సాక్షి, న్యూఢిల్లీ : పోలింగ్ సమయం సమీపిస్తున్న కొద్ది నాయకులు ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు చేసే నేపంతో కొందరు ‘మగా’నుభావులు మహిళా నాయకుల గురించి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. దాదాపు అన్ని పార్టీల్లోను ఇలాంటి ‘ఉత్తమ’ నేతలున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మిత్రపక్షమైన పీపుల్స్ రిపబ్లికన్ పార్టీ (పీఆర్‌పీ) నాయకుడొకరు స్మృతి ఇరానీ గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
పీఆర్‌పీకి చెందిన జయదీప్ కవాడే స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ... ‘ఆమె తన నుదురుపై చాలా పెద్ద బిందీని(బొట్టు) ధరిస్తారు. ఇలాంటి వారి గురించి కొందరు నాతో ఏం చెప్పారంటే.. భర్తల్ని మారుస్తున్న కొద్ది మహిళ పెట్టుకునే బిందీ సైజు కూడా పెరుగుతుందట. స్మృతి ఇరానీ పార్లమెంట్‌లో నితిన్ గడ్కరీ పక్కన కూర్చుని రాజ్యాంగాన్ని మార్చే విషయం గురించి చర్చిస్తుంది. కానీ ఆమె ఓ విషయం తెలుసుకోవాలి.. మీరు భర్తల్ని మార్చినంత ఇజీగా రాజ్యాంగాన్ని మార్చలేము’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
గతంలో ఓ బీజేపీ ఎమ్మెల్యే బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని ఉద్దేశిస్తూ.. ఆమె ఫెషియల్ చెయించుకుంటుంది.. జుట్టుకు రంగు వేసుకుంటుంది. అలాంటి ఆమె మోదీ గురించి కామెంట్ చేయడం హాస్యాస్పదం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే నాయకుడు యూపీ డ్యాన్సర్, సింగర్ సప్నా చౌదరి కాంగ్రెస్‌లో చేరినప్పుడు.. గాంధీ కుటుంబం ఆమెకు చాలా చక్కగా సూట్ అవుతుంది. ఎందుకంటే సోనియా గాంధీ కూడా సప్నా చౌదరిలానే డ్యాన్సర్ కదా అంటూ కామెంట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment