రాజ్యాంగాన్ని కాలరాస్తున్న కేసీఆర్
టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో పెట్టకుండా చీకట్లో పెడుతూ రాజ్యాంగాన్ని సీఎం కేసీఆర్ కాలరాస్తున్నారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. పార్టీ నేతలు మహేశ్‌కుమార్ గౌడ్, గోసుల శ్రీనివాస్‌తో కలసి గాంధీభవన్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ పాలనలో, తీసుకుంటున్న నిర్ణయాలలో పారదర్శకత లేకుండా చేస్తున్నారని అన్నారు. సమాచారహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉత్తర్వులను వెబ్‌సైట్‌లో పెడుతున్నారనీ, అలాంటిది ఆ వెబ్‌సైట్‌ను బ్లాక్ చేయడం వెనుక భారీ కుట్ర, రహస్య ఎజెండా దాగి ఉందని శ్రవణ్ అనుమానం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధిక్కరిస్తుంటే దాని పరిరక్షకుడైన గవర్నరు పట్టించుకోవడం లేదని విమర్శించారు. మేడారం జాతరలో సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరిపై దాడి పోలీసుల దాష్టీకానికి పరాకాష్ట అని ఈ సందర్భంగా శ్రవణ్ విమర్శించారు.