
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా? అన్న అంశంపై జరుగుతున్న విచారణను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేసే ప్రసక్తే లేదని వచ్చే నెల 31న పదవీ విరమణ చేయనున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేశ్‌కుమార్ స్పష్టం చేశారు. రోజూవారీ పద్ధతిలో విచారణ జరుపుతామని ప్రకటించారు.
ఈ కేసులో వాయిదాలు ఇచ్చే ప్రసక్తే లేదన్నారు. విచారణను రెండు రోజుల పాటు వాయిదా వేయాలన్న పోలీసుల తరఫు స్పెషల్ కౌన్సిల్ సత్యనారాయణప్రసాద్ అభ్యర్థనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఏదేమైనా విచారణను వాయిదా వేయడం సాధ్యం కాదంటూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేశారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.