సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని పోలీసులు అపద్దర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాబేదార్లుగా మారారని టీపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసులు రాజ్యాంగానికి కాకుండా టీఆర్‌ఎస్‌కు రక్షణ ఉంటున్నారని ఆరోపించారు. గులాబీ పార్టీకి పోలీసులు గులాములుగా మారారని తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇంటెలిజెన్స్ విభాగం టీఆర్‌ఎస్ సర్వేలు చేయడానికే పరిమితమైందని అన్నారు. పోలీసులు కాంగ్రెస్ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు.తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల్లో పోలీసులను ఏజెంట్లుగా పెట్టుకుని కేసీఆర్ గెలవాలని చూస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు తీరు చూస్తుంటే తెలంగాణలో ఎన్నికలు నిష్పాక్షికంగా జరిగే పరిస్థితి కనిపించడం లేదని అన్నారు. తక్షణమే ఎన్నికల కమిషన్ పోలీసులను తమ పరిధిలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ సోదాలు జరపడంపై శ్రవణ్ స్పందించారు. రేవంత్ బలమైన నాయకుడని.. టీఆర్‌ఎస్ అతన్ని భయపెట్టడం ద్వారా కాంగ్రెస్ క్యాడర్‌ను భయపెట్టాలని చూస్తోందని విమర్శించారు. టీఆర్‌ఎస్, బీజేపీలు కుమ్మకై రేవంత్‌ను కేసులతో వేధిస్తున్నాయని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment