సాక్షి, న్యూఢిల్లీ : భారత రాజ్యాంగాన్ని బీజేపీ ప్రభుత్వం సవరించాలనుకుంటోందని కేంద్ర మంత్రి అనంత్ కుమార్ హెగ్డే వ్యాఖ్యానించడం ద్వారా కొత్త వివాదాన్ని రేపారు. ముఖ్యంగా రాజ్యాంగం పీఠికలోని ‘సెక్యులర్’ పదం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాజ్యాంగాన్ని ఎన్నో సార్లు మార్చినందున మరోసారి మార్చడం తప్పుకాదని కూడా వాదించారు. ఆయన వాదనను కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో తూర్పార పట్టడంతో ఎందుకొచ్చిన గొడవ అనుకున్నారో, ఏమో హెగ్డే వెనక్కి తగ్గి క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. (సాక్షి ప్రత్యేకం)
భారత రాజ్యాంగ పరిషత్తు మూడేళ్లు శ్రమపడి భారత రాజ్యాంగాన్ని రూపొందించినప్పటికీ దీనికి పరిమితులున్నాయని, కాలమాన పరిస్థితులనుబట్టి ప్రజల మనోభావాలకు అనుగుణంగా దీన్ని ఎప్పటికప్పుడు మార్చుకోవచ్చని భారత రాజ్యాంగ కమిటీ చైర్మన్ బీఆర్ అంబేడ్కర్ స్వయంగా సూచించారు. అయితే ఆయన రాజ్యాంగం మౌలిక స్వరూపం మారకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కనుకనే రాజ్యాంగానికి కేంద్ర ప్రభుత్వాలు పలు సవరణలు చేస్తూ వచ్చాయి. రాజ్యాంగాన్ని ఆమోదించినప్పటి నుంచి ఇప్పటివరకు వందకుపైగా సవరణలు చోటుచేసుకున్నాయి.(సాక్షి ప్రత్యేకం) అందులో ముఖ్యమైనదే 42వ సవరణ. రాజ్యాంగం పీఠికలో సెక్యులర్, సోషలిస్ట్ అనే పదాలను చేరుస్తూ నాటి ఇందిరాగాంధీ ప్రభుత్వం 1976లో 42వ రాజ్యాంగ సవరణను తీసుకొచ్చింది. అదే సవరణ కింద కొన్ని రాజ్యాంగ అధికరణల్లో, సెక్షన్లలో మార్పులు, చేర్పులు కూడా చేసింది. ఎమర్జెన్సీ కాలంలో ఈ సవరణను తీసుకరావడం వల్ల దాన్ని ‘ఇందిరా రాజ్యాంగం’ అంటూ ప్రతిపక్షం విమర్శించింది.
పౌరుల ప్రాథమిక హక్కులను మార్చే అధికారం పార్లమెంట్కు లేదంటూ 1973లో సుప్రీం కోర్టు స్పష్టం చేసినప్పటికీ ఇందిర ప్రభుత్వం 42వ సవరణ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కుల్లో కూడా సవరణలు తీసుకొచ్చింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం పౌరుల ప్రాథమిక హక్కులను పునరుద్ధరిస్తూ 43, 44వ సవరణలు తీసుకొచ్చింది. (సాక్షి ప్రత్యేకం)అయితే రాజ్యాంగం పీఠికలో పేర్కొన్న ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలు ‘ఎక్స్ప్రెస్ట్ ఎక్స్ప్లిసిటి వాట్ వాజ్ ఇంప్లిసిట్ (అంతర్లీన భావాన్ని ఎలాంటి సందేహం లేకుండా సుస్పష్టం చేయడం) అనే సుప్రీం కోర్టు వ్యాఖ్యానికి తగ్గట్టుగా ఉండడంతో ఆ రెండు పదాలను మాత్రం జనతా పార్టీ ప్రభుత్వం ఎత్తివేయలేదు. భారత రాజ్యాంగమే సెక్యులర్, సోషలిస్ట్ అని భావించడం వల్ల ఆ పదాల జోలికి ఆ ప్రభుత్వం వెల్లలేదు.
భారత రాజ్యాంగాన్ని అంబేడ్కర్ పార్లమెంట్కు సమర్పించినప్పుడు కూడా చాలా మంది నాయకులు సెక్యులర్ అనే పదాన్ని జోడించాల్సిందిగా సూచించారు. కొంత మంది డిమాండ్ కూడా చేశారు. పౌరల ప్రాథమిక హక్కుల స్వరూపమే లౌకికంగా ఉన్నప్పుడు, ఆ హక్కులను మార్చే అధికారం పార్లమెంట్కు లేనప్పుడు ఆ పదాన్ని ఉపయోగిస్తే ఎంత, ఉపయోగించకపోతే ఎంత! అని అంబేడ్కర్ ప్రశ్నించారు. భవిష్యత్ తరాలు మనకంటే బాగుండాలి కనుక, వారి వారి కాలమాన పరిస్థితులనుబట్టి రాజ్యాంగాన్ని మార్చుకునే అవకాశం ఉండాలని, వారికి సెక్యులర్, సోషలిస్ట్ పదాలు అడ్డంకి కాకూడదని, వాటికంటే మంచి సిద్ధాంతాలే మున్ముందు రావచ్చని అంబేడ్కర్ స్పష్టం చేశారు.
ఈ అన్ని అంశాలను దష్టిలో పెట్టుకొని రాజ్యాంగాన్ని పరిశీలించిన భారత సుప్రీం కోర్టు 1980వ దశకంలో పౌరుల ప్రాథమిక హక్కులకు భంగంగా ఉన్న 42 రాజ్యాంగ సవరణలోని మరిన్ని అంశాలను నిర్ద్వంద్వంగా కొట్టివేసింది. పౌరులను హక్కును మార్చే అధికారం పార్లమెంట్కు లేదని తెలిపింది.(సాక్షి ప్రత్యేకం) ‘ఎస్ఆర్ బొమ్మై, కేంద్ర ప్రభుత్వం’ మధ్య తలెత్తిన ఇలాంటి ఓ వివాదంలో 1994లో సుప్రీం కోర్టు తీర్పు చెబుతూ ‘భారత రాజ్యాంగం మౌలిక స్వరూపమే లౌకికతత్వమనడంలో ఎలాంటి సందేహం లేదు’ అని రూలింగ్ ఇచ్చింది.
నాడు రాజ్యాంగం పీఠికలో ఇందిర ప్రభుత్వం ‘సెక్యులర్, సోషలిస్ట్’ పదాలను ఎలా చేర్చిందో, అలాగే సంపూర్ణ మెజారిటీ కలిగిన బీజేపీ ప్రభుత్వం అదే పద్ధతిలో, అంటే రాజ్యాంగ సవరణ ద్వారా ఆ పదాలను ఎత్తివేసినంత మాత్రాన భారత రాజ్యాంగం లౌకిక స్వరూపం మారదు. అలాంటప్పుడు ఎందుకీ గొడవ ? భారత పౌరల ప్రాథమిక హక్కుల్లో మార్పు రాదు. తమ కిష్టమైన మతాన్ని ఎంచుకునే ప్రాథమిక హక్కు భారతీయులకుందికనుక మన రాజ్యాంగంలో హిందూ, ముస్లిం, మైనారిటీ పదాలను తీసుకరావడం, తద్వారా ప్రజల్లో చిచ్చు తీసుకరావడం సాధ్యం కాదు.(సాక్షి ప్రత్యేకం)
Comments
Please login to add a commentAdd a comment