యాభై నాలుగు శాతం ఉన్న బీసీ జనాభాను నిర్లక్ష్యం చేస్తే రాజకీయ పార్టీల చరిత్ర ముగించేలా ఉద్యమం చేపడతామని బీసీ ....
బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన హెచ్చరిక
మాచర్ల : యాభై నాలుగు శాతం ఉన్న బీసీ జనాభాను నిర్లక్ష్యం చేస్తే రాజకీయ పార్టీల చరిత్ర ముగించేలా ఉద్యమం చేపడతామని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావుగౌడ్ హెచ్చరించారు. పట్టణానికి వచ్చిన ఆయన శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. 54 శాతం ఉన్న బీసీ జాతి హక్కులను భంగపరిచేలా వ్యవహరిస్తూ 6 శాతమున్న కాపుల కోసం రాజకీయ పార్టీలు కుల రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. అధిక శాతం జనాభా కలిగిన బీసీల జాతికి అన్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ విరుద్ధంగా బీసీలలో కాపులను చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.
రాజ్యాంగబద్ధంగా హక్కు కలిగి ఉన్న బీసీల ప్రయోజనాలను నెరవేర్చకుండా స్వార్థ రాజకీయాల కోసం ప్రభుత్వం, కొన్ని రాజకీయ పార్టీలు కాపులను బీసీల్లో చేర్చాలని కోరటం తీవ్ర ఆక్షేపణీయమన్నారు. 13 జిల్లాల్లో బీసీలను చైతన్యపరిచి సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేసి బీసీల కోసం ప్రాణాలు అర్పించేందుకు సిద్ధమౌతామన్నారు. బీసీల ప్రయోజనాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాజకీయ పార్టీలను పాతరేసేందుకు బీసీలను సిద్ధపరుస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకల నాగేశ్వరరావు యాదవ్, జిల్లా అధ్యక్షుడు ఈడెబోయిన మురళీ, జిల్లా యాదవ సంఘ ఉపాధ్యక్షుడు జీవీ, మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల ఏడుకొండలు పాల్గొన్నారు.