రాజ్యాంగాన్ని మేం రక్షిస్తుంటే వాళ్లు కూలదోసే కుట్రకు తెగించారు
బీజేపీ కూటమిపై రాహుల్ గాంధీ నిప్పులు
అలీరాజ్‌పూర్/ఖర్‌గోన్: బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 150 స్థానాలను కూడా గెల్చుకోదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకే కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో పోరాడుతుంటే కమలంపార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు రాజ్యాంగాన్ని మార్చేందుకు కంకణం కట్టుకున్నాయని రాహుల్ ఆరోపించారు. సోమవారం మధ్యప్రదేశ్‌లోని అలీరాజ్‌పూర్ జిల్లాలోని జోబాట్, సేగోన్ పట్టణాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారంచేశారు. రాత్లాం–ఝబువా, ఖర్‌గోన్ లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగించారు.
హక్కుల్ని లాగేద్దామని మోదీ ఆశపడుతున్నారు
‘‘కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరాక ప్రజా ప్రయోజనాల కోసం 50 రిజర్వేషన్ల పరిమితిని ఎత్తేస్తుంది. కులగణన అనేది ప్రజల జీవన స్థితిగతులపై వాస్తవ గణాంకాలను అందిస్తుంది, దీంతో దేశంలో రాజకీయ గతే మారిపోతుంది. రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నేతలు ఇప్పటికే ప్రకటించేశారు. ఈసారి 400 ఖాయం అని బడాయిలుపోతున్నారుగానీ కనీసం వారికి 150 సీట్లుకూడా రావు. రాజ్యాంగాన్ని పరిరక్షించేది విపక్షాల ‘ఇండియా’ కూటమి మాత్రమే. రాజ్యాంగంలో ఉంది కాబట్టే గిరిజనులు, దళితులు, ఓబీసీలు లబ్ధిపొందగల్గుతున్నారు. జలం, జమీన్(భూమి), జంగల్(అడవి)పై గిరిజనులకు హక్కులున్నాయి. ప్రజల హక్కులను లాగేసుకోవాలని ప్రధాని మోదీ ఆశపడుతున్నారు. ఆ ఆశలు నెరవేరకుండా మేం అడ్డుకుంటాం’’ అని రాహుల్ అన్నారు.
మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే
‘‘వాళ్లు ఇప్పుడున్న రిజర్వేషన్లను లాక్కోవడం సంగతి పక్కనబెట్టండి. మేం ఆ రిజర్వేషన్లను 50 శాతం దాటేలా చేస్తాం. కోర్టులు రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం దగ్గరే నిలిపేశాయి. భూమి, అడవికి తొలి యజమానులైన మిమ్మల్ని ఆదివాసీలుగా మేం గుర్తిస్తున్నాం. బీజేపీ వాళ్లు మిమ్మల్ని వనవాసీలంటున్నారు. మీ హక్కుల పరిరక్షణ కోసమే అటవీ హక్కుల చట్టం, పేసా చట్టాలు అమల్లో ఉన్నాయి. మీ అందరికీ చేకూరిన లబ్దిని మీకు దూరం చేయాలని వారు కుట్ర పన్నారు. విపక్షాల కూటమికి ఓటేసి అధికారం కట్టబెడితే కులగణన చేసి గిరిజనులు, దళితులు, ఓబీసీలు, జనరల్ కేటగిరీ పేదల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తాం. మేం చేయబోయే విప్లవాత్మకమైన పని ఇదే. ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తామని మోదీ అబద్ధాలు చెప్పారు. మేం కోట్లాది మంది పేదలను లఖ్‌పతిలుగా మారుస్తాం’’ అని చెప్పారు.
పాతికమందికే అన్ని ఇచ్చే కుట్ర
‘‘రాజ్యాంగం, రిజర్వేషన్లు, గిరిజనుల అటవీభూములు, ప్రభుత్వరంగాన్ని కాపాడేందుకు మేం కష్టపడుతుంటే వీటిపై సర్వాధికారాన్ని అదానీ సహా ఓ పాతికమంది కుబేరులకు ధారాదత్తం చేద్దామని మోదీ ఆశపడుతున్నారు. మేం ఆ పని జరగనివ్వం’’ అని ప్రకటించారు.
ఉపాధి కూలీ వేతనం రూ.400కు పెంచుతాం
‘‘మహాలక్ష్మీ యోజన ద్వారా పేద మహిళల ఖాతాలో ఏటా రూ.1 లక్ష జమచేసి పేదరికం నుంచి బయటపడేస్తాం. పథకంలో భాగంగా మహిళకు నెలకు రూ.8,500 అందుతాయి. మేం గెలిస్తే రైతుల పంటలకు కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పిస్తాం. అందుకోసం చట్టం తెస్తాం. మా ప్రభుత్వం ఏర్పడ్డాక వీలైనంత త్వరగా రైతుల రుణాలను మాఫీచేస్తాం. గత 45 ఏళ్ల గరిష్ట స్థాయికి నిరుద్యోగిత పెరిగింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారీ వేతనంను రూ.250 నుంచి రూ.400కు పెంచుతాం. పెహ్లీ నౌకరీ పక్కా పథకం కింద యువతకు కంపెనీల్లో అప్రెంటిస్‌షిప్ కింద ఏటా రూ.1లక్ష జమచేస్తాం. తర్వాత ఉద్యోగాలిస్తాం’’ అని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment