మహిళల ఆసియా కప్ 2024 ఎడిషన్‌లో టీమిండియా సెమీఫైనల్లోకి ఎంట్రీ ఇచ్చింది. నిన్న (జులై 23) పసికూన నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 82 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, ఫైనల్ ఫోర్‌కు అర్హత సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. ఓపెనర్లు షఫాలీ వర్మ (81), దయాలన్ హేమలత (47) రాణించగా.. ఆఖర్లో జెమీమా రోడ్రిగెజ్ (28 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడంది. నేపాల్ బౌలర్లలో సీతా రనా మగర్ 2 వికెట్లు పడగొట్టగా.. కబిత జోషి ఓ వికెట్ దక్కించుకుంది.
అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నేపాల్.. భారత బౌలర్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 96 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీప్తి శర్మ (4-0-13-3), రేణుకా సింగ్ (4-1-15-1), తనూజా కన్వర్ (4-1-12-0), అరుంధతి రెడ్డి (4-0-28-2), రాధా యాదవ్ (3-0-12-2) నేపాల్‌ను ముప్పుతిప్పలు నెట్టారు. నేపాల్ ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా 20 పరుగుల మార్కును దాటలేకపోయారు.
18 పరుగులు చేసిన సీతా టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఈ గెలుపుతో భారత్ గ్రూప్-ఏలో అగ్రస్థానంతో ముగించింది. నిన్ననే జరిగిన మరో మ్యాచ్‌లో పాకిస్తాన్ యూఏఈపై ఘన విజయం సాధించి, గ్రూప్-ఏ నుంచి సెమీస్‌కు అర్హత సాధించిన రెండో జట్టుగా నిలిచింది.
గ్రూప్-బి విషయానికొస్తే.. ఈ గ్రూప్‌లో ఏ జట్టు ఇప్పటివరకు అధికారికంగా సెమీస్‌కు క్వాలిఫై కాలేదు. రెండు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించిన శ్రీలంక గ్రూప్ టాపర్‌గా ఉండగా.. థాయ్‌లాండ్, బంగ్లాదేశ్, మలేసియా వరుస స్థానాల్లో ఉన్నాయి. ఈ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచే జట్టుతో భారత్ సెమీస్‌లో పోటీపడనుంది. పాక్.. గ్రూప్-బి టాపర్‌ను సెమీస్‌లో ఢీకొట్టనుంది. భారత్ సెమీఫైనల్ మ్యాచ్ జులై 26న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. పాకిస్తాన్ సెమీస్ మ్యాచ్ అదే రోజు రాత్రి 7 గంటలకు మొదలవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment