యోగి ఆదిత్యనాథ్ (ఫైల్)
లక్నో: బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఉత్తరప్రదేశ్‌లోని ఏ నియోజకవర్గం నుంచైనా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నిటినీ అమలు చేశానన్నారు. సీఎంగా అన్ని బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాననీ, ఈ విషయంలో లేశమాత్రమైనా పశ్చాత్తాపం లేదని వ్యాఖ్యానించారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.
మథురలో కృష్ణ మందిరం నిర్మిస్తామని ఎన్నికల వేళ బీజేపీ కొత్త నివాదం అందుకోవడం, మథుర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని యోగిని స్థానిక ఎంపీ జయప్రద ఆహ్వానించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో అయోధ్య, మథుర, లేదా సొంత జిల్లా గోరఖ్‌పూర్‌లలో ఎక్కడి నుంచి పోటీ చేస్తారని విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన స్పందిస్తూ పైవిధంగా సమాధానమిచ్చారు. ప్రస్తుతం యోగి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
యూపీ సీఎంగా కొనసాగిన వారిలో ములాయం సింగ్ ఆఖరిసారిగా 2003లో అసెంబ్లీకి పోటీ చేశారు. ఆయన తర్వాతి సీఎంలు మాయావతి, అఖిలేశ్, యోగి ఎమ్మెల్సీలుగా కొనసాగడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో తను పోటీ చేసే అవకాశాల్లేవని ఇటీవల ప్రకటించిన మాజీ సీఎం అఖిలేశ్..ఆ విషయం పార్టీయే నిర్ణయిస్తుందంటూ ఆ తర్వాత మాటమార్చారు. కాశీ, అయోధ్యల్లో మాదిరిగా మథుర పుణ్యక్షేత్రంలో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని యోగి అన్నారు.
ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ అడిగిన ప్రశ్నకు ఆయన..‘ఒవైసీ ఒవైసీయే. ఆయన నోటి నుంచి రామకథ వినాలని మీరు ఆశిస్తున్నారా?’ అని వ్యంగ్యంగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment