
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు కామెంట్ పెట్టిన అరెస్ట్ చేసే కుట్ర జరుగుతోందని టీజేఏసీ చైర్మన్ కోదండరాం ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా టీజేఏసీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆయన ఎగుర వేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... పరుష పదజాలం అంటే కొలమానం ఏమిటని ప్రశ్నించారు. రాజకీయ కక్షతో చేసే ఇలాంటి చర్యలను తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. మందకృష్ణ మాదిగ, ఒంటేరు ప్రతాప్‌రెడ్డి, అద్దంకి దయాకర్‌పై రాజకీయ కక్షతో కేసులు పెట్టారని తెలిపారు. ఐపీసీలోని 506, 507 సెక్షన్లను దుర్వినియోగం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
పరుష పదజాలంతో దూషించడాన్ని కోర్టు అనుమతి లేకుండా విచారించదగిన నేరంగా పరిగణిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగంను అమల్లోకి తెచ్చిన రోజున ఇలాంటి చట్ట సవరణలు తేవడాన్ని ఆయన వ్యతిరేకించారు. మనుషుల అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని రాజ్యాంగం చెబుతోందని గుర్తు చేశారు. రాజ్యాంగంలో లోపం లేదని, పాలకుల్లో ఉందని.. అందుకే మారుస్తాం అన్న ప్రతిసారి ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందని వివరించారు.
రాజకీయాల్లో ఉండాల్సిన అవసరంపై చర్చిస్తున్నామని తెలిపారు. రాజకీయాలు మారకుండా తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరవని అభిప్రాయపడ్డారు. ఫిబ్రవరి నెలలో పార్టీ ఏర్పాటుపై ప్రకటన చేయనున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment