21 పరుగులకే కూల్చేశారు..
బ్యాంకాక్: మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ అద్బుత విజయాన్ని సాధించింది. శుక్రవారం నేపాల్ తో జరిగిన తన చివరి లీగ్ మ్యాచ్ లో భారత్ 99 పరుగుల తేడాతో గెలుపొందింది. నేపాల్ను 21 పరుగులకే కూల్చేసిన భారత్ సంచలన విజయం సొంతం చేసుకుంది. ఇప్పటికే వరుస నాలుగు విజయాలతో ఫైనల్ కు చేరిన భారత్.. అదే జోరును నేటి నేపాల్తో మ్యాచ్లో కూడా కొనసాగించింది.
నేపాల్ స్కోరు బోర్డులో ఎక్సట్రా పరుగులకు వచ్చిన ఏడు పరుగులకే ఆ జట్టు అత్యధిక స్కోరు అంటే మన వాళ్లు ఏ రకంగా చెలరేగిపోయారు అర్ధం చేసుకోవచ్చు. ఆ తరువాత సరితా మాగర్(6)దే నేపాల్ జట్టులో అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం గమనార్హం. మొత్తం జట్టు సింగిల్ డిజిట్కే పరిమితం కావడంతో నేపాల్ కు ఘోర ఓటమి తప్పలేదు.పూనమ్ పాండే మూడు వికెట్లు తీయగా, మేఘనా, అనుజా పటేల్లు తలో రెండు వికెట్లు సాధించారు.శిఖా పాండే,జోషి,ఏక్తా బిస్త్లు ఒక్కో వికెట్ చొప్పున తీశారు.
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. వెల్లాస్వామి వనితా(21), అనుజ్ పటేల్(16), పార్వీన్(13), శిఖా పాండే(39 నాటౌట్),హర్మన్ ప్రీత్ కౌర్(14 నాటౌట్)లు భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకున్నారు. ఈ టోర్నీలో ఇది భారత్ కు ఐదో విజయం.