
సాక్షి, హైదరాబాద్: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమ తా బెనర్జీపై కేంద్ర వైఖరి పట్ల సీఎం కేసీఆర్ ఎందుకు స్పందించట్లేదని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి ప్రశ్నించారు. ‘రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తూ, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చేయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని కేసీఆర్ పదేపదే చెబుతుంటారు. ఈ పరిస్థితుల్లో మార్పు తెచ్చేందుకే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నానని ఆయన ప్రకటించారు. కేసీఆర్ ప్రతిపాదనను సమర్థించిన మమతా బెనర్జీ 2 రోజులుగా కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందంటున్నారు. మరి ఈ పరిస్థితుల్లో మమతకు మద్దతుగా, కేంద్ర వైఖరిని నిరసిస్తూ కేసీఆర్ ఎందు కు మాట్లాడటం లేదు?’అని విజయశాంతి ప్రశ్నించారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ పరిధిలోకి ఈ అంశం రాదా? లేక కొన్ని విషయాలను చూసి, చూడనట్లు వదిలేయడం ఫెడరల్ ఫ్రంట్ ఎజెండాలో భాగమా? అని ఎద్దేవా చేశారు.