీసం పదిసార్లు, అంతకన్నా ఎక్కువ, మరో దురదృష్ట అభ్యర్తి ఏకంగా 19 సార్లు కంప్యూటర్‌కు లాగిన్‌ కావాల్సి వచ్చింది. తద్వారా వారంతా పది నిమిషాలు, అంతకన్నా ఎక్కువ సమయాన్ని కోల్పోవాల్సి వచ్చింది. దీనిపై పలువురు హైకోర్టులో, సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.

కమిటీ ఏర్పాటు
ఈ సాంకేతిక సమస్యలపై విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 27వ తేదీన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కాన్పూర్‌లోని ఐఐటీకి చెందిన మణింద్ర అగర్వాల్, ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థకు చెందిన అశోక్‌ కుమార్‌ జార్వల్, లక్నోలోని ఐఐఎంకు చెందిన నీరజ్‌ ద్వివేది, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ వినీత్‌ జోషిలతో ఈ కమిటీని వేశారు. ఈ సారి క్లాట్‌ పరీక్షను నిర్వహించిన కొచ్చీ లా యూనివర్శిటీకి పూర్తి సాంకేతిక సహకారాన్ని అందించిన ‘సైఫీ టెక్నాలజీ లిమిటెడ్‌’ కంపెనీని కూడా కమిటీ విచారించింది. స్థానికంగా ఇంటర్నెట్‌ సౌకర్యాన్ని అందించిన ప్రొవైడర్‌ వద్ద సరైన నెట్‌వర్క్‌ సామర్థ్యం లేకపోవడం వల్ల సాంకేతిక సమస్యలు ఉత్పన్నం కావచ్చని సైఫీ అనుమానం వ్యక్తం చేసింది. అసలు సమస్యేమిటో ఇంతకాలం కనుక్కోక పోవడం వల్ల కమిటీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

అధిక ఫీజు పట్ల కమిటీ దిగ్భ్రాంతి
కొచ్చి లా ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి మొత్తం 2.6 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. అభ్యర్థుల నుంచి పరీక్ష ఫీజు కింద వచ్చిన మొత్తం ఏకంగా 27.5 కోట్ల రూపాయలు. అభ్యర్థి నుంచి నాలుగు వేల రూపాయలను ఫీజు కింద వసూలు చేయడం పట్ల కమిటీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఫీజును 1500 రూపాయలుగా నిర్ధారించాలని సూచించింది. పరీక్ష ఫీజు కింద వచ్చిన మొత్తంలో సగాన్ని పరీక్ష నిర్వహించిన లా యూనివర్శిటీ తీసుకొని మిగతా సగాన్ని మిగతా అన్ని లా విశ్వవిద్యాలయాలన్నింటికి పంచాల్సి ఉంటుంది.

అనుభవ రాహిత్యమూ కారణమే
ప్రతి ఏటా ఓ న్యాయ విశ్వవిద్యాలయం ప్రవేశ పరీక్షలను నిర్వహించడం వల్ల ఆ యూనివర్శిటీ బిడ్డింగ్‌ పద్ధతిలో సాంకేతిక సంస్థను ఎంపిక చేస్తోంది. అలా ప్రతి యూనివర్శిటీ ప్రతి ఏటా ఒక్కో కొత్త సాంకేతిక సంస్థను ఎంపిక చేయడం వల్ల సాంకేతిక లోపాలు పునరావృతం అవుతున్నాయని కమిటీ అభిప్రాయపడింది. అందుకని సాంకేతిక సంస్థను కనీసం రెండేళ్లు పరీక్షల నిర్వహణకు కొనసాగించేలా, మరో ఏడాది పొడిగించుకునేలా ఉండాలని కమిటీ సిఫార్సు చేసింది. లేదా దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు నిపుణులతో కూడిన సాంకేతిక సంస్థను కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని, అప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో పరీక్షలను నిర్వహించడమే సమంజసమని కమిటీ అభిప్రాయపడింది. కమిటీ మంగళవారం నాడు సుప్రీం కోర్టుకు సమర్పించిన ఈ నివేదికను కోర్టు ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఆ తర్వాత సుప్రీం కోర్టు స్పందననుబట్టి కేంద్రం స్పందించాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement