
బీసీల సంక్షేమమే ధ్యేయం
► కుల వృత్తుల చేయూతకు ఆదరణ బీసీల అభివృద్ధికి రూ.8,832 కోట్లు
► కర్నూలు నుంచి అమరావతికి నాలుగు లైన్ల రహదారికి శ్రీకారం
► చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి
► ప్రతి జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో బీసీ భవన్ - బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర
కర్నూలు(అర్బన్): బీసీల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. ఈ నేపథ్యంలోనే బీసీల అభివృద్ధికి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.8,832 కోట్లను కేటాయించామన్నారు. చంద్రన్న స్వయం ఉపాధి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం స్థానిక ఎస్‌టీబీసీ కళాశాల మైదానంలో నిర్వహించిన బీసీ రుణ మేళాకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు ఆర్థిక చేయూత అందించేందుకు మొదటి విడతగా రూ.126 కోట్లు, రెండవ విడతగా రూ.114 కోట్లు, మూడవ విడతగా రూ.69 కోట్లను విడుదల చేసినట్లు చెప్పా రు.
అంతరించిపోతున్న చేతి వృ త్తులను ఆదుకునేందుకు ఆదరణ పథకాన్ని ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బడ్జెట్ రాకున్నా, ఎస్సీ,ఎస్టీ సబ్‌ప్లాన్ అమలవుతున్న విధంగానే బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులను విడుదల చేస్తున్నామన్నారు. నూతన రాజధాని అమరావతికి కర్నూలు నుంచి నాలుగు గంటల్లో చేరుకునేందుకు వీలుగా 10 రోజుల్లో నాలుగు లైన్ల రోడ్డు ఏర్పాటుకు శ్రీకారం చుడుతున్నట్లు తెలిపారు.
రూ.5 కోట్లతో బీసీ భవన్ నిర్మాణాలు : మంత్రి కొల్లు రవీంద్ర
రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో రూ.5 కోట్లతో బీసీ భవన్లను నిర్మిస్తామని, ఈ కార్యక్రమం కర్నూలు నుంచే ప్రారంభం కానుందని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. స్వర్గీయ ఎన్‌టీ రామారావు వెనుకబడిన కులాలకు ఇచ్చిన చేయూత, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లతో అనేక మంది బీసీలు రాజకీయంగా ఎదిగారన్నారు. 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో బీసీ కార్పొరేషన్లు పూర్తిగాా నిర్వీర్యమయ్యాయనిఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫీజు రీయంబర్స్‌మెంటుకు రూ.1600 కోట్లు విడుదల చేశామన్నారు. వచ్చే ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ఫెడరేషన్లను ఆర్థికంగా బలోపేతం చేస్తామన్నారు.
బీసీ భవన్‌కు వారంలో ఐదు ఎకరాల స్థలం ... జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
జిల్లా కేంద్రంలో రూ.5 కోట్లతో నిర్మించనున్న బీసీ భవన్‌కు వారం రోజుల్లో ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ చెప్పారు. బీసీ కార్పొరేషన్ ద్వారా వె నుకబడిన కులాల వారికి రుణాలు ఇప్పించేందుకు పలుమార్లు బ్యాంకర్ల సమావేశాలు నిర్వహించామన్నారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల మందికి రుణ సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. బీసీ స్టడీ సర్కిల్‌లో నిష్ణాతులైన ఫ్యాకల్టీ ఉండేలా చర్యలు చేపడతామన్నారు.
రూ.69 కోట్ల మెగా చెక్ విడుదల ...
2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బీసీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ విడుదల చేసేందుకు మూడవ విడతగా రూ.69 కోట్ల మెగా చెక్‌ను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, బీసీ కార్పొరేషన్ చైర్మన్ పి. రంగనాయకులు విడుదల చేశారు. అలాగే జిల్లాలోని 4,067 మంది లబ్ధిదారులకు సంబంధించిన రూ.33 కోట్ల చెక్‌ను కూడా విడుదల చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎం మణిగాంధీ, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, బీసీ కార్పొరేషన్ మేనేజింగ్ డెరైక్టర్ హర్శవర్దన్, మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, డెరైక్టర్లు బొల్లా వెంకన్న, వినుకొండ సుబ్రమణ్యం, గొర్రెల సహకార సంఘం చైర్మన్ వై. నాగేశ్వరరావుయాదవ్, కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, బీసీ కార్పొరేషన్ ఈడీ పీవీ రమణ, ఏఈఓ సుబ్రమణ్యం, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి బి. సంజీవరాజు, జెడ్పీ వైస్ చైర్మన్ పుష్పావతి, తెలుగు మహిళ నాయకురాలు అంకం విజయ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్, ఎం. రాంబాబు, రాయలసీమ కన్వీనర్ వాడాల నాగరాజు, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, కె. రామకృష్ణ, కేతూరి మధు తదితరులు పాల్గొన్నారు.