మనకు స్వాతంత్య్రం వచ్చేనాటికి ఇప్పుడున్న రాష్ట్రాలు లేవు. అప్పట్లో మద్రాస్, బెంగాల్, బాంబే ప్రెసిడెన్సీలు; బిహార్, ఒరిస్సా, పంజాబ్ వంటి ప్రావిన్స్‌లు; వందలాది సంస్థానాలు ఉండేవి. 1949 నవంబర్‌లో మన రాజ్యాంగం ఆమోదం పొందిన తర్వాత వీటి స్థానంలో పరిపాలక విభాగాలుగా ‘రాష్ట్రాలు’ ఉనికిలోకి వచ్చాయి. రాజ్యాంగంలోని మొత్తం 395 ఆర్టికల్స్‌లో ఎక్కడా ‘సమాఖ్య లేదా సమాఖ్య తత్వం’(ఫెడరల్ లేదా ఫెడరలిజం) ప్రస్తావనే లేదు. స్వాతంత్య్రం రాకముందు ఫెడరల్ సర్వీస్ కమిషన్, ఫెడరల్ కోర్టులు ఉండేవి. ఆ తర్వాత వాటి స్థానే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, సుప్రీంకోర్టులు వచ్చాయి. 1935 చట్టం ఒక విధమైన సమాఖ్య విధానాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని పూర్తిగా సమాఖ్య అనలేం.
రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం... పార్లమెంట్ చట్టం చేయడం ద్వారా రాష్ట్రాలను విభజించడం కానీ, కలపడం కానీ, వాటి సరిహద్దులను మార్చడం కానీ చేయవచ్చు. ఉత్తరాఖండ్, తెలంగాణ వంటి రాష్ట్రాల ఏర్పాటు ఇందుకు మంచి ఉదాహరణ. అదేవిధంగా జమ్మూ కశ్మీర్‌ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడమూ తెలిసిందే. సమాఖ్య రాజ్యంలో రాష్ట్రాలకు ప్రత్యేక అధికారాలు ఉంటాయి.
ఉదాహరణకు అమెరికాలో ప్రతి రాష్ట్రానికీ ప్రత్యేక రాజ్యాంగం ఉంది. ఎన్నికలు నిర్వహించడానికి ప్రత్యేక సంస్థ ఉంటుంది. అలాగే గవర్నర్లను ప్రజలే ఎన్నుకుంటారు. కానీ భారత్‌లో అలా కాదు. దీన్నిబట్టి మనది సమాఖ్య కాదు. బలమైన కేంద్రం ఉన్న యూనియన్ అని చెప్పవచ్చు. ఇటువంటి యూనియన్ ఉండాలనే అంబేడ్కర్, పటేల్ లాంటివారు వాంఛించారు. బలమైన కేంద్రం లేకపోతే రాష్ట్రాలు విడిపోయి దేశం ముక్కలవుతుందని వారు భావించారు. (క్లిక్: సమానతా భారత్ సాకారమయ్యేనా?)
అందుకే రాజ్యాంగంలోని 356, 360, 362 ఆర్టికల్స్ రాష్ట్రాలపై కేంద్రానికి ఆధిపత్యాన్ని కట్ట బెట్టాయి. రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించగలగడం ఈ ఆధిపత్యాన్నే సూచిస్తుంది. 6 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో వంద పర్యాయాలకు పైగా రాష్టపతి పాలన విధించడం తెలిసిందే. రాజ్యాంగం... కేంద్ర అధికారాలు, రాష్ట్ర అధికారాలు, ఉమ్మడి అధికారాలు అని పేర్కొంటున్నది. ఉమ్మడి జాబితాలో ఉన్న అధికారాలను ఉపయోగించి కేంద్రం, రాష్ట్రాలు... రెండూ విడివిడిగా చట్టం చేస్తే అంతిమంగా కేంద్ర చట్టానిదే పైచేయి అవుతుందని రాజ్యాంగం పేర్కొంటున్నది. పైన పేర్కొన్న అనేక నిబంధనలు మనది సమాఖ్య రాజ్యం కాదనీ, యూనియన్ అనీ స్పష్టం చేస్తున్నాయి. (క్లిక్: 75 ఏళ్లుగా ఉరుకుతున్నా... ఉన్నకాడే!)
- డాక్టర్ త్రిపురనేని హనుమాన్ చౌదరి
ప్రజ్ఞాభారతి చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment