
కోల్‌కతా : కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పులు తీసుకువస్తానన్న తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర్ రావు ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో భేటీ అయిన కేసీఆర్.. ఈరోజు(సోమవారం) కోల్‌కతా చేరుకున్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయమై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో ఆ రాష్ట్ర సెక్రటేరియట్‌కు చేరుకున్న కేసీఆర్‌ను దీదీ సాదరంగా ఆహ్వానించారు. ఇక ఈ భేటీ అనంతరం కేసీఆర్ కోల్‌కతాలోని కాళీమాత ఆలయాన్ని సందర్శించనున్నారు. ఆ తర్వాత ఢిల్లీకి బయల్దేరి వెళతారు. అక్కడే ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాంతీయ పార్టీ అధినేతలు, మాజీ ముఖ్యమంత్రులు మాయావతి(బీఎస్పీ), అఖిలేష్ యాదవ్(ఎస్పీ)లను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా రానున్ను సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్ష కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించిన బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మొదట కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు. అయితే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల సీఎంల(కాంగ్రెస్) ప్రమాణస్వీకారోత్సవానికి ఆమె హాజరుకాకపోవడంతో ప్రస్తుతం కేసీఆర్‌తో భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment