తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ
కోల్‌కతా : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. పశ్చిమ బెంగాల్ సచివాలయంలో ఈ భేటీ జరుగుతోంది. ఈ సందర్భంగా సచివాలయం చేరుకున్న కేసీఆర్‌కు మమతా బెనర్జీ స్వాగతం పలికారు. మమతాతో కేసీఆర్ దాదాపు రెండు గంటలపాటు సమావేశమై కొత్త కూటమి ఏర్పాటు సన్నాహాలపై చర్చించనున్నారు. కాగా దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటును ప్రతిపాదిస్తూ కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ దిశగా కార్యాచరణలో భాగంగా ఆయన ఇవాళ మమతతో సమావేశం అయ్యారు. అంతకు ముందు కేసీఆర్‌కు నేతాజీ విమానాశ్రయంలో మంత్రి పూర్ణేంద్ర ఘన స్వాగతం పలికారు.
మమతతో సమావేశం అనంతరం కేసీఆర్ కాళీ ఘాట్‌లోని కాళికామాత ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 7.30కు అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. ఇక కేసీఆర్ వెంట ఎంపీ వినోద్ కుమార్, కవిత, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు పార్టీ ముఖ్యనేతలు కూడా కోల్‌కతా వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment