ముంబై: మత పరమైన గ్రంధాల మీద కాకుండా అందరూ భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని శివసేన కోరింది. దీని ద్వారా దేశంలో ఉన్నటువంటి మతపరమైన అడ్డంకులను తొలగించినట్లు అవుతుందని శివసేన అధికార పత్రిక సామ్నాలో సోమవారం పేర్కొన్నారు. చట్టం ముందు అందరూ సమానులే కానీ రాజ్యాంగం అనేది అన్నింటి కంటే అత్యుత్తమమైనదని వ్యాఖ్యానించింది.
అన్నిమతాల వారికి భారత రాజ్యాంగమే పవిత్ర గ్రంథం కావాలని శివసేన అభిప్రాయపడింది. భారత రాజ్యాంగం ముందు అన్ని మతాల వారు సమానమేనని గతంలో బాల్ థాక్రే వెల్లడించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసిన శివసేన.. కోర్టుల్లో ప్రజలంతా మత గ్రంథాల పైన కాకుండా రాజ్యాంగంపైనే ప్రమాణం చేసేలా చర్యలు తీసుకోవాలని కొరింది. ఇటీవల పార్లమెంట్లో మోదీ మాట్లాడుతూ.. భారత రాజ్యాంగాన్ని పవిత్ర గ్రంథంగా పేర్కొంటూ దాన్ని మార్చడం అంటే ఆత్మహత్యకు పాల్పడటంతో సమానం అని ప్రకటించిన నేపథ్యంలో శివసేన ఈ కామెంట్స్ చేసింది.