పెళ్లి చేసుకుని.. పౌరసత్వం తెచ్చుకున్నారు
నేపాల్ నూతన రాజ్యంగం అమలైన నాటి నుంచి ఇప్పటివరకు 3,672 మంది భారతీయ స్త్రీలు నేపాలీ వ్యక్తులను వివాహం చేసుకున్నట్లు కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వీరందరికీ నేపాల్ పౌరులుగా సభ్యత్వం లభించినట్లు మంగళవారం తెలిపింది. రాజ్యాంగం అమలుకాక ముందు మాదేశీ ఆందోళనల వల్ల నేపాలీలను వివాహం చేసేకున్న భారతీయులకు ఆ దేశ పౌరసత్వం ఇవ్వడం పెద్ద సమస్యగా మారింది. దీంతో గతేడాది సెప్టెంబర్ 7న విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పార్లమెంట్లో నేపాలీ పౌరసత్వం కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న భారతీయ యువతులకు నూతన రాజ్యంగం వల్ల సాధ్యం కాకపోవచ్చని ఆమె అన్నారు.
దీనిపై స్పందించిన నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి బినోద్ కేసీ నేపాలీని వివాహం చేసుకున్న ప్రతి భారతీయ మహిళకు దేశ పౌరసత్వం లభిస్తుందని తెలిపారు. మాదేశీలు ఎక్కువగా ఉన్న 20 జిల్లాల్లోనే వీరి సంఖ్య ఎక్కువగా ఉందని వివరించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 11(6) ప్రకారం నేపాలీని వివాహం చేసుకున్న ఏ విదేశీ మహిళకైనా దేశ పౌరసత్వం స్వీకరించే హక్కు ఉందని ఆయన చెప్పారు. ప్రస్తుతం నేపాల్ పార్లమెంటులో 12 విదేశీయులు నేపాల్ పౌరసత్వాన్ని తీసుకున్నవారేనని అన్నారు. సరైన వివరాలు జతచేయకుండా నేపాల్ పౌరసత్వాన్ని స్వీకరించిన ముగ్గురు భారతీయుల పౌరసత్వాలను నేపాల్ రద్దు చేసింది.