సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డైరెక్షన్‌లోనే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఫెడరల్ ఫ్రంట్ నాటకానికి తెరలేపారని పీసీసీ ముఖ్యఅధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. తన అస మర్థ, అవినీతి, నియంత పాలనతో రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసి ఫెడరల్ ఫ్రంట్ పేరుతో ప్రజలను భ్రాంతికి గురి చేసి వచ్చే ఎన్నికల్లో ఓట్లు దండుకునేందుకు కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు.
ఈ మేరకు శుక్రవారం దాసోజు పలువురు జాతీయ స్థాయి నేతలకు లేఖలు రాశారు. ఫ్రంట్ పేరుతో కేసీఆర్ మోసం చేస్తున్నారంటూ తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, జేడీఎస్ అధ్యక్షుడు దేవెగౌడ, డీఎంకే నేత స్టాలిన్, బీఎస్పీ అధినేత్రి మాయావతి, యూపీ మాజీ సీఎం అఖిలేశ్‌యాదవ్‌లకు వేర్వేరుగా లేఖలు పంపారు. బీజేపీ వ్యతిరేక వర్గాలను వంచించి, విభజించి తద్వారా కాంగ్రెస్‌కు నష్టం కలిగించడం ద్వారా మోదీని తిరిగి గద్దెనెక్కించేందుకు కేసీఆర్ యత్నిస్తున్నారని పేర్కొన్నారు.
గతంలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అడగకముందే బీజేపీ అభ్యర్థులకు కేసీఆర్ మద్దతు తెలిపారని, నోట్లరద్దును స్వాగతించారని, కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాసం పెడితే అది చర్చకు రాకుండా పార్లమెంట్‌ను అడ్డుకున్నారని వివరించారు. పార్టీ ఫిరాయింపులు, అవినీతితో కేసీఆర్ అణచివేత పాలన సాగిస్తున్నారని, అటువంటి కేసీఆర్ మాటలను విశ్వసించి ఫెడరల్ ఫ్రంట్‌కు మద్దతిస్తే దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment