ఆచరణే అసలు నివాళి | practice is the real condolence, mallepally laxmaiah writes on implementation of constitution | Sakshi
Sakshi News home page

ఆచరణే అసలు నివాళి

Published Thu, Dec 3 2015 2:31 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

ఆచరణే అసలు నివాళి

ఆచరణే అసలు నివాళి

కొత్త కోణం

 

చరిత్రాత్మకమైన కుల నిర్మూలన పుస్తకంలో ఒక నిర్దిష్ట కార్యాచరణని ఆయన ప్రకటించారు. మార్పును కోరుకునే వారు ఈ ప్రతిపాదనల గురించి ఆలోచించాలి. ప్రధాని మోదీ ‘ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్’ నినాదం నిజం కావాలని నిజంగా కోరుకుంటే అంబేడ్కర్ ప్రతిపాదించిన అంశాలు ప్రాతిపదికగా నిలవాలి. కానీ తాను ప్రకటించిన విషయాలను అంగీకరించాలని, వీటినే అమలు చేయాలని అంబేడ్కర్ ఫర్మానా జారీ చేయలేదు. మనుషులంతా ఒక్కటే అనే భావనను నమ్మితే వీటి గురించి ఆలోచించక తప్పదు.

 

భారత అత్యున్నత చట్టసభల్లోను, కోటాను కోట్ల దేశ ప్రజల చెవుల్లోనూ ఇప్పుడు మారుమోగుతున్న పదాలు-రాజ్యాంగం, అంబేడ్కర్. గత నాలుగు రోజులుగా దేశాన్ని కుదిపేస్తున్న ఈ రెండు పదాల్లోనూ శతాబ్దాల దళితుల అంతర్మథనం, ఆత్మఘోష నిండి ఉన్నాయి. అంతులేని వివక్షాపూరిత రక్తసిక్త గాథలున్నాయి. అంబేడ్కర్ ఆలోచనల్లో నుంచి రూపుదిద్దుకున్న భారత రాజ్యాంగం స్వతంత్ర భారతంలో సక్రమంగా అమలు జరుగుతుందనీ, శతా బ్దాల అణచివేత, వెట్టిచాకిరీల నుంచి తమకు విముక్తి లభిస్తుందనీ తాడిత, పీడిత జనం ఎదురుచూస్తూనే ఉన్నారు.

 

తమ తాతలు, ముత్తాతలు, ముత్తాత తాతలకు ఈ సమాజంలో జరిగిన ఆర్థిక, సామాజిక వివక్షకు ప్రాయశ్చిత్తంగా రాజ్యాంగంలో పొందుపరిచిన రిజర్వేషన్లు తమ అభివృద్ధికి బాటలు వేస్తా యని ఆశించారు. కానీ అందుకు విరుద్ధమైన పరిస్థితులు, వాతావరణం వ్యాపించి ఉన్న సమయంలో రాజ్యాంగంపై పార్లమెంటులో చర్చ జరగడం గమనించాల్సిన విషయం. అక్షరాలా ఈ సభలోనే రాజ్యాంగ విరుద్ధమైన చర్యలు ఎన్నో గతంలో జరిగాయి. అచ్చోటనే మళ్లీ బాబాసాహెబ్ కలల ప్రపంచం రాజ్యాంగం గురించి చర్చ జరగడం అరుదైన ఘట్టం.

 

డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా జరిగిన ఈ చర్చ సరళిని పరిశీలిస్తే మాత్రం ఆశించిన స్థాయిలో లేదనే భావించాలి. ప్రతి పక్షం, విపక్షం తమ నిజాయితీని, నీతిని చాటుకోవడానికీ; తామే అంబేడ్క ర్‌ను, రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నామని చెప్పుకోవడానికీ ప్రయత్నించాయి. ప్రధాని నరేంద్రమోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లు అంబేడ్కర్ అభిప్రా యాలను పదే పదే ఉటంకించారు. రాజ్యాంగాన్ని ఒక పవిత్ర గ్రంథంగా, అంబేడ్కర్‌ను ఆదర్శవంతమైన నాయకుడిగా మోదీ కొనియాడారు. ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ తన అభిమతమని ప్రకటించారు. దాదాపు 7 దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో అంబేడ్కర్ ఆశించిన సమాజం, అందులో భాగంగా రూపుదిద్దుకున్న రాజ్యాంగం ఏ మేరకు అమలు అయ్యాయన్నది మనందరికీ తెలిసినదే. అంబేడ్కర్‌ని కొనియాడటమో, ఆయన జయంతిని ఆర్భాటంగా జరపడమో కాదు, ఆయన ఆలోచనలను ఏ మేరకు ఆచరించగలమనే దాని మీదే అంబేడ్కర్‌పై పాలకులకున్న గౌరవం ప్రతిబింబిస్తుంది.

 

భారత రాజ్యాంగం-అంబేడ్కర్ విడదీయరాని పదాలు. రచనాసభలో ఆయన చేసిన కృషి అనిర్వచనీయం. ఆ సభలో మాట్లాడుతూ అంబేడ్కర్ ‘షెడ్యూల్డ్ కులాల హక్కుల రక్షణకు రాజ్యాంగ సభలోకి నేను అడుగు పెట్టాను. అయితే నన్ను రాజ్యాంగ రచనా కమిటీలోకి తీసుకోవడం, ఆ కమి టీకి చైర్మన్‌గా నియమించడం నన్ను ఎంతగానో ఆకర్షించాయి’ అని  లక్ష్యాన్ని స్పష్టంగా ప్రకటించారు. అంటే ఆయన మిగతా విషయాలమీద దృష్టి పెట్ట లేదని కాదు. ఇక్కడ అంబేడ్కర్‌ను గౌరవించడమంటే- తరతరాలుగా అంట రాని కులాల పేరుతో వెలివేతకు, అణచివేతకు, దోపిడీకి గురైన ప్రజలను ఈ సమాజంలో మనుషులుగా గుర్తించడం. వారి అభ్యున్నతికి ఆయన రాజ్యాం గంలోను, బయట ప్రతిపాదించిన అభిప్రాయాలను ఆచరించడానికీ, అమలు చేయడానికీ పూనుకోవడమే అంబేడ్కర్‌ను అనుసరిస్తున్నామనడానికి గీటు రాయి. తాను ఆశించిన సమాజం నినాదాల ప్రాయం కారాదాని అంబే డ్కర్ భావించారు.

 

సమానత్వం, స్వేచ్ఛ సమాజానికి ఎంత ముఖ్యమో, సౌభ్రాతృత్వం కూడా అంతే ప్రధానమని అభిప్రాయపడ్డారు. ఆదర్శప్రాయ సమాజం మార్పునకు అనుకూలమై ఉండాలి. సంపదను, వనరులను సమా జం ఉమ్మడిగా అనుభవించగలిగే వాతావరణం ఉండాలి. అందరి మధ్య సోదరభావం ఉండాలి. దానినే సౌభ్రాతృత్వం అంటాం. అంటే ప్రజాస్వామ్య మని కూడా అర్థం.  దీనికి అనుగుణంగా అంబేడ్కర్ రాజ్యాంగంలో ప్రాథ మిక హక్కులు, ఆదేశిక సూత్రాలను రూపొందించారు. అయితే నేటి పరిస్థితు లకూ పైన పేర్కొన్న ఆదర్శ సమాజానికీ సారూప్యమేమైనా ఉన్నదా? దేవుడి దృష్టిలో మనుషులందరూ సమానమని ప్రచారం చేస్తుంటారు. కానీ ఈనాటికీ అంటరాని కులాలను దేవాలయాల్లోకి అనుమతించరు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ నిషేధాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నారు. కనీసం తాగునీటిని పొందడానికి కూడా దళితులకు అర్హతలేని స్థితి ఉంది. బావులు, చెరువులు ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో దళితులకు అందుబాటులో లేవు.

 

కేంద్ర మాజీ మంత్రి కుమారి సెల్జా కూడా తనకు గుజరాత్‌లోని బెట్ ద్వారకాలో ఎదురైన చేదు అనుభవం గురించి లోక్‌సభలోనే నిలదీశారు. పార్ల మెంటు సభ్యురాలైనా సెల్జాకే కులం గురించిన ప్రశ్న ఎదురైతే, ఇక సామాన్య దళితుల పరిస్థితి ఎలా ఉంటుంది? ఇది భారతీయ దళితులందరికీ ఏదో రోజు ఎదురైన అనుభవమే. దేవాలయంలో పూజ కోసం వెళితే పూజారి గోత్రం అడుగుతాడు. సమాజానికి ఆవల బతికిన దళితుడికి గోత్రం లేదు. ఒకవేళ ఎవరైనా కల్పించి చెప్పినా దానిని పసిగట్టగలిగే పరిజ్ఞానం పూజారికి జన్మతః వస్తుంది. కొన్ని దేవాలయాల్లో మహిళలకు ప్రవేశం ఉండదు. మరికొన్ని దేవాలయాల్లో పురుషులు కూడా పై వస్త్రం ధరించి వెళ్ళ కూడదు. దానితో జంధ్యం ఉన్నదీ లేనిదీ తెలిసిపోతుంది. అంటే ఏదో విధంగా భక్తుడి కులాన్ని పసిగట్టి దానికనుగుణంగా అతనికి గుడిలో గౌరవం దక్కే దుస్థితి ఎదురవుతుంది. చివరకు శ్మశానంలో కూడా అంటరాని కులాల వారికి స్థానంలేదు. వాగులు, వంకలే వారి అంతిమ సంస్కారానికి గతి అవుతాయి.

 

ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్  2013 దసరా సమ్మేళనం సందర్భంగా నాగ్‌పూర్‌లో చేసిన ప్రసంగంలో అందరికీ ఒకే దేవాలయం, ఒకే చోట నీరు, ఒకే శ్మశానం ఉండాలని పిలుపునిచ్చారు. అంటే ఈ వివక్ష ఉన్నట్టు వారు గుర్తించినట్టే కదా? అందుకే ఈ వివక్షని తొలగించడానికి ఒక కార్యాచరణ అనివార్యం. మళ్లీ ఇక్కడ అంబేడ్కర్ ప్రతిపాదించిన కార్యక్ర మాన్ని గుర్తుచేసుకోవాలి. చరిత్రాత్మకమైన కుల నిర్మూలన పుస్తకంలో ఒక నిర్దిష్ట కార్యాచరణని ఆయన ప్రకటించారు. మార్పును కోరుకునే వారు ఈ ప్రతిపాదనల గురించి ఆలోచించాలి. ప్రధాని మోదీ ‘ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్’ నినాదం నిజం కావాలని నిజంగా కోరుకుంటే అంబేడ్కర్ ప్రతి పాదించిన అంశాలు ప్రాతిపదికగా నిలవాలి. కానీ తాను ప్రకటించిన విష యాలను అంగీకరించాలని, వీటినే అమలు చేయాలని అంబేడ్కర్ ఫర్మానా జారీ చేయలేదు. మనుషులంతా ఒక్కటే అనే భావనను నమ్మితే వీటి గురించి ఆలోచించాలి. కుల నిర్మూలనకు అంబేడ్కర్ ప్రతిపాదించిన విషయాలు-

 

1.  హిందువులందరికీ ఆమోదయోగ్యమైన, వారందరి చేత గుర్తింపునకు నోచుకున్న ఒకే ఒక ప్రామాణిక మత గ్రంథం రూపొందాలి. ఈ గ్రంథం ఒక్కటే హిందువులందరికీ అధికారిక గ్రంథమై ఉండాలి. ఇతర గ్రంథాల ప్రామాణికతను రద్దు చేయాలి.

2.  హిందువులలో అర్చకత్వాన్ని రద్దు చేయాలి. అది సాధ్యం కాకపోతే వంశపారంపర్యంగా, కులం ప్రాతిపదికగా అర్చకత్వాన్ని అమలు చేయరాదు. నూతనంగా రూపొందిన హిందూ గ్రంథం ఆధారంగా నడుచుకునే ఏ వ్యక్తికైనా పూజారి కావడానికి అర్హత ఉండాలి. నిర్ణీత పరీక్ష లో నెగ్గిన వ్యక్తి మాత్రమే పూజారి కావడానికి అర్హుడు.

 

అంబేడ్కర్ ఇంకా చాలా విషయాలు ప్రతిపాదించారు. ముందుగా ఈ రెండు విషయాలపైన చర్చ జరగాలి. వీటికి సరైన పరిష్కారం లభించనట్ల యితే ప్రత్యామ్నాయమైనా చూపాలి. ‘ఏక్ భారత్’ అంటున్నారు కాబట్టే ఈ ప్రతిపాదన. ఒకవేళ తామంతా సనాతన ధర్మానికే కట్టుబడి ఉంటాం, మార్పు అక్కర్లేదని ప్రకటిస్తే ఈ చర్చే లేదు. అంబేడ్కర్‌ను గౌరవిస్తున్నామని ప్రకటి స్తున్న వాళ్లు కనీసం దీనిపైన చర్చ జరిపి, ఆచరణాత్మకమైన కార్యక్రమాన్ని ప్రకటించాలి. ఇక రెండో విషయం, రాజ్యాంగం. పైన పేర్కొన్నట్లే ఎస్సీ, ఎస్టీల రక్షణ కోసం పొందుపరిచిన ఆర్టికల్స్ అమలుపై దృష్టి సారించాలి. వేల ఏళ్ల వివక్ష కారణంగా విద్య, ఆర్థిక రంగంలో వెనుకబడిన ఆ వర్గాల అభ్యు న్నతి కోసం  46వ ఆర్టికల్‌ను రాజ్యాంగంలో చేర్చారు. ‘అన్ని రకాల దోపిడీ, అన్యాయాల నుంచి బలహీనవర్గాలను ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీలను రక్షించ డానికి, విద్య, ఆర్థికరంగాల్లో వారిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం శ్రద్ధ వహించాలి’.

 

రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి అంబేడ్కర్ ప్రతిపా దించిన కీలకాంశం ఇది. దీనితోనే విద్యారంగంలో స్కాలర్‌షిప్స్, ప్రత్యేక వసతిగృహాలు ఏర్పాటయ్యాయి. 1974 నుంచి ఎస్సీ, ఎస్టీ ఫైనాన్స్ కోఆపరే టివ్ వ్యవస్థలూ వచ్చాయి. కానీ నిధుల కొరతతో అవి పరిమిత ప్రయోజ నాన్ని మాత్రమే సాధించాయి. ఈ అనుభవంతో ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లలో జనాభా ప్రాతిపదికగా వాటా కల్పించాలని ప్రభు త్వాలు నిర్ణయించాయి. 1974 నుంచి ట్రైబల్ సబ్‌ప్లాన్, 1980 నుంచి స్పెషల్ కాంపోనెంట్ ప్లాన్ అమలులోకి వచ్చాయి. ఏ రాష్ట్రం, చివరకు కేంద్రం కూడా ఈ పథకాన్ని సక్రమంగా అమలు చేయడానికి పూనుకోలేదు. ప్రజా ఉద్యమం ఫలితంగా మూడేళ్ల క్రితం డిసెంబర్ 2వ తేదీ అర్ధరాత్రి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సబ్ ప్లాన్ అమలుకోసం చట్టాన్ని తీసుకొచ్చింది. అసెంబ్లీ చరిత్రలోనే రెండు రోజులు దళితుల ఆర్థిక వాటాపై అసెంబ్లీ చర్చంచి ఈ చట్టానికి ఆమోద ముద్ర వేసింది. ఆ తర్వాత కర్ణాటక ప్రభుత్వం అలాంటి చట్టాన్నే రూపొందిం చుకున్నది. కానీ కేంద్రస్థాయిలో ఇప్పటివరకు ఇటువంటి చట్టం లేదు. యూపీఏ-2 ప్రభుత్వం సబ్‌ప్లాన్ చట్టాన్ని తేవడానికి ముసాయిదాను రూపొందించింది. అది చట్టరూపం దాల్చలేదు.

 

ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లున్నా, ప్రమోషన్లలో ఆ అవకాశం లేదు. అందుకు కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ-2 లోక్‌సభలో ప్రవేశ పెట్టిన ప్రమోషన్లలో రిజర్వేషన్ బిల్లు కాగితాలను సమాజ్‌వాది పార్టీ సభ్యు లు చించి, అడ్డుకున్నారు. ఇంకా అనేక పథకాలు కాగితాల మీదే ఉన్నాయి. రాజ్యాంగంపై జరిగిన చర్చ అనంతరమైనా ఈ విషయాలపై దృష్టిసారిస్తే అంబేడ్కర్‌పై గౌరవం, రాజ్యాంగంపై విశ్వాసం ఉన్నట్టు అనుకోవాలి. లేదం టే మరోసారి భారత ప్రజలు, ప్రత్యేకించి దళితులు, ఆదివాసులు పార్ల మెంటు సాక్షిగా పరాభవం పాలైనట్టు భావించాలి.

- మల్లెపల్లి లక్ష్మయ్య

 (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు) మొబైల్: 97055 66213

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement