న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం మధ్య లొల్లి మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. ఢిల్లీలోని ప్రభుత్వాధికారులపై అజమాయిషీ రాష్ట్ర ప్రభుత్వానిదేనంటూ మే 11న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించడం తెలిసిందే. ఆ వెంటనే పలువురు కీలక అధికారులను బదిలీ చేస్తూ కేజ్రీవాల్ సర్కారు నిర్ణయం తీసుకున్నా అవి అమలు కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడ్డారు. ప్రభుత్వానికి గొడవ నడుస్తుండగానే సుప్రీం తీర్పును పూర్వపక్షం చేసేలా కేంద్రం శుక్రవారం ఆర్డినెన్స్ జారీ చేయడం తెలిసిందే.
దాని ద్వారా ఢిల్లీ పరిధిలోని ఐఏఎస్, గ్రూప్ ఏ అధికారుల పోస్టింగ్, బదిలీ, క్రమశిక్షణ చర్యలు తదితరాలపై నిర్ణయాలకు జాతీయ రాజధాని సివిల్ సర్వీస్ అథారిటీని ఏర్పాటు చేసింది. అంతేగాక అధికారులపై నిర్ణయాధికారాలను రాష్ట్ర ప్రభుత్వానికే కట్టబెడుతూ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ సుప్రీంకోర్టులో శనివారం కేంద్రం రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేసింది. దేశ రాజధానిలోని ప్రభుత్వ పనితీరు మొత్తం దేశాన్నే ప్రభావితం చేస్తుందని అందులో వాదించింది. మరోవైపు ఆర్డినెన్స్‌పై కేజ్రీవాల్ మండిపడ్డారు.
మే 18 నుంచి సుప్రీంకోర్టుకు వేసవి సెలవులున్న సందర్భాన్ని చూసుకుని తెలివిగా ఈ చర్యకు దిగిందన్నారు. రాష్ట్ర అధికారాలకు దొడ్డిదారిన గండి కొట్టిన ఈ రాజ్యాంగ విరుద్ధ నిర్ణయంపై తాము కూడా సుప్రీం తలుపు తడతామని స్పష్టం చేశారు. ఆర్డినెన్స్ రాజ్యసభ ఆమోదం పొందకుండా చూడాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై విపక్ష నేతలందరినీ కలుస్తానని ప్రకటించారు. అంతేగాక ఢిల్లీలో ఇంటింటికీ వెళ్లి కేంద్రం అప్రజాస్వామిక తీరుపై ప్రజలను చైతన్యవంతం చేస్తానన్నారు. ఈ ఆరోపణలను బీజేపీ తోసిపుచ్చింది. అధికారులను కేజ్రీవాల్ సర్కారు వేధిస్తున్నందున ప్రజా ప్రయోజనార్థమే ఆర్డినెన్స్ తెచ్చినట్టు పార్టీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా చెప్పుకొచ్చారు. దమ్ముంటే ఆర్డినెన్స్‌పై సుప్రీంకు వెళ్లి చూడాలని బీజేపీ నేత రవిశంకర్ ప్రసాద్ సవాలు చేవారు. ఢిల్లీ పాలనాధికారాలు తదితరాలపై ఆప్ ప్రభుత్వానికి, కేంద్రానికి ఎనిమిదేళ్లుగా గొడవలు జరుగుతుండటం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment