రాయ్‌పూర్: దేశంలో ప్రస్తుతం ఉన్న భయానక వాతావరణం నియంతృత్వ పాకిస్తాన్‌ను తలపిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశ రాజ్యాంగంపై దాడి జరుగుతోందనీ, న్యాయ వ్యవస్థ, మీడియా బెదిరింపులకు, అణచివేతకు గురవుతున్నాయని ఆరోపించారు. చివరికి బీజేపీ పార్లమెంట్ సభ్యులు కూడా ప్రధాని మోదీ ఎదుట నోరు విప్పేందుకు భయపడుతున్నారని విమర్శించారు. ఎన్నడూ లేని విధంగా సుప్రీంకోర్టు జడ్జీలు నలుగురు మీడియా ముందుకు వచ్చి ప్రజల మద్దతు కోరారనీ, తమను అణచివేస్తున్నారనీ, విధులను అడ్డుకుంటున్నారని ఆరోపించారని తెలిపారు.
ఇలాంటి ఘటనలు నియంతృత్వ పాలన కింద ఉండే పాకిస్తాన్, కొన్ని ఆఫ్రికా దేశాల్లో మాత్రమే సాధ్యమన్నారు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీల బారి నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవటానికి ప్రజలంతా ఒక్కటై పోరాడాలని పిలుపునిచ్చారు. కర్ణాటక సీఎంగా యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయటంపై ఆయన.. ఒక్కో జేడీఎస్ ఎమ్మెల్యేకు రూ.100 కోట్లు ఇవ్వజూపుతున్నారన్న కుమారస్వామి ఆరోపణలను ప్రస్తావించారు. స్థానిక సంస్థలకు స్వయం పాలనకు ఉద్దేశించిన రాజ్యాంగం లోని 73, 74వ సవరణలకు 25 ఏళ్లు నిండిన సందర్భంగా ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో జరిగిన ‘జన్ స్వరాజ్ సమ్మేళన్’లో ఆయన మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment