సోమవారం తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్‌లో కేరళ సీఎం విజయన్‌తో సమావేశమైన సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా రాష్ట్రాల హక్కులను కాపాడాలని సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీల నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల హక్కులను విస్మరించాయని ఆరోపించారు. ఈ రెండు ప్రభుత్వాల పాలనలో దేశం అభివృద్ధి చెందడం లేదని సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. ప్రాంతీయ పార్టీలను ఒకతాటిపైకి తెచ్చి సమాఖ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తేనే దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు, అభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్‌హౌస్‌లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌తో సీఎం కేసీఆర్ సమావేశమై గంటన్నర పాటు చర్చలు జరిపారు. వేసవి విడిదిలో భాగంగా కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం మధ్యాహ్నం ఆయన కేరళ పర్యటనకు బయలుదేరి వెళ్లిన సందర్భంగా అక్కడి సీఎంను కలుసుకున్నారు.
సోమవారం సీఎం కేసీఆర్‌కు పుష్పగుచ్ఛమిస్తున్న కేరళ సీఎం పినరయి విజయన్. చిత్రంలో ఎంపీలు వినోద్‌కుమార్, సంతోష్‌కుమార్
దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల సరళి, ఎన్నికల తదనంతర పరిణామాలు, ఫెడరల్ కూటమి ఏర్పాటు తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి. రాష్ట్రాలకు పన్నుల వాటా చెల్లించడంలో కేంద్రం అన్యాయం చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్రాలు పోరాడాల్సిన అవసరముందని ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయంపై 15వ ఆర్థిక సంఘానికి సమగ్ర నివేదిక సమర్పించినట్లు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల్లో అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఈ భేటీలో చర్చ జరిగింది. రాష్ట్రంలో నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు ఎత్తిపోతల వంటి భారీ సాగునీటి ప్రాజెక్టులు, రైతుబంధు, రైతుబీమా గురించి కేరళ సీఎంకు కేసీఆర్ వివరించారు. ఈ భేటీలో సీఎంతో పాటు కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ పాల్గొన్నారు.
పద్మనాభస్వామి ఆలయంలో పూజలు చేసి వస్తున్న సీఎం కేసీఆర్ దంపతులు
అనంత పద్మనాభుడికి పూజలు
కేరళ సీఎంతో భేటీకి ముందు కేసీఆర్.. అనంత పద్మనాభస్వామిని దర్శించు కున్నారు. సతీమణి శోభ, మనుమడు హిమాంశు, మనువరాలు అలేఖ్య, ఇతర కుటుంబ సభ్యులు, పార్టీ నేతలతో కలిసి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వ దించారు. అంతకు ముందు సీఎం కేసీఆర్‌కు తిరువనంతపురం విమానాశ్రయంలో తెలుగు సంఘాల ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు.
13న చెన్నైలో స్టాలిన్‌తో భేటీ
సీఎం కేసీఆర్ వారం రోజుల పాటు కేరళలోనే గడపనున్నారు. అక్కడి ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలను సందర్శించనున్నారు. అనంతరం ఈ నెల 13న తమిళనాడుకు బయలుదేరి వెళ్లనున్నారు. 13న సాయంత్రం 4.30 గంటలకు చెన్నైలో డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌తో ఆయన నివాసంలో సమావేశం కానున్నారు. దేశ రాజకీయాలు, లోక్‌సభ ఎన్నికల అనంతర పరిణామాలు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదే రోజు హైదరాబాద్‌కు తిరిగి చేరుకోనున్నారు. ఇదిలా ఉండగా, కేరళ, తమిళనాడు పర్యటనల నేపథ్యంలో కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి సోమవారం ఉదయం సీఎం కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఈ పర్యటనలో వివరాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment