
తెలుగు రాష్ట్రాల సీఎంలు భారత యూనియన్ గురించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రాంతీయ పార్టీలతో ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు తనవంతుగా కేంద్రం మిథ్య రాష్ట్రాలే నిజం అంటూ ఎన్టీరామారావు భావనను మళ్లీ తలకెత్తుకుంటున్నారు. ఇది పూర్తిగా తప్పు భావన. భారతదేశం ఫెడరేషన్ కానేకాదు. అది రాష్ట్రాల యూనియన్ మాత్రమే. 1947కి ముందు దేశంలో రాష్ట్రాలు అనేవే లేవు. బ్రిటిష్ పాలన కింది ప్రాదేశిక ప్రాంతాలు మాత్రమే ఉండేవి. 500 స్థానిక సంస్థానాలు నవాబులు, రాజాలు, మహారాజుల పాలనలో ఉండేవి. 1947 భారత స్వాతంత్య్ర చట్టం ప్రకారం హైదరాబాద్, కశ్మీర్ తప్ప తక్కిన 500 సంస్థానాలు ఇండియన్ యూనియన్ లేక పాకిస్తాన్‌లో విలీనమయ్యాయి. ఈ విలీనం కూడా ఇండియన్ యూనియన్‌తోనే కానీ ఫెడరల్ స్టేట్ ఆఫ్ ఇండియాతో కాదన్నది వాస్తవం. భారత రాజ్యాంగం కూడా ఇండియన్ యూనియన్ అనే పదాన్నే ఉపయోగించింది తప్పితే ఇండియన్ ఫెడరేషన్‌ని కాదు. భారత యూనియన్, రాష్ట్రాల మధ్య అధికారాల విభజన జరిగింది. ఇండియన్ యూనియన్‌తో లేని రాష్ట్రాలు 18వ శతాబ్ది నాటి అస్థిరత్వ కేంద్రాలైన సంస్థానాలనే గుర్తుకు తెస్తాయి. ప్రాంతీయవాదం, భాషా వాదం, కులతత్వం, మతతత్వం వంటి ఆలోచనలను నాయకులు, రాజకీయ పార్టీలు ప్రేరేపించినట్లయితే దేశం మళ్లీ స్వాతంత్య్రాన్ని కోల్పోవడం ఖాయమంటూ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ రాజేం ద్రప్రసాద్ రాజ్యాంగ సభ ముగింపు సమావేశంలో చేసిన హెచ్చరికలను మర్చిపోకూడదు.
-త్రిపురనేని హనుమాన్ చౌదరి,ప్రజ్ఞాభారతి చైర్మన్, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment