
సాక్షి, చెన్నై: తమిళనాడులోని 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల ప్రచారంలో డీఎంకే చీఫ్ స్టాలిన్ బిజీగా ఉన్నారని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. అందుకే మే 13న కేసీఆర్‌తో సమావేశానికి స్టాలిన్ అందుబాటులో ఉండడం లేదని తెలిపాయి. తమిళనాట మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో పూర్తిగా పైచేయి సాధించడంపై దృష్టిపెట్టిన స్టాలిన్.. ఉప ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ స్థానాల్లో డీఎంకే గెలిస్తే.. అధికార అన్నాడీఎంకే ప్రభుత్వానికి అసెంబ్లీలో అవసరమైనంత మెజారిటీ తగ్గనుంది. అందుకే స్టాలిన్ సీరియస్‌గా తీసుకుని ఈ నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ కారణంతోనే సీఎం కేసీఆర్‌ను కలవలేకపోతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. గతేడాది సీఎం కేసీఆర్ చెన్నైకు వచ్చిన సమయంలో డీఎంకే దివంగత అధినేత ఎం.కరుణానిధితో గోపాలపురంలో భేటీ అయ్యారు. తర్వాత అళ్వార్‌పేటలో డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో కొన్ని గంటల పాటు సమాలోచనలు జరిపిన సంగతి తెలిసిందే.