
సాక్షి, హైదరాబాద్ : దేశంలో కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా కొత్త కూటమి ఏర్పాటును ప్రతిపాదిస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు... ఫెడరల్ ఫ్రంట్ దిశగా కార్యాచరణలో భాగంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీతో సోమవారం భేటీకానున్నారు. ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్న సీఎం.. 11.30 గంటలకు అక్కణ్నుంచి బయల్దేరి ఉదయం 11.45కు బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కోల్‌కతా బయలుదేరనున్నారు.
ముఖ్యమంత్రి వెంట ఎంపీ వినోద్‌కుమార్, రాజ్యసభ సభ్యుడు కె. కేశవరావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, పలువురు పార్టీ ముఖ్య నేతలతో కలపి మొత్తం 12 మంది వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకొని అక్కణ్నుంచి తాజ్ బెంగాల్ హోటల్‌కు చేరుకుంటారు. సీఎం అక్కడే మధ్యాహ్న భోజనం చేసి ఆపై పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ నాయకులను కలుసుకునే అవకాశాలున్నాయి. మధ్యాహ్నం 3.15 నిమిషాలకు అక్కడి పశ్చిమ బెంగాల్ సచివాలయం చేరుకొని 3.30 గంటలకు ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో భేటీ అవుతారు. మమతతో దాదాపు రెండు గంటలపాటు సమావేశమై కొత్త కూటమి ఏర్పాటు సన్నాహాలపై చర్చిస్తారు.
సాయంత్రం 5:30కు అక్కణ్నుంచి తాజ్ బెంగాల్ హోటల్‌కు వెళ్లి.. ఆ తర్వాత కాళీ ఘాట్‌లోని కాళికామాత ఆలయాన్ని దర్శించుకుంటారు. రాత్రి 7.30కు అక్కణ్నుంచి ప్రత్యేక విమానంలో తిరుగు పయనమవుతారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం పోరాడతానని ఇటీవల ప్రకటించిన సీఎం కేసీఆర్... తనకు మమత మద్దతు తెలిపినట్లు వెల్లడించారు. ఈ అంశంపై ప్రాంతీయ పార్టీలను ఏకతాటిపైకి తెచ్చే కార్యాచరణను ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఆయన మమతా బెనర్జీతో తొలిసారిగా భేటీ అవుతుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.